భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న గవర్నర్

భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న గవర్నర్

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అర్చక బృందం పరివట్టం కట్టి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో పూజలు చేశారు. వేదపండితులు గవర్నర్​కు వేదాశీర్వచనం ఇచ్చారు. ఈవో రమాదేవి సీతారామచంద్రస్వామి ఫొటోతో పాటు, జ్ఞాపికను, ప్రసాదాన్ని అందజేశారు. ఆంజనేయస్వామి ఆలయంలో పూజలనంతరం ఆయన కూనవరం రోడ్డులోని రెడ్​క్రాస్​ బిల్డింగ్​లో నిర్మించిన తలసేమియా వార్డును ప్రారంభించారు. 

తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా నిర్వహించే ఎలక్ట్రో ప్రాసెస్​, రక్తపరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు.  కలెక్టర్ జితేశ్​వి పాటిల్, ఎస్పీ రోహిత్​ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, ఎంపీ పోరిక బలరాంనాయక్​, ఎమ్మెల్యే డాక్టర్​ తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు 
పాల్గొన్నారు. 

భారీ బందోబస్తు 

గవర్నర్​ పర్యటన సందర్భంగా భద్రాచలం పట్టణంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేశారు.  చర్ల మండలంలోని ఛత్తీస్​గఢ్​ బార్డర్​ నుంచి గొత్తికోయలను కొందరు భద్రాచలంలో గవర్నర్​తో భేటీ అయ్యేందుకు తీసుకొచ్చిన విషయాన్ని పసిగట్టిన పోలీసులు అలర్ట్​ అయ్యారు. వెంటనే వారిని భద్రాచలం శివారున ఒక ఫంక్షన్​ హాలులో నిర్బంధించారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు.