
- సభ్యులుగా మరో 11 మంది ఉన్నతాధికారులు
- ఫ్యూచర్ సిటీలో 7 మండలాల్లోని 56 గ్రామాలు
- ఎఫ్ సీడీఏ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ
హైదరాబాద్, వెలుగు:ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ(ఎఫ్ సీడీఏ)ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి సీఎం చైర్మన్ గా, మున్సిపల్ లేదా పరిశ్రమల శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ జీవో నంబర్ 69 జారీ చేశారు. సీఎం, మున్సిపల్ మంత్రితో పాటు మరో 11 మంది ఈ అథారిటీలో సభ్యులుగా ఉంటారు. వీరిలో చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్, ఇండస్ర్టీస్ స్పెషల్ సీఎస్ లు, మున్సిపల్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఎండీఏ కమిషనర్, టీజీఐఐసీ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎఫ్ సీడీఏ సీఈవో, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ (డీటీసీపీ) మెంబర్లుగా ఉండనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో 7 మండలాల్లోని 56 గ్రామాల పరిధిలోని 768. 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. త్వరలోనే ఎఫ్సీడీఏకు ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ను సీఈవోగా లేదంటే కమిషనర్ గా ప్రభుత్వం నియమించనున్నట్లు తెలిసింది. ఇందుకు గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన పలువురు అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
భూ కేటాయింపులే కీలకం..
ఫ్యూచర్ సిటీ లో భాగంగా నిర్మించబోయే యూనివర్సిటీలు, ఏఐ సిటీ, ఎలక్ట్రానిక్స్ సహా వివిధ ఇండస్ట్రీలు, ఎంటర్టైన్మెంట్ జోన్, ఫర్నిచర్ పార్క్, హెల్త్ సిటీ, లైఫ్ సైన్సెస్ హబ్, స్పోర్ట్స్‌హబ్, నివాస, వాణిజ్య ప్రాంతాలకు ఎఫ్‌సీడీఏ భూ కేటాయింపులు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే14 వేల ఎకరాల భూమి కేటాయించింది. కాగా, ఇందులో గ్రీన్ ఫార్మా కంపెనీలను కొనసాగించాలని నిర్ణయించడంతో లైఫ్ సైన్సెస్ వంటి వాటికి కేటాయింపుల్లో మార్పుచేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. దాదాపు 6- నుంచి 8 వేల ఎకరాలు నాన్ పొల్యూటెడ్ ఫార్మా కంపెనీలకు ఇవ్వడంతో పాటు ఆయా కంపెనీలకు సంబంధించిన వారికి నివాసాలు, స్కూల్స్, హాస్పిటల్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మరో 4 నుంచి 5 ఎకరాలు ఫ్యూచర్ సిటీలో భాగంగా ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఏఐ సిటీకి 297 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించగా, దానికి మరో 250 ఎకరాలు అదనంగా ఇవ్వాలని భావిస్తున్నారు. యూనివర్సిటీల జోన్‌కు 600 ఎకరాలకు పైగా కేటాయించాలని అనుకుంటున్నారు. ఎలక్ట్రానిక్స్, సాధారణ ఇండస్ట్రీలకు 6 వేల ఎకరాలు, ఎంటర్టైన్మెంట్ జోన్‌కు 550 ఎకరాలు, ఫర్నిచర్ పార్క్‌కు 450 ఎకరాలు, హెల్త్ సిటీకి 550 ఎకరాలు, లైఫ్ సైన్సెస్ హబ్‌లో ఫార్మా కంపెనీలు మినహాయించి 3 వేల ఎకరాలు, నివాస, వాణిజ్య ప్రాంతాలకు 3,500 ఎకరాలు, నివాస ప్రాంతాలకు 2 వేల ఎకరాలు, స్పోర్ట్స్ హబ్‌కు 850 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఆయా కేటాయింపులను ఎఫ్ సీడీఏ పర్యవేక్షించనుంది.