కిసాన్ ​సర్కారైతే..రైతు కంట కన్నీరెందుకు?

అన్నం పెట్టే రైతుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ విధానాలతో అన్యాయం చేస్తున్నది. ప్రభుత్వం కిసాన్​సర్కార్​ అనే గొప్పగా చెప్పుకుంటున్నా.. రైతుల కంట కన్నీరు ఆగడం లేదు. రుణమాఫీ పూర్తిగాక, బ్యాంకులు రుణాలు ఇవ్వక, బయట అప్పు పుట్టక ఎన్నో ఇబ్బందులకోర్చి అన్నదాత ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే.. మొన్నటి అకాల వర్షాలు నీళ్ల పాలు చేశాయి. లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే.. రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదు. వడగండ్ల వానకు నేల రాలగా మిగిలిన ధాన్యాన్ని అయినా.. కోతలు లేకుండా తీసుకోవాలని రైతులు రోడ్డెక్కుతున్నా, పట్టించుకునే నాథుడు లేడు. మొదటి నుంచి బీఆర్ఎస్​ ప్రభుత్వం తెలంగాణ రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. 

ఒక్క రైతు బంధు ఇచ్చి.. మిగతా అన్ని పథకాలు, రాయితీలు, పరిహారాలకు మంగళం పాడింది. తెలంగాణ రాష్ట్ర రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నష్టపరిహారం చెల్లించని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజల డబ్బును ఉత్తరాది రాష్ట్రాల్లో చనిపోయిన అన్నదాతలకు పరిహారంగా ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోవడంతో లక్షలాది మంది రైతులను బ్యాంకులు డీఫాల్టర్ల జాబితాలో చేర్చాయి. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది రైతులు రుణ మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. 

పంట పెట్టుబడి భారం

రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున పంట పెట్టుబడి కోసం రైతు బంధు ఇస్తున్నది. అయితే రైతు బంధు ఒక్కటి సాగు సమస్యలకు సర్వరోగ నివారిణీ కాదు. రైతుబంధు దేశంలోనే ఎక్కడా లేని పథకంగా బీఆర్ఎస్​ నేతలు పదే పదే చెబుతున్నారు. మరి రైతు బంధు, రైతు బీమాలు అమలు చేస్తున్న తర్వాత కూడా రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వేలాది మంది రైతులు ఎందుకు అన్యాయంగా ప్రాణాలు విడుస్తున్నారనే దానిపై ప్రభుత్వం వద్ద సమాధానం ఉన్నదా? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? వాటి నివారణకు ఇంకేం చర్యలు తీసుకోవాలని ఈ సర్కారు ఒక్కసారి కూడా సమీక్ష జరిపింది లేదు. ఏటికేడు పంట పెట్టుబడి భారం పెరుగుతున్నది. ప్రభుత్వం ఇచ్చే సాయం రైతులకు ఏ మూలకూ సరిపోవడం లేదు. ప్రకృతి విపత్తులకు పంట నష్టపోతే పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఒక్క తెలంగాణ మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో క్రాప్​ ఇన్స్యూరెన్స్​ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్​బీమా యోజనతోపాటు రాష్ట్రాలు కొన్ని బీమా పథకాలు అమలు చేస్తున్నాయి. 

మన దగ్గర అలాంటివి లేకపోవడంతో మొన్నటి వడగండ్ల వానలకు నోటికాడికి వచ్చిన ధాన్యం నీళ్ల పాలు, నేలపాలై రైతులు తీరని శోకంలో మునిగిపోయారు. పంట నష్టంపై సర్వే చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. పంట నష్టం నిధుల విడుదల, అకౌంట్లలో జమ గురించి ఏమీ చెప్పడం లేదు. తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజను కొంటామని పదే పదే ముఖ్యమంత్రి, మంత్రులతో సహా అధికార పార్టీ నేతలు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కొనడం లేదు. తేమ, తాలు, రంగు మారిందన్న సాకులతో మిల్లర్లు క్వింటాలుకు మూడు నాలుగు కిలోల చొప్పున కోతపెడుతున్నారు. దీనికి నిరసనగా అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. రైతుల గోడును పట్టించుకోని బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు.. ఆత్మీయ సమ్మేళనం పేరుతో వేడుకలు నిర్వహిస్తూ వాటిల్లో మునిగి తేలుతున్నారు. 

రైతుల ఐక్యత 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన వీరోచిత పోరాటం దేశం మొత్తం చూసింది. పట్టువిడవకుండా పోరాటం చేసిన రైతుల ఐక్యత గురించి బీఆర్ఎస్​ ముఖ్యమంత్రికి బాగా తెలుసు. తెలంగాణలోనూ రైతులు ఆందోళనలు ఉధృతం చేయకముందే వారి సమస్యలు పరిష్కరించాలి. అసలే ఇది ఎన్నికల ఏడాది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరిస్తే ఫలితం చేదుగా ఉంటుందని గుర్తించాలి. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి. రైతుల పంటరుణాలను ఇప్పటికైనా  వెంటనే మాఫీ చేయాలి. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ప్రకారం తడిసిన ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. తక్కువ ధరలు చె ల్లించి  రైతులను దోపిడీ చేస్తున్న వ్యాపారులను కట్టడి చేయాలి. రైతుల విశ్వాసం పొందడానికి మాటలు చెప్పడం కన్నా చేతల్లో చేసి చూపాలి. 

పక్క రాష్ట్రం వెళ్లి వారికి పరమాన్నం పెడతానని చెప్పుకునే ఆలోచనను మానుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరికీ నష్టపరిహారం అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. సాగునే నమ్ముకొని బతుకుతున్న కౌలు రైతును రైతుగా గుర్తించడంతోపాటు వారిని ఆదుకునేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలి. బీఆర్ఎస్​ పార్టీ అబ్​ కీ బార్​కిసాన్ ​సర్కార్​అనే నినాదంతో దేశ రైతుల విశ్వాసం పొందడంలో ఇబ్బంది లేదు.. కానీ సొంత రాష్ట్రంలో రైతులు కన్నీరు పెడుతుంటే తుడవాలి కదా!.

సీతారామయ్య