ఎస్సీ ఉపకులాలకు మరో కార్పొరేషన్​!

ఎస్సీ ఉపకులాలకు మరో కార్పొరేషన్​!
  • కోడ్ ముగిసిన వెంటనే ఉత్తర్వులు ఇచ్చే అవకాశం
  • ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ
  • ఇప్పటికే ఎస్సీ మాల, మాదిగ కార్పొరేషన్లు 
  • ఎంపీ ఎన్నికలకు ముందే ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ ఉపకులాలకు మరో కార్పొరేషన్​ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కోడ్ ముగిసిన తర్వాత ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఎంపీ ఎన్నికలకు ముందు ఎస్సీల్లో మాల, మాదిగలకు రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు ఇచ్చింది.  గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో రెండు కులాలకు ఒకే కార్పొరేషన్ ఉండటంపై ఆయా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలోని మంత్రులను ఎస్సీ నేతలు ఎన్నిసార్లు కోరినా.. పట్టించుకోలేదు. 

వివక్షకు గురవుతున్న ఎస్సీ ఉపకులాలు

ఎస్సీల్లో 65 శాతం మాదిగలు ఉండగా.. 25 శాతం మాలలు, మరో 10 శాతం 58 ఉప కులాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ 10 శాతం ఉన్న ఉప కులాలు అన్ని అంశాల్లో వివక్షకు గురవుతు న్నాయి. ప్రభుత్వ నిధుల కేటాయింపు, కార్పొరేషన్ లోన్లు సైతం దక్కడం లేదని ఆయా నేతలు అంటున్నారు. వీరిని ఎస్సీ మాల, మాదిగ కార్పొరేషన్లలో ఎందులో చేర్చినా ఆయా వర్గాలనుంచి వ్యతిరేకత వస్తుందని చెప్తున్నారు.

ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్​ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. ఉప కులాలకు సపరేట్ గా కార్పొరేషన్​ఉంటేనే ఆయా వర్గాలను డెవలప్ చేయడంతో పాటు ప్రత్యేక దృష్టిపెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే ఎస్సీ మాల, మాదిగ కార్పొరేషన్​ ఏర్పాట్లకు ఉత్తర్వులు ఇవ్వగా.. కోడ్ ముగిసిన తర్వాత ఎస్సీ ఉపకులాలకు సైతం మరో కార్పొరేషన్​ ఏర్పాటు చేసేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్టు సమాచారం.