హైదరాబాద్, వెలుగు: జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర సర్కారు.. డెంటల్ కాలేజీల ఏర్పాటుపై మాత్రం ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలో 25 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే, ఒకే ఒక్క గవర్నమెంట్ డెంటల్ కాలేజీ ఉంది. అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో 1979లో ఏర్పాటు చేసిందే. హైదరాబాద్‌ఋబలోని అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఈ కాలేజీలో వంద బీడీఎస్ సీట్లు, 24 పీజీ సీట్లు ఉన్నాయి. ఈ కాలేజీకి అనుబంధంగా ఇక్కడే ఒక డెంటల్ హాస్పిటల్ కూడా ఉంది. ఇది మినహా రాష్ట్రంలో ఇంకెక్కడా దంత వైద్యం అందించే సర్కారు దవాఖాన్లు లేవు. దీంతో బీడీఎస్ చేయాలని ఆశపడ్తున్న స్టూడెంట్లు ప్రైవేటు కాలేజీల వైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు డెంటల్ కాలేజీలు 14 ఉండగా, ఒక్కో కాలేజీలో వంద చొప్పున మొత్తం 1400 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. అయితే, వాటిలో పీజీ సీట్లు అందుబాటులో లేవు. ఈసారి మెడికల్ కాలేజీల సంఖ్య పెరగడంతో గతంలో కన్నా ఎక్కువ మంది స్టూడెంట్లు నీట్ ఎగ్జామ్ రాశారు. 44,629 మంది నీట్‌లో క్వాలిఫై అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25 ప్రభుత్వ, 31 ప్రైవేటు మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 8,340 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. నీట్ క్వాలిఫై అయిన వాళ్ల సంఖ్య.. సీట్ల సంఖ్య కన్నా దాదాపు ఐదింతలు ఉంది. దీంతో మెరుగైన ర్యాంకు రాని స్టూడెంట్లు బీడీఎస్ కోర్సు వైపు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వ కాలేజీ ఒకటే ఉండడం, బీడీఎస్ తర్వాత పీజీ చేసేందుకు సీట్ల సంఖ్య అత్యంత తక్కువగా ఉండడంతో విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు.
ALSO READ :పాలమూరు బిడ్డ నటరాజ్‌కు.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు
దవాఖాన్లు నిల్
దంతాల శుభ్రత, వాటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అలవాటుతో పాటు దంత సమస్యలు కూడా పెరిగాయి. ఇందుకు అనుగుణంగానే ప్రైవేటు డెంటల్ హాస్పిటళ్లు పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి. హైదరాబాద్‌లో, జిల్లాల్లో వందల సంఖ్యలో డెంటల్ హాస్పిటళ్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ దవాఖాన్లలో డెంటల్ సేవలను అందుబాటులోకి తేవడంపై మాత్రం సర్కారు ఆసక్తి చూపడం లేదు. హైదరాబాద్ మినహా జిల్లాల్లో ఎక్కడా ప్రభుత్వ డెంటల్ హాస్పిటల్స్ లేవు. సుమారు వెయ్యికి పైగా ప్రభుత్వ దవాఖాన్లు ఉంటే 50 మంది డెంటిస్టులు కూడా ప్రభుత్వ సెక్టార్‌లో లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో డెంటల్ కాలేజీలతో పాటు, దంతవైద్య సేవలను కూడా ప్రభుత్వ
దవాఖాన్లలో అందుబాటులోకి తేవాలని జనాలు కోరుతున్నారు.