- ఇటీవల రాంచీలో హైకోర్టును పరిశీలించిన ఆర్ అండ్ బీ ఆఫీసర్లు
- డిజైన్ ఫైనల్.. త్వరలోనే టెండర్లు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ హైకోర్టును జార్ఖండ్ హైకోర్టు మోడల్ లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలో ఇటీవల నిర్మించిన హైకోర్టులను పరిశీలించగా జార్ఖండ్ హైకోర్టు డిజైన్ బాగుందని ఆర్ అండ్ బీ ఆఫీసర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్ అండ్ బీ ఆఫీసర్ల బృందం జార్ఖండ్ క్యాపిటల్ రాంచీకి వెళ్లి అక్కడి హైకోర్టును పరిశీలించారు.
నిర్మాణం చేపట్టిన విధానాన్ని అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన వివరాలను రిపోర్ట్ రూపంలో ప్రభుత్వం, హైకోర్టు జడ్జిల కమిటీకి అధికారులు అందజేశారు. మొత్తం 60 కోర్టు హాళ్లు అవసరమని జడ్జిల కమిటీ ఆర్ అండ్ బీ అధికారులకు, ఆర్కిటెక్ట్ కన్సల్టెన్సీకి సూచించింది. ప్రస్తుతం 43 మాత్రమే నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది.
టెండర్లకు ఏర్పాట్లు
రాజేంద్ర నగర్ లో 100 ఎకరాల్లో నిర్మించనున్న కొత్త హైకోర్టు బిల్డింగ్ డిజైన్ ను ఇటీవల చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆధ్వర్యంలోని జడ్జిల కమిటీ ఫైనల్ చేసింది. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో నిర్మించనున్న కొత్త హైకోర్టుకు ప్రస్తుతం అధికారులు డీపీఆర్ తయారీ పనుల్లో ఉన్నారు. వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏడాదిన్నర నుంచి రెండేండ్లలో కొత్త హైకోర్టును పూర్తి చేసేలా టెండర్ దక్కించుకున్న కంపెనీకి పనులు అప్పగించనున్నారు. కొత్త హైకోర్టుకు రూ. వెయ్యి కోట్ల అంచనా వ్యయం కావచ్చని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. ఫైనల్ అయిన డిజైన్ ను కూడా త్వరలో మీడియాకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.