
కలెక్టర్లు, హెచ్ఓడీలకు పాత జిల్లాలు, పాత శాఖలే
పోలీస్ శాఖలోనూ అప్డేట్ కాని వివరాలు, ఫోన్ నంబర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లేదు. వివిధ విభాగాలకు హెచ్వోడీలుగా ఉన్న సీనియర్ ఐఏఎస్‌లు, కలెక్ట ర్లు, అదనపు కలెక్టర్లు బదిలీ అయి వారి స్థానంలో కొత్త వాళ్లు వచ్చినా..ఆ వివరాలను మార్చడం లేదు. దీంతో ఏ ఐఏఎస్ ఏ జిల్లాకు కలెక్టర్‌గా ఉన్నారో, ఏ శాఖకు ఎవరు హెచ్వోడీగా కొనసాగుతున్నారో సాధారణ జనాలు తెలుసుకోలేకపోతున్నారు.
పైగా సెల్ ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచడం లేదు. ఉదాహరణకు telangana.gov.in ప్రభుత్వ వెబ్సైట్లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ రాజ్ ఉన్నారు. అయితే, రాహుల్ రాజ్ ఎప్పుడో ఆదిలాబాద్ నుంచి బదిలీపై మెదక్ కలెక్టర్‌గా వెళ్లారు. ఇప్పుడు ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి షా ఉన్నారు. ఇదొక్కటే కాదు.. కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా వెంకటేశ్ దొత్రే ఉన్నారు.
అయితే ప్రభుత్వ వెబ్సైట్ మాత్రం బొర్కడే హేమంత్ సహదేవరావు పేరు చూపిస్తున్నది. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్‌గా గౌతం పోట్రు ఉంటే.. గవర్నమెంట్ పోర్టల్‌లో ఇంకా అమోయ్ కుమార్ (ఎఫ్ఏసీ) అని ఉన్నది. అడిషనల్ కలెక్టర్ల లిస్ట్ కూడా అలాగే ఉంచారు. కేవలం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు మాత్రమే కాకుండా.. వివిధ హెచ్‌వోడీల పరిస్థితి అలాగే ఉన్నది. ఇంకా పాత ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీల పేర్లే దర్శనమిస్తున్నాయి.
ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు వస్తే పీఆర్సీ చైర్మన్‌గా శివశంకర్ ఉన్నారు. ఆయన పేరునే సీనియర్ కన్సల్టెంట్‌గా వెబ్సైట్లో చూపిస్తున్నారు. ఇక హెల్త్ విభాగంలో ఆరోగ్య శ్రీ సీఈవోగా కర్ణన్‌ను ప్రభుత్వం నియమించింది. అయితే, ఆయనకు బదులుగా పాత సీఈవో శివశంకర్ పేరే ఉంది. ఇలా చాలా పేర్లు అప్డేట్ చేయడం లేదు. ఇక పోలీసు శాఖలోనూ గతంలో ఆయా కమిషనరేట్లు, జిల్లా ఎస్పీల ఫోన్ నంబర్లు వెబ్సైట్లో అందుబాటలో ఉంచేవారు.. కానీ, ఇప్పుడు అవన్నీ తీసేశారు.