ఆలయాల్లో టికెట్ల దందాకు చెక్!..వీఐపీ దర్శనాలు సహా ఇకపై అన్ని టికెట్లూ ఆన్​లైన్​లోనే

ఆలయాల్లో టికెట్ల దందాకు చెక్!..వీఐపీ దర్శనాలు సహా ఇకపై అన్ని టికెట్లూ ఆన్​లైన్​లోనే
  • కొమురవెల్లి, బల్కంపేట, బాసర ఆలయాల్లో ఘటనల 
  • నేపథ్యంలో దేవాదాయశాఖ నిర్ణయం
  • ఈ నెల 15న ఎండోమెంట్ అధికారులతో మంత్రి సమీక్ష
  • రివ్యూ మీటింగ్​ తర్వాత ఆన్​లైన్​ టికెట్లపై ఉత్తర్వులు!

హైదరాబాద్, వెలుగు: ఆలయాల్లో నకిలీ టికెట్ల దందాకు చెక్​పెట్టాలని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖ టెంపుల్స్​లో సాధారణ, వీఐపీ దర్శనాలు, అభిషేకాలు, ఆర్జిత సేవలు, లడ్డూ, పులిహోరా లాంటి ప్రసాదాల విక్రయాలు, వేములవాడ లాంటి ఆలయాల్లో కోడె మొక్కులు తదితర సేవలన్నింటికీ టికెట్లను మాన్యువల్​గా  ఇస్తుండడంతో అక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల కొమురవెల్లి, బల్కంపేట, బాసర లాంటి ఆలయాల్లో ఇలాంటి బాగోతాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా నకిలీ టికెట్లు, వాడిన టికెట్లను మళ్లీ వాడడం లాంటి అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన దేవాదాయ శాఖ.. ఇకపై అన్ని రకాల టికెట్లను ఆన్​లైన్​లో విక్రయించాలని భావిస్తోంది. ఈ విధానంలో ఉన్న ఇబ్బందులపై ఈ నెల 15న ఎండోమెంట్​అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించనున్నారు. ఆ రివ్యూ మీటింగ్​ తర్వాతే ఆన్​లైన్​ టికెట్లపై ఉత్తర్వులు వస్తాయని భావిస్తున్నారు. 

భక్తులకు పారదర్శకంగా సేవలు అందించేందుకే..

ఆన్ లైన్  టికెట్ విధానం ద్వారా భక్తులు తమ విశేష దర్శనాలు, ప్రత్యేక దర్శనం, ఇతర సేవల కోసం ముందుగానే టికెట్లు కొనుగోలు చేయవచ్చు. నిధుల జమ, ఖర్చుల వివరాలు పారదర్శకంగా ట్రాకింగ్ చేసేందుకు వీలవుతుంది. భక్తులు ఆలయానికి ఆదర బాదరాగా వెళ్లాల్సిన అవసరం లేండదు. రాష్ట్రంలోని వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, జోగులాంబ, కొండగట్టు, కొమురవెల్లి, బాసర, భద్రకాళి, చెర్వుగట్టు వంటి ప్రముఖ పుణ్య క్షేత్రాలతోపాటు అనేక ఇతర క్షేత్రాలు ఎండో మెంట్ పరిధిలో ఉన్నాయి. దేవాలయాల్లో పూజలు, ప్రత్యేక దర్శనాలు, ఇతర సేవలు రోజూ నిర్వహిస్తూ ఉంటారు. ఆన్ లైన్  టికెట్ సిస్టమ్ ద్వారా ఆదాయం పెరగడంతోపాటు భక్తులు  పారదర్శకంగా సేవలు పొందవచ్చు. 

అడ్డదారుల్లో డబ్బు సంపాదన 

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో టికెట్ల అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆలయ ఉద్యోగులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధికారులు, సిబ్బందిని భక్తులు సౌకర్యాలపై ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్నారని  ఆరోపణలున్నాయి. అంతేకాకుండా, ఏండ్ల తరబడి ఒకే ఆలయంలో విధులు నిర్వర్తిస్తుండడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా  మారింది. ఈ క్రమంలోనే అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకు ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారని  తెలుస్తోంది.   

