మెట్రో ఫేజ్ 2: ఆరు కారిడార్లు..116.4 కిలో మీటర్లు

మెట్రో ఫేజ్ 2: ఆరు కారిడార్లు..116.4 కిలో మీటర్లు
  • మెట్రో ఫేజ్ 2 పనులకు పరిపాలనా అనుమతులు
  • పార్ట్ ఏ, పార్ట్ బీగా కారిడార్ల విభజన
  • పార్ట్​ ఏ పనులకు ఆమోదం తెలిపిన సర్కార్​
  • అంచనా వ్యయం రూ.24,269 కోట్లుగా ప్రతిపాదన

హైదరాబాద్, వెలుగు:  హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పనులపై రాష్ట్ర సర్కారు వేగం పెంచింది. రెండో ఫేజ్​లో 116.4 కిలో మీటర్ల మేర మెట్రోను విస్తరించాలని నిర్ణయించిన సర్కారు.. ఆ పనులను పార్ట్​ ఏ, పార్ట్ బీలుగా విభజించింది. పార్ట్ ఏలో ఐదు కారిడార్​లు, పార్టీ బీలో ఒక కారిడార్ ఉండనున్నాయి. మొత్తం ఆరు కారిడార్లుగా మెట్రో సెకండ్ ఫేజ్ పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శనివారం మున్సిపల్ అండ్ అర్బన్​ డెవలప్​మెంట్ డిపార్ట్​మెంట్ పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్ట్​ఏలోని ఐదు కారిడార్లను 76.4 కిలో మీటర్ల మేర నిర్మించనుండగా.. పార్ట్ బీలోని మరో కారిడార్​ను 40 కిలో మీటర్లు నిర్మించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అయితే, ప్రస్తుతానికి పార్ట్ బీలోని కారిడార్​ను మినహాయించి పార్ట్​ఏలోని పనులకు రూ.24,269 కోట్లు ఖర్చు అవుతాయని తెలిపింది. ఖర్చులో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమానంగా భరించనున్నాయి.

ఇవీ కారిడార్​లు..

పార్ట్​లో ఏలో భాగంగా కారిడార్ 4, కారిడార్​5, కారిడార్ 6, కారిడార్ 7, కారిడార్ 8లుగా మెట్రోను విస్తరించనున్నారు. కారిడార్​ 4లో నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్టు వరకు (ఎయిర్​పోర్ట్ కారిడార్)ను 36.8 కిలో మీటర్ల మేర విస్తరించనున్నారు. కారిడార్ 5లో రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలో మీటర్లు, కారిడార్​6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట (ఓల్డ్​సిటీ కారిడార్) వరకు 7.5 కిలో మీటర్లు, కారిడార్​లో 7లో మియాపూర్ నుంచి పటాన్​చెరు వరకు 13.4 కిలో మీటర్లు, కారిడార్ 8లో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలో మీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టనున్నారు.  పార్ట్ బీలోని కారిడార్​9లో రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) వరకు 40 కిలో మీటర్ల మేర మెట్రోను చేపట్టాలని నిర్ణయించారు. అయితే, కారిడార్ 9కు సంబంధించి అలైన్​మెంట్, ఇతర ఫీచర్లు, అంచనా వ్యయాలపై ఇంకా కసరత్తు జరుగుతున్నది. ఫీల్డ్ సర్వేలు కొనసాగుతున్నాయి.

ఇదీ కాస్ట్ బ్రేకప్..

అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. మెట్రో ఫేజ్ 2లో భాగంగా పార్ట్ ఏలోని ఐదు కారిడార్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం అంచనా వ్యయం రూ.24,269 కోట్లలో తెలంగాణ ప్రభుత్వ వాటాగా రూ.7,313 కోట్లు (30%), కేంద్ర ప్రభుత్వం వాటాగా రూ.4,230 కోట్లు (18 శాతం) భరించనున్నాయి. మిగతా మొత్తంలో రూ.11,693 కోట్లను (48%) జైకా, ఏడీబీ, ఎన్​డీబీ వంటి సంస్థల నుంచి రుణాలుగా సమీకరించనున్నారు. మరో రూ.1,033 కోట్లను (4%) పీపీపీ పద్ధతిలో సేకరించనున్నారు.