2 వేల కోట్ల భూదందా వెనుక  సూత్రధారులు ఎవరు?

2 వేల కోట్ల భూదందా వెనుక  సూత్రధారులు ఎవరు?
  • గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విలువైన జాగాలను 59 జీవో కింద కొల్లగొట్టే యత్నం
  • 900 గజాల చొప్పున వంద మందికి పైగా రెగ్యులరైజేషన్​కు అప్లై
  • తెర ముందు బినామీలు..  తెరవెనుక బీఆర్ఎస్​ పెద్దలు?
  • అక్రమాలను గుర్తించిన సర్కార్.. పట్టాల జారీ నిలిపివేసి ఎంక్వైరీ 
  • బినామీలను అదుపులోకి తీసుకుని విచారించాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ సర్కార్​హయాంలో రెగ్యులరైజేషన్​పేరుతో వేల కోట్ల భూదోపిడీకి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర  ప్రభుత్వం​ రెడీ అవుతున్నది. ప్రధానంగా హైదరాబాద్​లోని ఫైనాన్షియల్​ డిస్ర్టిక్ట్​పరిధిలో ఎకరం రూ.100 కోట్ల దాకా పలుకుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో బౌండరీలు ఏర్పాటు చేసుకుని, ఎలాంటి నిర్మాణాలు​ లేకుండానే 59 జీవో కింద అప్లికేషన్లు పెట్టుకున్న వారి చిట్టాను ప్రభుత్వం ఇప్పటికే బయటకు తీసింది.

విలువైన భూముల్లో ఒక్కొక్కరు 900 నుంచి వెయ్యి గజాల వరకు రెగ్యులైజేషన్​కు నాటి బీఆర్ఎస్ సర్కార్​హయాంలో అప్లై చేసుకున్నారు. కాంగ్రెస్​సర్కార్ వచ్చాక ఇలాంటివి 120 దాకా దరఖాస్తులను గుర్తించింది. దీంతో అసలు వీరంతా ఎవరు? నాలా కన్వర్షన్, కరెంట్​ కనెక్షన్లు ఏమీ లేకుండానే ఇంత విలువైన ప్రభుత్వ భూములను కొట్టేసేందుకు అప్పట్లో వీరికి ఎవరు సహకరించారో తెలుసుకునేందుకు సిద్ధమైంది.

ఆనాటి సీఎంకు దగ్గరగా ఉన్న ఓ మాజీ ఎంపీతో పాటు పలువురు మాజీ మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్సీలు కలిసి వారి బినామీల పేర్లతో సుమారు రూ.2 వేల కోట్లు విలువజేసే ఈ భూములకు టెండర్​పెట్టినట్టు ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. దీంతో దరఖాస్తు దారులందరినీ  అదుపులోకి తీసుకొని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని, అప్పుడు సూత్రధారులపై కేసులు పెట్టవచ్చని భావిస్తున్నారు.

విలువైన భూముల కోసం తేదీలు మార్చి.. 

ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్​పేరుతో గత బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన జీవో 59ను అడ్డుపెట్టుకొని గ్రేటర్​హైదరాబాద్​పరిధిలో వందల కోట్ల విలువైన భూములను స్వాహా చేశారని  కాంగ్రెస్​ప్రభుత్వం గుర్తించింది. వాస్తవానికి 2014 జూన్​2 వరకు కబ్జాలో ఉన్న భూములనే రెగ్యులరైజ్​చేస్తామని మొదట్లో అప్లికేషన్లు తీసుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2020 జూన్​2 దాకా కబ్జాలో ఉన్న వాటిని కూడా రెగ్యులరైజ్​చేసేందుకు అప్పటి బీఆర్ఎస్​సర్కార్ గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

విలువైన ప్రభుత్వ భూములను తమ బినామీల ద్వారా కబ్జా పెట్టించాక, వాటిని కొట్టేసేందుకే  తేదీల్లో మార్పు చేసినట్టు కాంగ్రెస్​సర్కారు తేల్చింది. కొందరైతే ఏకంగా పాత డేట్లతో డాక్యుమెంట్లు సృష్టించినట్టు గుర్తించింది. రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా మేడ్చల్-మల్కాజ్​గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ పెద్దసంఖ్యలో బీఆర్ఎస్​ నేతలు  కబ్జాలు, తప్పుడు డాక్యుమెంట్లతో రెగ్యులరైజేషన్​కు అప్లై చేసుకున్నట్టు ఆఫీసర్ల ఎంక్వైరీలో బయటపడింది.  

అనుమానం రావొద్దని వెయ్యి గజాల లోపు..

గ్రేటర్​హైదరాబాద్​పరిధిలో ఎకరా రూ.100 కోట్లు విలువ చేసే ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ ఏరియాలో పక్కా ప్రణాళిక ప్రకారం బీఆర్ఎస్​నేతలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి బినామీల ద్వారా రెగ్యులరైజేషన్​కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఒకే దగ్గర ఎక్కువ విస్తీర్ణంలో రెగ్యులరైజ్​చేసుకుంటే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో యావరేజ్​గా 900 నుంచి వెయ్యి గజాలలోపు కబ్జా చేసి  రెగ్యులరైజేషన్​కోసం అప్లై చేసుకున్నారు. నిజానికి 59 జీవో కింద రెగ్యులర్ చేయాలంటే  2020 జూన్​2 నాటికి  ఆ భూమిలో ఇల్లు కట్టుకొని కబ్జాలో ఉండాలి.

కానీ ఎలాంటి నిర్మాణాలు లేకుండానే అప్లై చేసుకోవడం, ఏకంగా100కు పైగా అప్లికేషన్లలో 900 నుంచి వెయ్యి గజాల వరకు విస్తీర్ణం ఉండడంతో కాంగ్రెస్​ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. దీంతో సీఎం రేవంత్​రెడ్డి ప్రాథమికంగా ఎంక్వైరీ చేయించగా, అవన్నీ తప్పుడు డాక్యుమెంట్లతో రెగ్యులరైజేషన్​కు అప్లై చేసుకున్నవని తేలింది. వారంతా గత ప్రభుత్వ పెద్దలకు బినామీలని వార్తలు రావడంతో సర్కార్​వాటి రెగ్యులరైజేషన్​ను ఆపి ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఈ క్రమంలో కొందరు కోర్టుకు వెళ్తుండగా, కౌంటర్లు వేసి మరీ వారి వివరాలను బయటకు తీస్తున్నది.

వాస్తవానికి పోయినేడాది అక్టోబర్​లోపే ఆయా భూములను రెగ్యులరైజ్​చేసుకోవాల్సి ఉంది. కానీ మళ్లీ బీఆర్ఎస్​ప్రభుత్వమే వస్తుందనే ధీమాతో వాటిని ప్రాసెస్​చేయలేదు. ఆ లోపు ఎన్నికల కోడ్​ రావడంతో రెగ్యులరైజేషన్ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. లేదంటే సుమారు రూ.2వేల కోట్ల భూములు అన్యాక్రాంతమయ్యేవే.