- సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం
- కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం.. సీలింగ్‌పై 4న కేబినెట్ భేటీలో ఫైనల్
హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి నుంచి రైతుభరోసా పెట్టుబడి సాయం స్కీమ్అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇందుకోసం ఈ నెల 5, 6, 7 తేదీల్లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. మూడు రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి అప్లికేషన్లను తీసుకోనున్నారు. రైతుభరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సెక్రటేరియెట్‌లో సమావేశమైంది.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని కీలక అంశాలపై చర్చించారు. గరిష్టంగా ఎన్ని ఎకరాల వరకు రైతుభరోసా పరిమితం చేయాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో శనివారం జరగనున్న కేబినెట్ భేటీలో తుదినిర్ణయం తీసుకోనున్నారు.
భూముల వివరాలు, కావాల్సిన నిధులపై ఆరా
రాష్ట్రంలో రైతులవారీగా భూముల వివరాలు, కావాల్సిన నిధులపై ఆఫీసర్ల నుంచి మంత్రివర్గ ఉపసంఘం వివరాలు అడిగి తీసుకుంది. గత బీఆర్ఎస్ హయాంలో కోటి 52 లక్షల ఎకరాలకు ఎకరానికి రూ. 5 వేల చొప్పున రూ.7,624 కోట్లను పెట్టుబడి సాయంగా అందించారు. సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలనేది లక్ష్యం కాగా.. గత సర్కారు రియల్ ఎస్టేట్వెంచర్లకు, గుట్టలకు, పడావు భూములకు, హైవేలకు, ఇతర నాన్ అగ్రికల్చర్ల్యాండ్స్కు రైతుబంధు అందజేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.
కాగా.. కోటి 52 లక్షల ఎకరాలకు ఎకరాకు రూ.7,500 (కాంగ్రెస్ ప్రకటించినట్లు) చొప్పున రైతు భరోసా ఇస్తే సీజన్‌కు రూ.11,400 కోట్లు అవుతుంది. అట్ల కాకుండా 1.52 కోట్ల ఎకరాల్లో పడావుభూములుగా భావిస్తున్న సుమారు 20 లక్షల ఎకరాలను పక్కనపెట్టి.. కోటి 30 లక్షల సాగుభూములకు ఎకరాకు రూ. 7,500 చొప్పున ఇస్తే రూ.9,750 కోట్ల దాకా ఇవ్వాల్సి ఉంటుందని కేబినెట్సబ్కమిటీలో చర్చకు వచ్చింది.
ప్రజాప్రతినిధులకు, పెద్దాఫీసర్లకు నో!
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ఆలిండియా సర్వీసు అధికారులు, గ్రూప్1, గ్రూప్ 2 అధికారులకూ రైతు భరోసా ఇవ్వకూడదని కమిటీ ప్రతిపాదించింది.
రెండు కేటగిరీలపై చర్చ..
మొదటి కేటగిరీ: 5 ఎకరాలు, 7 ఎకరాలు, 10 ఎకరాల్లో ఏదో ఒకదానికి సీలింగ్పెట్టడం. ఉదాహరణకు 7 ఎకరాలకు సీలింగ్ పెడ్తే .. అంతకుమించి ఎన్ని ఎకరాలు ఉన్నా గరిష్ఠంగా 7 ఎకరాలకే రైతుభరోసా పెట్టుబడి సాయం వస్తుంది. దీనిపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణలో, అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో సూచనలు, సలహాలు వచ్చాయి. ఎక్కువ మంది 7 ఎకరాలకు, మరికొందరు 10 ఎకరాలకు సీలింగ్ పెట్టాలంటూ ప్రతిపాదనలు చేశారు. వీటిపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది.
రెండో కేటగిరీ:10 ఎకరాలకు ఒక గుంట ఎక్కువ భూమి ఉన్నా.. అలాంటి వారికి రైతు భరోసా ఇవ్వొద్దనే ప్రతిపాదన కూడా సబ్ కమిటీ ముందుకు వచ్చింది. దీనిపై కమిటీ భేటీలో డిస్కస్ చేశారు. రాష్ట్రంలో పదెకరాలకు పైన భూములున్న రైతులు 92,151 మంది అని తేలింది. వీరి చేతుల్లో12.85 లక్షల ఎకరాల భూములున్నట్లు కేబినెట్ సబ్ కమిటీకి అధికారులు నివేదించారు. ఈ సీలింగ్, పరిమితిపై మంత్రుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో దీనిపై కేబినెట్‌సమావేశంలో ఫైనల్ చేసే అవకాశం ఉంది.