గుడ్న్యూస్: దసరా నుంచి రైతు భరోసా

గుడ్న్యూస్: దసరా నుంచి రైతు భరోసా
  • నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు
  • సాగు భూములకే సాయం.. వచ్చే నెలలో గైడ్​లైన్స్​ రిలీజ్​
  • డిజిటల్​ సర్వేతో పక్కాగా పంట భూముల గుర్తింపు 
  • కోటి 29 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్టు అంచనా
  • ఏడున్నర ఎకరాలకు సీలింగ్​ పెడ్తారని ప్రచారం

హైదరాబాద్, వెలుగు:రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్​ రెడీ అయింది. దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిం చాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. 

ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను  సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఈ సారి ఎకరాకు రూ.7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా  రైతు భరోసాను అమలు చేయబోతున్నారు. 

ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలను రిలీజ్​ చేయనున్నారు. ఆ వెంటనే విడతలవారీగా వానాకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గతంలో మాదిరికాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు.  

ఇదే విషయాన్ని పలు వేదికల మీద మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కూడా చెబుతూ వస్తున్నారు. నిరుడు డిసెంబర్​లో అధికారంలోకి వచ్చిన  వెంటనే కాంగ్రెస్ సర్కారు రైతులకు పెట్టుబడి సాయం అందించాలని భావించి.. రైతుబంధును ఆపకుండా యాసంగి సీజన్​నిధులు జమ చేసింది.  

ఈ క్రమంలో రైతు బంధు స్కీమ్​లో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించింది.  పంటలు పండని రాళ్లు, రప్పల భూములు, గుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు, భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృథాగా చెల్లించినట్టు తేల్చింది.

  దీంతో పెట్టుబడి సాయం పంపిణీ విధివిధానాల ఖరారుకు సీఎం రేవంత్​ రెడ్డి కేబినెట్ సబ్​కమిటీ వేశారు. ఈ  కమిటీ వివిధ జిల్లాల్లో మీటింగ్​లు ఏర్పాటు చేసి.. రైతులు, రైతు సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఇందుకు తగ్గట్టుగా రైతుభరోసాకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.

ఎన్ని ఎకరాలకు ఇస్తారనేది సస్పెన్స్!

గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు (పార్ట్​ బీ మినహా) ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. దీంతో ప్రతి సీజన్​కు సగటున సర్కారుపై రూ.7,600 కోట్ల భారం పడేది. 

నిజానికి  చిన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్​ను తీసుకురాగా, పెద్ద రైతులకే ఎక్కువ లబ్ధి జరుగుతున్నదనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సారి పెట్టుబడి సాయానికి సీలింగ్​ పెట్టాలని నిర్ణయించింది. రైతు భరోసా  కొత్త మార్గదర్శకాలతో పాటే ఎన్ని ఎకరాలకు ఇస్తారనే క్లారిటీ ఇవ్వనుంది.

  బడ్జెట్​లో మాత్రం ఎప్పటిలాగే రైతుభరోసా కోసం  ప్రభుత్వం దాదాపు రూ.15 వేల కోట్లను కేటాయించింది.  రాష్ట్ర వ్యవసాయ శాఖ సాగు లెక్కల ప్రకారం ఈ వానాకాలం సీజన్​లో 1.39 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి, పత్తి పంటలదే సింహ భాగం. 

ఏ రైతు  ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు వేశారో ఏఈఓలు ట్యాబ్​లలో నమోదు చేశారు. దాని ప్రకారమే పంట కొనుగోళ్లు కూడా చేపట్టనున్నారు. ఒకవేళ ప్రభుత్వం మొత్తం సాగైన భూములకు ఎకరాకు రూ.7,500 చొప్పున రైతు భరోసా ఇస్తే దాదాపు రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.

 అలాకాకుండా సీలింగ్​పెట్టి.. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఇన్​కం టాక్స్​పేయర్స్​ లాంటి వాళ్లను పెట్టుబడి సాయం నుంచి మినహాయిస్తే ఈ మొత్తం తగ్గుతుందని అంటున్నారు. 

కేబినెట్​సబ్​ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో అత్యధికంగా ఏడున్నర ఎకరాలలోపే పెట్టుబడి సాయం ఇవ్వాలని, ఆ తర్వాత 10 ఎకరాలకు పరిమితం చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి.  

కేబినెట్​సబ్​ కమిటీ చేసిన ప్రపోజల్స్​పై  సీఎం రేవంత్​రెడ్డితో చర్చించాక ఫైనల్​ చేసి.. ఆ తర్వాత మంత్రివర్గ సమావేశంలో ఫైనల్​ చేయనున్నారు. నిబంధనలు అమలు చేస్తే సరాసరి గతంలో ఇచ్చినంతనే రూ.7,500 కోట్లు అవుతుందని సెక్రటేరియేట్​లో ఓ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు చెప్పారు.  

వ్యవసాయేతర భూములకు సాయం లేదు!

ఈ సారి వ్యవసాయేతర భూములకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. నాన్​అగ్రికల్చర్​ భూములను  ధరణి  సాగు పట్టా భూముల  లిస్ట్​లో నుంచి తీసేస్తున్నది. 

ఇలా కనీసం 20 లక్షల ఎకరాలు తీసే చాన్స్​ ఉన్నట్టు తెలిసింది. దీంతో దాదాపు రూ.1,500 కోట్ల దుబారా ఖర్చు తగ్గే అవకాశం ఉంది. ఇక రైతు బంధు ప్రారంభం నుంచి గత వానాకాలం సీజన్‌‌ వరకు దాదాపు రూ.73 వేల కోట్లు పెట్టుబడి సాయం కింద అందించారు. 

కానీ,  సాగులో లేని రాళ్లు రప్పలు, గుట్టలకు, వెంచర్లకు, ఇండ్లకు, హైవేలకు, రోడ్లకు ఇతరత్రా వాటికి ఏకంగా రూ.25 వేల కోట్లు చెల్లించినట్టు  ప్రభుత్వం గుర్తించింది. అంటే ఏడాదికి యావరేజ్​గా రెండు సీజన్లలో కలిపి  రూ.3 వేల కోట్ల మేర దుబారా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాగులో లేని భూములకు రైతుబంధు అందడంతో ప్రభుత్వం అసలు లక్ష్యం నేరవేరలేదు.