తెలంగాణలో క్రీడలకు పెద్దపీట

తెలంగాణలో క్రీడలకు పెద్దపీట
  • రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారుడు ఏపీ జితేందర్ రెడ్డి

పాలమూరు, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్  స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా ఒలింపిక్  సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్లుగా రాష్ట్రంలో క్రీడలను మరిచిపోయారన్నారు. క్రీడలకు పెద్దపీట వేయాలని కేసీఆర్ ను తాను అడిగినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర బడ్జెట్​లో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.375 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం కప్  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వచ్చే నెల 2న సీఎం కప్  ప్రారంభమవుతుందని, 21 నుంచి నెల రోజుల పాటు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా పాలసీ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ క్రీడల్లో రాజకీయాలు చేయవద్దని సూచించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్  కార్పొరేషన్ చైర్మన్  ఒబేదుల్లా కొత్వాల్, డీవైఎస్ వో ఎస్  శ్రీనివాస్, న్యాయవాది మనోహర్ రెడ్డి, లక్ష్మీకాంత్  రాథోడ్, కె రాములు, అమరేందర్​రాజు, శరత్ చంద్ర, శ్యాంసుందర్ గౌడ్, సురేశ్​చందర్, చెన్న వీరయ్య, రాంచందర్, శ్రీనివాసులు, బాబులాల్, ఎల్  రవికుమార్  
పాల్గొన్నారు.

ఒలింపిక్ సంఘం ఎన్నిక..

ఉమ్మడి జిల్లా ఒలింపిక్  సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర పరిశీలకుడు సతీశ్​ గౌడ్ తెలిపారు. చైర్మన్ గా ఏపీ జితేందర్ రెడ్డి, అధ్యక్షుడిగా ఎన్పీ వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా కురుమూర్తిగౌడ్, ట్రెజరర్​గా ఉమామహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా జాకీర్, ఆర్  రంగారావు, విలియం, రజనీకాంత్ రెడ్డి, జగన్మోహన్ గౌడ్, బి నర్సింలును ఎన్నుకున్నారు.