జీఎస్టీ అక్రమాలపై యాక్షన్.. ఎంక్వైరీ షురూ.. లిస్టులో బడా కంపెనీలు

జీఎస్టీ అక్రమాలపై  యాక్షన్.. ఎంక్వైరీ షురూ.. లిస్టులో బడా కంపెనీలు
  • ఎగవేతదారుల గుట్టువిప్పే పనిలో సర్కార్​
  • బిజినెస్​ చేయకుండానే ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ తో ఖజానాకు గండి
  • కొందరు ఆఫీసర్ల అండతో 2022–-23లో రూ. 2 వేల కోట్ల దోపిడీ
  • కమర్షియల్​ ట్యాక్స్​ ఇన్​కం తగ్గడంపై సీఎం రేవంత్​ సీరియస్​
  • అక్రమార్కుల పని పట్టి, లీకేజీలు అరికట్టాలని ఆదేశాలు

హైదరాబాద్​, వెలుగు:  జీఎస్టీ అక్రమాల గుట్టు విప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు ట్యాక్స్​ ఎగవేతలు ఎక్కడెక్కడ జరిగాయి ? ఎలాంటి కేసులు నమోదయ్యాయి? పన్ను ఎగవేతకు ఎవరు సహకరించారు.. అనే వివరాలను తెప్పించుకుంటున్నది. ప్రతినెలా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్న రాష్ట్రంలో.. జీఎస్టీ మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నది.  పైగా నిర్దేశించుకున్న లక్ష్యాలను కూడా చేరడం లేదు. దీంతో అసలు ఏం జరుగుతున్నదనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నల్​గా ఎంక్వైరీ చేయిస్తున్నది. మొన్నటి వరకు కమర్షియల్​ 
ట్యాక్స్​ కమిషనర్​గా పనిచేసిన టీకే శ్రీదేవి ఆధ్వర్యంలోనూ హైలెవల్​ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసి జీఎస్టీ అక్రమాలపై ఎంక్వైరీ చేయిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం సెప్టెంబర్​ నాటికి అనుకున్న దానికంటే రూ. 4 వేల కోట్లు తక్కువగా వచ్చింది. దీంతో జీఎస్టీ రాబడి తగ్గడాన్ని సీఎం రేవంత్​ సీరియస్​గా తీసుకున్నారు. కమర్షియల్​ ట్యాక్స్​లో ఎక్కడ లీకేజీలు అవుతున్నాయో గుర్తించాలని ఇటీవల రివ్యూలో అధికారులను ఆయన ఆదేశించారు.


దీంతో జీఎస్టీలో అక్రమాలను తేల్చడంపై ప్రత్యేకంగా ఒక టీమ్​ పనిచేస్తున్నది. కొన్ని కంపెనీలు కొందరు అధికారుల సాయంతో పన్ను ఎగవేతలు.. ఇన్​పుట్​ ట్యాక్స్ క్రెడిట్​ పేరిట రాష్ట్ర ఆదాయానికి గండిపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇందులో వేల కోట్ల రూపాయల బిజినెస్​ చేసే ప్రముఖ కంపెనీలతో పాటు.. అసలు వ్యాపారమే చేయకుండా కాగితాల్లోనే అన్నీ చూపించి ఇన్​పుట్​ ట్యాక్స్​ను కొట్టేస్తున్న ముఠాలు కూడా ఉన్నట్లు తేలింది. ఈ రెండింటికి చెక్​ పెడితే.. జీఎస్టీలో రాష్ట్ర ఆదాయం నెలకు కనీసం రూ.500 కోట్ల నుంచి  700 కోట్ల వరకు పెరుగుతుందని ఆఫీసర్లు అంచనా
వేస్తున్నారు.  

వ్యాపారం మస్త్​.. జీఎస్టీ రాదాయే

రాష్ట్రంలో జీఎస్టీ పరిధిలోకి వచ్చే బిజినెజ్​లు చాలా జరుగుతున్నాయి. చాలామంది జీఎస్టీ రిజిస్ట్రేషన్​ లేకుండానే విక్రయాలు జరుపుతున్నారు. ట్యాక్స్​ నుంచి తప్పించుకునేందుకు ఈ రకంగా చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కొందరు డీలర్లు జీఎస్టీలో ఉన్నప్పటికీ.. బిల్లులు మాత్రం మాన్యువల్​గా చేస్తున్నారు. దీంతో కొంత వ్యాపారం పన్నులోకి రాకుండా పోతున్నది. ఇలా ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే రూ.1700  కోట్ల పైనే పన్ను ఎగవేత జరిగినట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఈ వ్యవహారంపైనా కూడా సీరియస్​గా ఉన్నది. వీలైనన్నీ ఎక్కువగా జీఎస్టీ రిజిస్ట్రేషన్​ డ్రైవ్​లు పెట్టి.. డీలర్ల సంఖ్య పెంచాలని ఆ శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో ఎప్పటికప్పుడు బిల్లింగ్​ వ్యవస్థను కూడా ఆకస్మిక తనిఖీలు చేపట్టి చూడాలంది. రాష్ట్రంలో జీఎస్టీ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ చేయించుకున్న డీలర్లు 5.33 లక్షల మంది ఉండగా.. వారిలో వార్షిక టర్నోవర్‌‌‌‌‌‌‌‌ రూ. కోటిన్నర కంటే ఎక్కువ వ్యాపార లావాదేవీలు నిర్వహించే వ్యాపారులు దాదాపు రెండు లక్షలు మంది వరకు ఉన్నారు. అందులో కూడా 50 వేల మంది వరకు కేంద్ర జీఎస్టీ పరిధిలో, మిగిలిన దాదాపు లక్షన్నర మంది రాష్ట్ర జీఎస్టీ పరిధిలో ఉన్నారు. మొత్తం జీఎస్టీ రిజిస్ట్రేషన్​దారులు నిర్వహిస్తున్న వ్యాపార లావాదేవీలపై, అదేవిధంగా ఆయా సంస్థలు తీసుకుంటున్న వే బిల్లులు, నెలవారీగా వేస్తున్న వ్యాపార లావాదేవీల రిటర్న్​లు సక్రమంగా వేస్తున్నాయా లేదా అన్నదానిపై మానిటరింగ్​ పెంచాలని ఇప్పటికే అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు.

