- నెలాఖరులోగా ప్రక్రియ పూర్తయ్యే చాన్స్
- ఇప్పటి దాకా ప్రైవేట్ ఏజెన్సీ చేతిలో పోర్టల్
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కమిటీ ఏర్పాటు
- స్పెషల్ డ్రైవ్‌తో అప్లికేషన్ల డిస్పోజ్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కు ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది.
ఇప్పటి దాకా ప్రైవేట్ ఏజెన్సీ గుప్పిట్లో ఉన్న ధరణి పోర్టల్.. ఈ నెలాఖరులోగా ఎన్ఐసీ ఆధీనంలోకి వెళ్లనున్నది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు కూడా కసరత్తు పూర్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో వేస్తామని.. రైతుల భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ క్యాంపెయిన్‌లో హామీ ఇచ్చింది.
వెంటనే పోర్టల్ ఎత్తేస్తే రైతులు ఆందోళనకు గురి కావడంతో పాటు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కాంగ్రెస్ సర్కార్ గ్రహించింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ధరణిపై ఓ కమిటీ ఏర్పాటు చేసింది.
భూముల సమస్యలకు సంబంధించి ఇప్పటికే ఎవరెవరు అయితే ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్నారో వాటన్నింటిని పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టింది. డెడ్లైన్లు పెట్టి మరీ అప్లికేషన్లను డిస్పోజ్ చేసింది.
అదే టైమ్‌లో ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించి గడువు కూడా ఈ నెలఖారులో ముగియనున్నది. దానికి తగినట్లుగానే సీజీజీ, ఎన్ఐసీ వంటి సంస్థలతో రాష్ట్ర సర్కార్ గత కొంతకాలంగా సంప్రదింపులు చేస్తూ వచ్చింది.
చివరకు ఎన్ఐసీకి ధరణి బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం ధరణిలో వసూలు చేస్తున్న అప్లికేషన్ల ఫీజులు కూడా తగ్గించనున్నట్లు తెలుస్తున్నది.
ధరణిలో 35 రకాల మాడ్యూల్స్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో ధరణి తీసుకొచ్చింది. ప్రస్తుతం టెర్రాసిస్ కంపెనీ ఆధ్వర్యంలో పోర్టల్ నడుస్తున్నది. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ ధరణి పోర్టల్‌లోనే జరుగుతున్నాయి.
35 రకాల మాడ్యుల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి సమస్యకు ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజులు ధరణి పోర్టల్ ఆన్లైన్లోనే అవుతున్నాయి. ఇప్పటి దాకా మొత్తం సుమారు 40 లక్షల ట్రాన్సాక్షన్స్ అయినట్లు తెలిసింది.
భూ సమస్యల పరిష్కారానికి ఒక్కో అప్లికేషన్‌కు వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌లో పెట్టుకున్న అప్లికేషన్లు అన్ని ఆటో రిజెక్ట్ కింద తిరస్కరించినట్లు తెలిసింది.
కొందరు అధికారులు కూడా తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడంతో అప్లికేషన్లు రిజెక్ట్ అవుతూ వచ్చాయి. సమస్య పరిష్కారం కోసం కొందరు రైతులు ఐదారుసార్లు అప్లై చేసుకున్నారు. ఇలా కేవలం అప్లికేషన్ల ద్వారానే రూ.400 కోట్ల మేర వసూలు అయ్యాయి.
ఎప్పుడో కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూములకు..గతంలో అమ్మినవాళ్ల పేర్లు రావడం, కొన్నిచోట్ల పట్టా భూములు ప్రభుత్వ, అసైన్డ్ భూములుగా నమోద య్యాయి.
విస్తీర్ణంలో హెచ్చు, తగ్గులు.. పట్టాభూమి అయినప్పటికీ నిషేధిత జాబితాలో చేర్చడం వంటి సమస్యలు వచ్చాయి. పేర్లు తప్పుగా నమోదు కావడం, కొందరు భూము లు అసలు ధరణిలోనే నమోదు గాకపోవడం వంటివి జరిగాయి.