నేతన్నకు అభయ హస్తం..వయసు సడలింపుతో అన్ని కుటుంబాలకూ ప్రయోజనం

నేతన్నకు అభయ హస్తం..వయసు సడలింపుతో అన్ని కుటుంబాలకూ ప్రయోజనం
  • చేనేత,పవర్లూం కార్మికులకు నేతన్న భద్రత
  • నేతన్న పొదుపు తో  రెట్టింపు డబ్బులు
  •  తక్షణ అమలుకు గైడ్ లైన్స్ జారీ చేసిన సర్కార్​ 

రాజన్నసిరిసిల్ల,వెలుగు : సిరిసిల్ల నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురందించింది.   ఇప్పటికే ఏడాదంతా పని కల్పించేందుకు నెల రోజుల కిందట సెల్ప్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు అందించే చీరల క్లాత్ ఆర్డర్ ఇచ్చింది. తాజాగా నేతన్న అభయ హస్తం పేరుతో మరో స్కీం ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే అమలులో ఉన్న నేతన్నల పొదుపు నిధి, నేత్నన  భద్రత,నేతన్నల భరోసాలను కలిపి అభయహస్తం పేరుతో కొత్త స్కీం కు శ్రీకారం చుట్టింది. 

నేతన్న పొదుపుతో లాభం

'నేతన్న పొదుపు'తో నేత కార్మికులకు లబ్ధి  చేకూరనుంది. కార్మికులు తన జీతం నుంచి నేతన్న పొదుపు లో  ఎంత చెల్లిస్తే దానికి ప్రభుత్వం 8శాతం కలిపి 24 నెలల్లో కార్మికునికి అందిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నేతన్న చేయూత కింద  డబ్బులు పొదుపు చేసుకుంటే 36 నెలలకు కార్మికునికి అందించేవారు.     కాంగ్రెస్ ప్రభుత్వం 36 నెలల నుంచి కేవలం 24 నెలలకు కుదించింది. 

కార్మికుడు రోజుకు రూ. వెయ్యి  సంపాదిస్తే అందులో 8శాతం అంటే   రూ. 80 చెల్లిస్తే ప్రభుత్వం మరో రూ.80 కలిపి 24 నెలలకు   అందిస్తోంది. సిరిసిల్లలో కరోనా కాలంలో నేతన్నలు పొదుపు చేసుకున్న డబ్బులు ఎంతోగానో ఉపయోగపడ్డాయి. గతంలో పవర్లూమ్​  కార్మికులు 5720 మంది పొదుపు స్కీం లో చేరారు. తాజాగా ఈ స్కీంలో మరింత మందిని చేర్చేందుకు చేనేత జౌళిశాఖ ఆఫీసర్లు మోటివేట్ చేస్తున్నారు. 

నేతన్న భద్రత..వయసు సడలింపు

మరణించిన నేతన్నల పేరుమీద కుటుంబానికి ‘నేతన్న భద్రత’  స్కీం కిందట రాష్ట్ర ప్రభుత్వం  రూ. 5లక్షల బీమా అందజేస్తోంది. గత ప్రభుత్వ 'నేతన్న భీమా' పేరుతో 18 నుంచి 59 ఏళ్ల లోపు వారికి మాత్రమే భీమా వర్తింప చేశారు.   కాంగ్రెస్ సర్కార్ నేతన్న భద్రత పేరిట ఏజ్ లిమిట్ ని తీసివేసింది. 18 ఏండ్లు నిండిన ఎవరైనా  నేతన్న వృత్తిలో ఉంటే చాలు ఈ స్కీం ను వర్తింప చేసేందుకు ఏజ్ లిమిట్ ను  సడలించింది.సిరిసిల్లలో వస్త్ర ఉత్పత్తిలో ఎక్కువ మంది వయసు పై బడిన వారుండటంతో ఈ ఏజ్ సడిలింపు ప్రయోజనం చేకూర్చుతోంది. .

నేతన్నలకు భరోసా కు రూ. 44 కోట్ల కేటాయింపు

అభయ హస్తం లో భాగంగా నేతన్నలకు భరోసా స్కీం ను సర్కార్ తెచ్చింది. ఈ స్కీం అమలు కోసం ఇప్పటికే రూ. 44 కోట్లు కేటాయించింది. చేనేత, పవర్లూం ,ఇతర అనుబంద రంగాల కార్మికుల కోసం ఆర్థిక సాయం అందించడానికి ఈ స్కీం ను రూపకల్పన చేశారు. వస్త్రోత్పత్తిలో  పని చేసే కార్మికులకు ఏడాదికి రూ. 18 వేలు,ఇతర అనుబంద కార్మికులకు రూ. 6వేలు అందించేందుకు విదివిధానాలు రూపొందిస్తోందని ఆఫీసర్లు చెప్తున్నారు. 

సిరిసిల్ల నేతన్నలకు మంచి రోజులు

సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమను కాంగ్రెస్ సర్కార్ గాడిలో పెడుతోంది. బతుకమ్మ చీరల బకాయిలతో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన నేతన్నలను కాంగ్రెస్ సర్కార్ అపన్న హస్తం అందిస్తోంది. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన  బకాయిలన్నీ క్లియర్ చేయడంతో పాటు ఆర్వీఎం,ఎస్ హెచ్ గ్రూప్ మహిళలకు అందించే చీరల క్లాత్ 4.24 కోట్ల మీటర్ల  ఆర్డర్ లను సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం ఇచ్చింది. రూ. 50 కోట్లతో యారన్ బ్యాంక్ ను వేములవాడలో ఏర్పాటు చేసింది. ఇలా నేతన్నలకు ఏడాదంతా పని కల్పించేందుకు చిత్తశుద్దితో ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో సిరిసిల్ల నేతన్నలో హర్షం వ్యక్తమవుతోంది.

అభయ హస్తంతో నేతన్నలకు ప్రయోజనం

చేనేత అభయ హస్తం స్కీం కోసం ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ అందాయి. నేతన్నల కుటుంబాలకు ధీమా కల్పిచేందుకు నేతన్న భద్రత స్కీంలో వయసు నిబందనలు సడలించారు.గతంలో 18 ఏండ్ల నుంచి 59 వరకు వయసున్న వారికి మాత్రమే నేతన్న భద్రత స్కీం వర్తించేది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏజ్ లిమిట్ ను ఎత్తేసింది. దీంతో చాలా మంది వృద్ద నేతన్నలు ఈ స్కీంకు అర్హులు అవుతారు. 

- చేనేత జౌళిశాఖ ఏడీ సాగర్