- పంచాయతీ రాజ్ కమిషనర్, ఫైనాన్స్, ఐటీ, సహకార శాఖ అధికారులతో కమిటీ
- నిధుల దుర్వినియోగంపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: స్త్రీనిధి ఎండీ విద్యా సాగర్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వంలో ఆయన నిబంధనలకు విరుద్ధంగా సీఎస్ఆర్ ఫండ్స్ పాలకుర్తి నియోజకవర్గానికి డైవర్ట్ చేశారని ప్రభుత్వానికి తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత ఎన్ఎం శ్రీకాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో నిధుల దుర్వినియోగం, అవినీతి అక్రమాలు, ఉద్యోగుల తొలగింపు తదితర అంశాలపై విచారణకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీ వేసింది. కమిటీలో పంచాయతీరాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్, సహకార శాఖ అదనపు రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి చంద్రకళ, ఐటీ శాఖ ఎంజీఎం శ్రీనివాస్ ఉన్నారు.
రెండు నెలల వ్యవధిలో విచారణ జరిపి పూర్తి నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ప్రభుత్వం కోరింది. నివేదిక పరిశీలించిన అనంతరం సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి గత ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టానుసారంగా వ్యవహరించేవారని ఆరోపణలు ఉన్నాయి. అంతా అతను చెప్పినట్టే జరగాలి అన్నట్టుగా ఒంటెద్దు పోకడలు పోయేవారని సమాచారం. ఆయన చెప్పినట్టు వినే ఉద్యోగులను ఎలాంటి ఇబ్బందులు కలిగించే వారు కాదని, వినని వారిని వేధించేవారని.. ఉద్యోగం నుంచి తొలగించడం లేదా వారే ఉద్యోగం విడిచి వెళ్లేలా చేసేవారని ఆరోపణలు ఉన్నాయి.