ఆఫీస్​, బిజినెస్​ ఉండదు.. అంతా కాగితాల్లోనే!

జీఎస్టీలో దొంగ ట్యాక్స్​ ఇన్వాయిస్​లను సృష్టించి.. ఇన్ పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​ను క్లెయిమ్ చేసుకోవడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ఇందులో అసలు కంపెనీ ఉండదు, వ్యాపారం జరగదు. కానీ, అంతా జరిగినట్లు కాగితాల్లో చూపించి..  ప్రభుత్వ ఖజానాకు కోట్లకు కోట్లు గండికొడుతున్నారు. ఇట్ల 2022–23 ఆర్థిక సంవత్సరం (గత ప్రభుత్వ హయాం)లో దాదాపు రూ.2 వేల కోట్ల మేర దోచుకున్నట్లు తేలింది. కాంగ్రెస్ ​అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిలో కొన్నింటిపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకున్నది. ఇందులో బిగ్​లీప్​, శ్రీ కావ్య మైనింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​, కాంటినెంటల్​ వంటి పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. ఇన్​పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​లో.. కొందరు ఇక్కడి డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులు అమ్మినట్లు దొంగ ట్యాక్స్​ ఇన్వాయిస్​లను సృష్టిస్తారు. ఇందులో ఎలాంటి వస్తు విక్రయాలు, రవాణా జరగకపోయినా.. జరిగినట్టు చూపించి ఇతర రాష్ట్రాల డీలర్లకు పంపుతారు.  ఇతర రాష్ట్రాల డీలర్లు జీఎస్టీ నుంచి ఇన్​పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​ను క్లెయిమ్​ చేసుకుంటారు. ఇట్ల వచ్చిన సొమ్మును ఇతర రాష్ట్రాల డీలర్లు, తెలంగాణ డీలర్లు పంచుకుంటారు. దీనిపై సర్కార్​ సీరియస్​గా విచారణ చేయిస్తున్నది.

కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లపైనా నిఘా

గత ప్రభుత్వంలో సీఎస్ గా ఉంటూ కమర్షియల్​ ట్యాక్స్​ కమిషనర్​గా కూడా సోమేశ్​ కుమార్​ బాధ్యతలు చూశారు. ఈ క్రమంలో ఆయనతో పాటు కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే సోమేశ్​తో పాటు మరికొంత మంది ఆఫీసర్లపై కేసు నమోదు కాగా.. విచారణ జరుగుతున్నది. హెడ్​ ఆఫీస్​తో పాటు వివిధ జోన్లలో పనిచేస్తున్న కమర్షియల్​ ట్యాక్స్​ ఆఫీసర్లపైనా ప్రభుత్వం ఇంటెలిజెన్స్​తో నిఘా పెట్టినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు కాకుండా.. అవకతవకలకు పాల్పడుతూ రాబడికి గండి కొడుతూ జేబులు నింపుకుంటున్న ఆఫీసర్లపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది.

1,800 నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు

ఇన్​పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​ కొల్లగొట్టేందుకు ఐదారు ముఠాలు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఒక ముఠాను గుర్తించి అరెస్ట్​ చేశారు. రాష్ట్రంలో తప్పుడు పత్రాలతో రూ.288 కోట్ల భారీ జీఎస్టీ ఇన్​పుట్ ట్యాక్స్​ క్రెడిట్​ను దాదాపు 350 మంది డీలర్లు దోచేసినట్లు ఇటీవలే గుర్తించారు. వీరిని కూడా అరెస్ట్​ చేశారు. రాష్ట్రంలో దాదాపు మూడు వేల వరకు జీఎస్టీ రిజిస్ట్రేషన్లు అనుమానాస్పదంగా ఉన్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా..  ఇందులో దాదాపు 1,800 నకిలీవని తేల్చారు. ప్రధానంగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు చూపిన అడ్రస్‌‌‌‌‌‌‌‌లో ఆ సంస్థ లేకపోవడం.. ఉన్నప్పటికీ వ్యాపార లావాదేవీలు చేయకుండా కాగితాల మీదనే వ్యాపారం చేసినట్లు చూపించినట్లు తేలింది. దీంతో రిటర్న్‌‌‌‌‌‌‌‌లు వేసి.. ఇన్​పుట్​ ట్యాక్స్​ క్రెడిట్​ తీసుకోవడం లాంటివి ఇందులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోని పలు వ్యాపార సంస్థల్లో బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి పనులు చేస్తుంటారు. వారికి తెలియకుండా వారి పేర్లతో జీఎస్టీ రిజిస్ట్రేషన్లు చేయించి వ్యాపారాలు చేసినట్లు, జీఎస్టీ కట్టినట్లు బోగస్‌‌‌‌‌‌‌‌ పత్రాలను అక్రమార్కులు సృష్టిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కంపెనీలు ఉన్నాయా లేదా అనేదానిని ఈ నెల 15 వరకు అధికారులు ఎంక్వైరీ చేయనున్నారు.