ప్రకృతి సేద్యం చేయండి..రైతులకు గవర్నర్ పిలుపు

ప్రకృతి సేద్యం చేయండి..రైతులకు గవర్నర్ పిలుపు
  •  రైతు సమ్మేళనంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

చేవెళ్ల, వెలుగు: ప్రతిఒక్క రైతు సేంద్రియ(ప్రకృతి) వ్యవసాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఆదాయం.. ఆహారం.. ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. శంకర్ పల్లిలోని బద్దం సురేందర్​రెడ్డి గార్డెన్​లో శుక్రవారం ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేంద్రియ రైతు సమ్మేళనం నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి దేవుడిచ్చిన వరమని.. మన పూర్వీకులు నేలను పరిరక్షిస్తూ ప్రకృతి వ్యవసాయం చేశారని చెప్పారు. రసాయనాలు ఎక్కువగా వాడితే మట్టిలోని సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతోందని, ఇది భవిష్యత్ తరాలకు ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

తల్లి కడుపులోని బిడ్డలకు కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. స్వచ్ఛమైన ఆహారాన్ని అందించకపోతే భావితరాలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. తక్కువ పెట్టుబడితో ప్రకృతి వ్యవసాయం చేసి అధిక లాభం పొందవచ్చన్నారు. సేంద్రియ ఎరువులను స్వయంగా తయారు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతులు ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ స్టాళ్లను గవర్నర్ తిలకించారు. వారికి మెమొంటోలు అందజేశారు.