నేనేమైనా టెర్రరిస్టునా..? సర్కార్ ను ప్రశ్నించిన  బీఆర్ఎస్ నేత : ఆర్‌‌ఎస్ ప్రవీణ్‌కుమార్

నేనేమైనా టెర్రరిస్టునా..? సర్కార్ ను ప్రశ్నించిన  బీఆర్ఎస్ నేత : ఆర్‌‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, వెలుగు: ‘నేనేమైనా టెర్రరిస్టునా’ అని సర్కార్ ను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. పోలీసులు తనను గృహ నిర్బంధంలో ఉంచడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గోషామహల్ పోలీస్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్ లతో పాటు పలువురిని డీజీపీ జితేందర్ ఆహ్వానించారు.

ఇందులో భాగంగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ కు కూడా అధికారులు ఆహ్వానం పంపించారు. అయితే, రెండ్రోజులుగా గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనలో పాల్గొంటున్న ఆర్ఎస్పీని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. దీనిపై ఆర్ఎస్పీ మండిపడ్డారు. తనను ఆహ్వానించి, అవమానిస్తారా అని ఆయన విమర్శించారు. అమరవీరులకు నివాళులు అర్పించే అర్హత తనకు లేదా అని ఆయన ప్రశ్నించారు. తానేమైనా టెర్రరిస్టునా అని సర్కార్ ను నిలదీశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా స్పందించారు. పిలిచి అవమానించడమేంటని ఆయన విమర్శించారు.