విశ్లేషణ: ఎస్టీల రిజర్వేషన్​పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

జనాభా ప్రకారం ఎస్టీల రిజర్వేషన్​ను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచే అధికారం రాష్ట్రానికే ఉన్నా.. టీఆర్ఎస్​సర్కారు గత ఏడున్నరేండ్ల నుంచి దాన్ని అస్సలు పట్టించుకోలేదు. రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చకపోగా.. అందుకు కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో ఎస్టీలకు వారి జనాభా శాతానికి అనుగుణంగా 9.08 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2017లోనే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. అయినా కేంద్ర ప్రభుత్వ తీరుతోనే ఎస్టీల రిజర్వేషన్ల పెంపు జరగడం లేదని ప్రచారం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటికే గిరిజన, ఆదివాసీ బిడ్డలకు విద్య, ఉద్యోగాల్లో తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికైనా రిజర్వేషన్లు పెంచి.. ప్రస్తుత ఉద్యోగాల్లో ఎస్టీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. 

జనాభాకు అనుగుణంగా విద్యాసంస్థల్లో సీట్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)లకు10 శాతం రిజర్వేషన్లు అందాల్సి ఉంది. గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన10 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడున్నరేండ్లుగా నాన్చుతూ వస్తోంది. ఫలితంగా రాష్ట్రంలోని 32 గిరిజన తెగలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా.. కేసీఆర్ చోద్యం చూస్తున్నారు తప్ప ఏమీ చేయడం లేదు. గత ఏడున్నరేండ్లుగా విద్యాపరంగా, ఉద్యోగాల్లో ఆదివాసీలకు, గిరిజనులకు పూరించ లేని నష్టం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం(జూన్, 2014) నుంచి మొదలు గిరిజనులకు దక్కాల్సిన10 శాతం రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో వారికి రిజర్వ్ కావాల్సిన 9,114 ఉద్యోగాలకు బదులు 5,468 మాత్రమే దక్కే అవకాశం ఉంది. దీని ఫలితంగా రాష్ట్రంలోని గిరిజనులు దాదాపు 3,646 ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది. ఆ రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడం గిరిజనులకు అన్యాయం చేయడమే అవుతుంది.

గత నియామకాల్లోనూ అన్యాయమే..

గత ఏడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టుల్లోనూ ఎస్టీలకు అన్యాయమే జరిగింది. ఆదివాసీ, గిరిజన బిడ్డలు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కోల్పోయినట్లు అయింది. 10 శాతం రిజర్వేషన్లు అమలుగాక వృత్తి విద్యా కోర్సుల్లోనూ సీట్లు దక్కలేదు. కాబట్టి ఎస్టీల జీవితాల్లో మార్పు రావాలంటే విద్య, ఉద్యోగ అవకాశాల్లో రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపుదల అంశం రాష్ట్ర పరిధిలోనిది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వర్తించదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పెరిగిన గిరిజన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల పెంపుదల అంశంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరమే లేదు. ఇంద్రా సహానీ కేసులో కోర్టు విధించిన 50 శాతం నిబంధన వెనకబడిన తరగతులకు మాత్రమే వర్తిస్తుంది కానీ ఎస్సీ, ఎస్టీలకు వర్తించదు. గిరిజనులకు రిజర్వేషన్లు కొత్తగా ఇచ్చేవి కావు. ఉన్న రిజర్వేషన్లనే పెంచాలి కాబట్టి కేంద్రం అనుమతి అవసరం లేదు. కొత్తగా ప్రతిపాదించిన బీసీ–ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగపరంగా అనుమతి అవసరం. అయితే, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పెంచాల్సిన గిరిజన రిజర్వేషన్లను కేంద్ర అనుమతి అవసరం ఉన్న బీసీ–ఈ రిజర్వేషన్లతో ముడిపెట్టి ఒకే బిల్లు లేదా తీర్మానం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఈ సమస్య జటిలం కావడానికి ఇదే కారణమైంది. ఎందుకంటే 4 శాతం బీసీ–ఈ రిజర్వేషన్ల అంశం 2005లోనే వివాదాస్పదం కాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాన్ని కొట్టివేసింది. తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్తే.. రాజ్యాంగ సమీక్షా బెంచ్ ముందు పెండింగ్​లో ఉంది. సుప్రీం కోర్టులో ఉన్న ఏపీ ప్రభుత్వం వర్సెస్​మురళీధర రావు కేసులో తుది తీర్పు వెలువడే వరకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపిన బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల బిల్లు–2017ను పరిశీలించడం కుదరదని, ఇప్పటికే కేంద్ర హోమ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. గిరిజనులకు 
రిజర్వేషన్ల పెంపు ఇప్పట్లో జరిగేలా లేదు.

బిల్లు నుంచి డీలింక్​చేయాలి..

తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు వారి జనాభా శాతానికి అనుగుణంగా 9.08 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2017లోనే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. కాబట్టి కేంద్రానికి పంపిన బీసీ, ఎస్సీ, ఎస్టీ బిల్లు –2017 నుంచి ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు అంశాన్ని డీ-లింక్ చేయాల్సిన అవసరం ఉంది. జనాభా శాతానికి అనుగుణంగా ఎస్టీల రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం చెప్పినందున రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఎగ్జిక్యూటివ్​ఆర్డర్​లేదా ఆర్డినెన్స్​జారీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రంలో నేరుగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌లు జారీ చేస్తున్న తరుణంలో ఎస్టీల రిజర్వేషన్లు 6 శాతం నుంచి10 శాతానికి పెంచకుంటే ఉద్యోగాల భర్తీలో గిరిజనులకు మళ్లీ అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. గిరిజన యువకులు పీహెచ్ డీలు చేసి కూడా ఉద్యోగాలు లేకుండా గడుపుతున్నారు. అలాంటి వారికి రిజర్వేషన్లతో ఎంతో కొంత 
అన్యాయం జరుగుతుంది. 

ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక..

ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న సీఎం కేసీఆర్ వాటిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం బాధాకరం. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్​టీఆర్ ​గిరిజన రిజర్వేషన్లను 4 శాతం నుంచి 6 శాతానికి పెంచారు. అలాగే వైఎస్సార్​ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్​లో మైనారిటీ రిజర్వేషన్లు 2 శాతం నుంచి 4 శాతానికి పెంచేందుకు జీవోలు జారి చేసినట్లుగానే ఎస్టీల రిజర్వేషన్ల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలి. గత ఏడున్నరేండ్లలో ఎన్నోసార్లు పార్లమెంట్​సమావేశాలు జరిగాయి. అన్ని సెషన్స్​లో టీఆర్ఎస్​ పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. కానీ ఏ ఒక్కసారి కూడా గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయాన్ని ప్రస్తావించలేదు. ఇటీవలి పార్లమెంట్​సెషన్స్​లో  ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి ‘‘గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి12 శాతానికి పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన వచ్చిందా?”అని ప్రశ్నించారు. దానికి సమాధానం చెబుతూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్​టుడు తెలిపారు. దీంతో టీఆర్ఎస్​ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎస్టీల రిజర్వేషన్లపై ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పడు కేంద్రమే రిజర్వేషన్లు ఇవ్వడం లేదంటూ బద్నాం చేస్తోంది. 

- వెంకన్న నాయక్, జాతీయ అధ్యక్షుడు, అఖిల భారత గిరిజన సమాఖ్య