సోలార్ పంప్ సెట్లకు ఫండ్స్ ఇవ్వండి..కేంద్రాన్ని కోరిన రాష్ట్ర సర్కార్

సోలార్ పంప్ సెట్లకు ఫండ్స్ ఇవ్వండి..కేంద్రాన్ని కోరిన రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గిరిజన రైతులకు వంద శాతం సబ్సిడీతో సోలార్ పంప్ సెట్లు ఇస్తున్నామని, వీటికి ఫండ్స్ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) కింద 4 ఎకరాలు సాగు చేస్తున్న 2,30,735 మంది గిరిజన రైతులకు ఫ్రీగా సోలార్ పంప్ సెట్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ ఇటీవల ప్రకటించారు. బోరు వేయడం, మోటార్, కరెంట్ ఖర్చు కోసం ఒక్కో పంప్ సెట్ కు రూ.6 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం రూ.13 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. వీటికి ఎస్టీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, పవర్, కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ ఉపయోగించనున్నారు.

సోలార్ పంప్ సెట్లకయ్యే ఖర్చులో 70 శాతం నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని గిరిజన శాఖ అధికారులు కోరారు. పీఎం ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ (పీఎం డీఏజేజీయూఏ) స్కీమ్ కింద వచ్చే ఐదేండ్లకు రాష్ట్రానికి మొత్తం రూ.16 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పంపగా.. ఇందులో 80శాతం సోలార్ పంప్ సెట్లకు సంబంధించిన నిధులే ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకు ఈ స్కీమ్ కింద వచ్చే ఐదేండ్లకు ఒక్కో ఏడాదికి ఎంత నిధులు ఇవ్వాలన్నది ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించనున్నదని అధికారులు చెప్తున్నారు.