- రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జోనల్ టీమ్స్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- రూల్స్ ప్రకారం నడుస్తున్నాయో ? లేదో ? తనిఖీలు చేయనున్న టీమ్స్
- ఇప్పటికే జిల్లాల వారీగా తనిఖీలు ప్రారంభించిన ఆఫీసర్లు
- హాస్పిటల్స్‌లో ఉన్న లోపాలపై ప్రభుత్వానికి రిపోర్ట్
- సూచనలు పట్టించుకోని హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకోనున్న సర్కార్
మంచిర్యాల, వెలుగు : విచ్చలవిడిగా నడుస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ దందాకు అడ్డుకట్టే వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ 2010ను పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రైవేట్ హాస్పిటల్స్ రూల్స్ ప్రకారం నడుస్తున్నాయా ? లేదా అని పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జోనల్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఆయా జోన్లలోని హాస్పిటల్స్ సంఖ్యను బట్టి ఒక్కో టీమ్‌లో నలుగురు నుంచి ఎనిమిది మంది ఆఫీసర్లను నియమించింది.
ప్రతి టీమ్‌కు జాయింట్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ స్థాయి ఆఫీసర్లు కో ఆర్డినేటర్లుగా వ్యవహరించనున్నారు. వీరు తమ పరిధిలోని ప్రైవేట్ హాస్పిటల్స్‌ను తనిఖీ చేసి అక్కడ గుర్తించిన లోపాలపై పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌కు రిపోర్ట్ అందజేస్తారు. ఆ రిపోర్ట్ ప్రకారం సదరు హాస్పిటల్స్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సంబంధిత ఆఫీసర్ తెలిపారు.
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్
రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు సహా రూరల్ ఏరియాల్లోనూ ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ పేరిట బోర్డులు ఏర్పాటు చేసి అడ్డగోలు దోపిడీ దందాకు తెరలేపుతున్నారు. చాలా హాస్పిటల్స్‌లో కనీస సౌలత్‌లతో పాటు క్వాలిఫైడ్ డాక్టర్లు, సిబ్బంది కూడా కనిపించడం లేదు. కొన్ని హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ లేకుండానే నడుస్తుండగా, మరికొన్నింటి రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా రెన్యూవల్ చేసుకోకుండానే హాస్పిటల్స్ నడుపుతున్నారు.
చాలా హాస్పిటళ్లు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రైవేట్ హాస్పిటల్స్ దందాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు రివ్యూలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీమ్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
మొదట సూచనలు, ఆ తర్వాత చర్యలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు జోనల్ టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు ఇప్పటికే జిల్లాల్లోని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో తనిఖీలు మొదలు పెట్టాయి. అల్లోపతి, యోగ, నేచురోపతి, ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, యునానితో పాటు అన్ని రకాల హాస్పిటల్స్‌ను ఈ టీమ్స్ తనిఖీ చేయనున్నాయి. హాస్పిటల్స్‌కు రిజిస్ట్రేషన్ ఉందా ? గడువు ముగిసినట్లయితే రెన్యూవల్ చేయించారా ? లేదా ? మల్టీస్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రూల్స్ ప్రకారమే నడుస్తున్నాయా ? క్వాలిఫైడ్ డాక్టర్లు, స్టాఫ్ ఉన్నారా ? ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ల్యాబ్, ఎక్స్‌రే, స్కానింగ్ సెంటర్లు, మెడికల్ షాప్‌లు రూల్స్ ప్రకారమే ఉన్నాయా ?
బయో మెడికల్ వేస్టేజ్ ప్లాంట్ ఉందా ? హాస్పిటల్‌లో అందించే సర్వీస్‌లు, వాటి టారిఫ్ రేట్లు డిస్ ప్లే చేస్తున్నారా ? లేదా ? వంటి అంశాలను పరిశీలించనున్నారు. ఫస్ట్ ఫేజ్ తనిఖీల్లో గుర్తించిన లోపాలను సవరించుకోవాలని మేనేజ్‌మెంట్లకు సూచనలు ఇస్తారు. ఈ అంశాలపై పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌కు రిపోర్ట్ అందజేస్తారు. కొన్ని రోజుల తర్వాత సెకండ్ ఫేజ్ తనిఖీలు నిర్వహించి లోపాలను సవరించుకోని హాస్పిటల్స్‌పై ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 వేల హాస్పిటల్స్
ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల హాస్పిటల్స్ కలిపి సుమారు 16 వేలు ఉన్నాయి. జోన్ 1 పరిధిలోని కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 494, జోన్ 2లోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో 1,272, జోన్ 3లోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో 1,198 హాస్పిటల్స్ ఉన్నాయి.
అలాగే జోన్ 4 పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో 1,912, జోన్ 5లోని సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో1,401, జోన్ 6లోని మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో 8,502 హాస్పిటల్స్ ఉండగా, జోన్ 7 పరిధిలోని జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్ జిల్లాల్లో 1,108 హాస్పిటల్స్ ఉన్నాయి.