గుడుంబా కంట్రోల్ కు ‘ఎక్సైజ్' డెడ్ లైన్

గుడుంబా కంట్రోల్ కు ‘ఎక్సైజ్' డెడ్ లైన్
  • ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా సారా తయారీ
  •  ఆగస్టు 31 వరకల్లా నియంత్రించాలని టార్గెట్
  •  ఈ ఏడాది ఇప్పటికే 4 వేలకు పైగా కేసులు నమోదు

హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాటు సారా కోరలు చాస్తోంది. ఏజెన్సీ ఏరియాలు, తండాల్లో తయారవుతున్న గుడుంబా అర్బన్​ ప్రాంతాలకు చేరి జనాల బతుకులు చిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా రక్కసిపై స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. ఈ నెల చివరికల్లా గుడుంబాను పూర్తిగా నియంత్రించాలని డెడ్​ లైన్​ విధించింది. దీంతో ఎక్సైజ్​ ఆఫీసర్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపడుతున్నారు. 

ఈ ప్రాంతాల్లో అధికం

మహబూబాబాద్, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గుడుంబా తయారీదారులు వేల సంఖ్యలో ఉన్నారు. వారికి నాటు సారానే ఉపాధి. కానీ, వారివల్ల ఎంతోమంది ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయారు. దీంతో జిల్లాలో గుడుంబా నిర్మూలించేందుకు కొద్దిరోజులుగా ఆఫీసర్లంతా యాక్షన్​ ప్లాన్​ అమలు చేస్తున్నారు. ఈ నెల 13 స్టేట్​ ఎన్ ఫోర్స్​మెంట్​ డైరెక్టర్​ వీబీ కమల్​ హాసన్​ రెడ్డి, వరంగల్ సీపీ అంబర్​ కిశోర్​ ఝా, ఎక్సైజ్​ డిప్యూటీ కమిషనర్​ అంజన్​ రావుతో కలిసి ఓరుగల్లు పరిస్థితిపై రివ్యూ చేశారు. ఉమ్మడి జిల్లాలో నాటు సారాను ఆగస్టు 31లోగా నియంత్రిస్తామని డెడ్​ లైన్​ ఫిక్స్​ చేశారు. 

ప్రత్యామ్నాయ ఉపాధి

గుడుంబా ఎఫెక్టెడ్​ పర్సన్స్​ రిహాబిలిటేషన్​ స్కీం ద్వారా బాధితులకు అధికారులు వారికి ఇతర ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు అప్పటి వరంగల్​ రూరల్​ జిల్లాలో 123 మంది, వరంగల్ అర్బన్​లో 236, జనగామలో 213, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో411, మహబూబాబాద్ 455మందిని లబ్ధిదారులుగా గుర్తించి మొత్తంగా 1,438 మందికి దాదాపు రూ.28 కోట్లతో ఆటోలు, మినీ డెయిరీలు, కిరాణషాపులు, టెంట్​ హౌజ్​ లు, సెంట్రింగ్​ కర్రల బిజినెస్​ పెట్టించారు. 

పునరావాసం కొందరికే!

గుడుంబా తయారీదారులు క్షేత్రస్థాయిలో వేలాది మంది ఉండగా, కొందరికి మాత్రమే పునరావాసం దక్కుతున్నట్టు తెలుస్తోంది. దీంతో మిగతావాళ్లు నాటుసారా తయారీ కొనసాగిస్తున్నారు . పునరావాసం పొందినవాళ్లు కూడా మళ్లీ గుడుంబా బాటనే పడుతున్నారు. వారికి తోడు కొత్తవాళ్లు కూడా తయారు చేయడం ప్రారంభిస్తుండటంతో ఇది క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహబూబాబాద్​, జయశంకర్​ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఈ గుడుంబా ఏరులై పారుతోంది. రేగొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొడవటంచలో పదుల సంఖ్యలో జనాలు నాటు సారా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెబుతున్నారు.

పోలీసుల చర్యలు ఇలా 

ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్​ డిప్యూటీ కమిషనర్​ అంజన్​ రావు ఆధ్వర్యంలో మొత్తం 2,564 కేసులు నమోదు చేశారు. 2,770 మందిని అరెస్ట్ చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 4,667 కేసులు చేసి, 2,883 మందిని అరెస్ట్ చేశారు. రూ.35 వేల లీటర్ల వరకు గుడుంబా సీజ్​ చేసి, రూ.13.95 లక్షల లీటర్ల పానకం ధ్వంసం చేశారు. సుమారు 114 టన్నుల నల్ల బెల్లాన్ని సీజ్​ చేశారు. గతంలో కూడా ఇలాగే తనిఖీలతో హడావుడి చేసిన అధికారులు ఆ తరువాత లైట్​ తీసుకోగా.. ఈసారైనా గుడుంబా రక్కసి జనాల్లోకి రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జనాలు డిమాండ్​ చేస్తున్నారు. 

గుడుంబాను పూర్తిగా నియంత్రించాలి

గ్రామాల్లో గుడుంబా విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొడవటంచలో కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలామంది యువత నాటు సారాకు అలవాటు పడుతున్నారు. గుడుంబా తాగి ఆరోగ్యం దెబ్బతినడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఇకనైనా అధికారులు గుడుంబాను పూర్తిగా నియత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి.

- గుండెకారి గణేష్​, సోషల్​ యాక్టివిస్ట్​, కొడవటంచ.

సీరియస్​ యాక్షన్​ తీసుకుంటాం​

గుడుంబా నియంత్రణకు యాక్షన్​ ప్లాన్​ అమలు చేస్తున్నాం. ముఖ్యంగా బెల్లం అక్రమ రవాణాపై నిఘా పెట్టాం. గ్రామాల వారీగా వివరాలు సేకరించి, తయారీదారులను బైండోవర్​ చేయడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తున్నాం. గుడుంబా తయారు చేసినా, అమ్మినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్దిష్ట గడువులోగా గుడుంబాను అరికట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం.

- అంజన్​ రావు, ఎక్సైజ్​ డిప్యూటీ కమిషనర్​, వరంగల్