- 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
- ఫోర్త్ సిటీకి రూ.12,972 కోట్లు
- మిషన్ భగీరథకు రూ.11,996 కోట్లు
- మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.7 వేల కోట్లు
- మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ సీవరేజీ
- సిస్టమ్‌కు రూ. 7,200 కోట్లు
- స్కూల్స్ అప్‌గ్రేడేషన్, గురుకుల విద్యాలయాల నిర్మాణానికి రూ. 4,500 కోట్లు
- ప్రతిపాదనలను పనగరియా టీమ్ ముందుంచిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు : తెలంగాణకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.71,744 కోట్లు ఇప్పించాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భవిష్యత్తులో రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టేది, వాటికి గ్రాంట్ కింద ఎంత మొత్తంలో కావాలో ఆర్థిక సంఘం చైర్మన్ అర్వింద్ పనగరియా టీమ్‌కు వివరించింది. ఈ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇందులో ప్రధానంగా ముచ్చర్లలో ఏర్పాటు చేస్తున్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ) గురించి ప్రస్తావించింది. ఈ నెట్ జీరో సిటీకి రూ.12,972 కోట్లు కావాలని ప్రతిపాదించింది.
దీంతో పాటు మిషన్ భగీరథ మంచినీటి పంపిణీ కోసం కూడా గ్రాంట్ ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. గతంలోనూ ఈ ప్రతిపాదన చేసినట్లు గుర్తుచేసింది. ఇంకా చాలా ఇండ్లకు మిషన్ భగీరథ నీళ్లు అందడంలేదని, అదే సమయంలో నిర్వహణ కూడా చేయాల్సి ఉన్నందున ఇందుకు అవసరమైన మొత్తం రూ.11,996.77 కోట్ల కోసం కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ (హెచ్– సిటీ) కోసం రూ.7,800 కోట్ల గ్రాంట్‌ను కోరుతూ ప్రతిపాదించింది. ఇక మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ సీవరేజీ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్‌ను కోరింది.
Also Read:-తెలంగాణలో 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్‌సిగ్నల్
రాష్ట్రవ్యాప్తంగా 142 యూఎల్బీలలో కొత్తగా అండర్ గ్రౌండ్ సీవరేజీ సిస్టమ్ నిర్మాణానికి రూ.7,200 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. రూ. లక్షన్నర కోట్లతో మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో ప్రభుత్వం భారీ ప్రాజెక్ట్‌ను టేకప్ చేసిందని.. తెలంగాణ దశ దిశను మార్చడంతో పాటు ఎకానమికల్‌గా ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌ను ప్రధాన నగరంగా గుర్తించేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని ఆర్థిక సంఘానికి వివరించింది. ఇందుకు గాను రూ.7 వేల కోట్లు కావాలని కోరింది.
వారసత్వ కట్టడాలు, చెరువుల సంరక్షణ కోసం రూ.1,000 కోట్లు అడిగింది. గురుకులాల నిర్మాణాల కోసం దాదాపు రూ.2 వేల కోట్లు, వాటర్ సప్లయ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ క్రియేషన్ కోసం రూ.2 వేల కోట్లు, ఇతర ప్రతిపాదనల కింద ఇంకో రూ.12,043 కోట్లు సిఫార్సు చేయాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.