గతంలో జరిగిన కొన్ని సంఘటనలు..

  •     గతంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నకిలీ టికెట్ల  వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి పదేండ్లుగా నకిలీ టికెట్లను ప్రింట్‌‌ చేయించి విక్రయించాడు. టికెట్‌‌ కౌంటర్‌‌లో పని చేస్తున్న ఓ వ్యక్తి ఒక్క రోజే నకిలీ టికెట్ల ద్వారా సుమారు రూ.31 వేలు వసూలు చేశాడు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిన సూపరింటెండెంట్‌‌ ప్రింటింగ్‌‌లో పొరపాటు జరిగిందని చెప్పి చేతులు దులుపుకొన్నారంటే సిబ్బంది సైతం పై స్థాయి అధికారులను ఎలా ప్రభావితం చేస్తున్నారో స్పష్టమవుతోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆలయ ఈవో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  
  •     చెర్వుగట్టు దేవస్థానంలోనూ నకిలీ టికెట్ల దందా జరిగింది. గతంలో గుట్టపై దర్శనీయ స్థలాల్లో టికెట్ల రీసైక్లింగ్‌‌ జరగగా.. గుట్ట కింద ప్రైవేట్‌‌ పార్కింగ్‌‌ ప్రదేశాల్లో దేవస్థానం పేరిట పార్కింగ్‌‌ ఫీజును వసూలు చేసిన విషయం వెలుగు చూసింది. పార్కింగ్‌‌ స్థలంలో పార్క్‌‌ చేసిన బైక్‌‌ చోరీ కావడంతో బాధితుడు దేవస్థానాన్ని సంప్రదించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
  •     కొమురవెల్లి మలన్న ఆలయంలోనూ గతంలో వీఐపీ టికెట్లను విక్రయించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో గతంలో చైర్మన్ , ఈవో మధ్య విభేదాలు పొడుచూపాయని తెలిసింది. 
  •   బాసర ఆలయంలో లడ్డూ టికెట్లలో అక్రమాలు జరిగాయి. ఇందుకు బాధ్యులైన ఇద్దరు ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్‌‌తోపాటు నలుగురు రోజువారీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.

వీఐపీ టికెట్ల లో గోల్ మాల్.. 

ఆలయాలకు ప్రముఖులు వచ్చినప్పడు వారికి ప్రత్యేకంగా టికెట్లు కేటాయిస్తారు. రద్దీని బట్టి రోజుకు 200 నుంచి 500 మంది వీఐపీలకు దర్శనం కల్పిస్తారు. అయితే, ఈ టికెట్లకు ఎలాంటి రుసుము ఉండదు. కానీ, కొన్ని ప్రముఖ ఆలయాల్లో ఈవోతోపాటు ఉద్యోగులు, సిబ్బంది టికెట్లను భక్తులకు వీఐపీ టికెట్లను విక్రయిస్తున్నట్లు తెలిసింది.  రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తులు క్యూలైన్లో నిల్చొని ఉండలేరు. కాబట్టి వారిని టార్గెట్ చేసి టికెట్లు విక్రయిస్తుంటారని సమాచారం. సాధారణంగా దర్శనం టికెట్ రూ.500 ఉంటే.. 10 మందికి రూ.5వేలు అవుతుంది. ఇంత డబ్బు ఎందుకు.. క్యూలైన్​లో వెళ్దామని భక్తులు అనుకుంటారు. అయితే, అలాంటి వారికి వీఐపీ టికెట్ ను తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ రూ.5 వేలకు వచ్చే టికెట్​ రూ.2 వేలకే లభిస్తుండడంతో కొనుగోలు చేస్తుంటారు. ఇలా ప్రముఖ ఆలయాల్లో రోజు వీఐపీ టికెట్లు 200 నుంచి 300 వరకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.