తెలంగాణలో వందరోజుల నూతన శకం

తెలంగాణలో వందరోజుల నూతన శకం

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రాకతో నూతన శకం ప్రారంభమైంది. దొరల రాజ్యం అంతరించి తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ప్రసంగించిన సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ‘‘మేము పాలకులం కాదు.. ప్రజా సేవకులం’’ అని లక్షలాది మంది ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. చెప్పినవిధంగానే ప్రజా సేవే ధ్యేయంగా పాలనను ముందుకు నడుపుతున్నారు.  

ప్రమాణ స్వీకారం చేసింది మొదలు, ముఖ్యమంత్రి పాలనను పరుగులు పెట్టించడం మొదలుపెట్టారు. ఈ 100 రోజుల్లో ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా నిరంతరం ఆయన పాలనపైనే దృష్టి సారించి ముందుకు నడుస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌ వేగంతో ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు  కూడా అలుపెరగకుండా ప్రతిరోజూ  ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ  రాష్ట్రాభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం పనిచేస్తున్నారు. 


గత పాలకులు పాలనా వ్యవస్థలను సర్వనాశనం చేశారు.  ప్రభుత్వ సంస్థలను తమ జేబుసంస్థలుగా ఉపయోగించుకున్నారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి తమ ఆస్తులను పెంచుకున్నారే తప్ప ప్రజా సమస్యలు పట్టకుండా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు పాలనను సాగించారు.  గత డిసెంబర్‌‌‌‌‌‌‌‌7న  కొలువుదీరిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ పాలనను గాడిలో పెట్టడానికి మంత్రివర్గం మొత్తం తీవ్రంగా కృషి చేస్తున్నది. అన్నిటికన్నా ముఖ్యంగా గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజు నుంచే ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రధానంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లోగా పూర్తి చేయటం కోసం ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేసింది. అనుకున్నవిధంగానే ఆరు గ్యారంటీలను నెరవేర్చి ప్రతిపక్షాలకు షాక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది.

పదేండ్ల అభివృద్ధి గుదిబండలు

గత ప్రభుత్వం పదేండ్ల పాలనలో దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి, ఖాళీ ఖజానాను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు అప్పజెప్పి వెళ్లిపోయింది. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌ సంస్థలను రూ.81వేల కోట్ల అప్పులలో ముంచారు. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పగిలిపోయి నిరర్ధక ప్రాజెక్టుగా మారి ప్రజలకు గుదిబండగా మారింది. దీనితో 6 గ్యారంటీల అమలుకు నిధులు సమకూర్చుకోవడం కొత్త ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్‌‌‌‌‌‌‌‌గా మారింది. కానీ, ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల ఆత్మస్థైర్యం, పట్టుదల ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఈ సవాళ్లను, ప్రతికూలతను అధిగమించారు.

ప్రగతిభవన్‌‌‌‌‌‌‌‌  గేట్లు ఖుల్లా

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే 6 గ్యారంటీల అమలుకు ఉద్దేశించిన ఫైలుపై ఆయన సంతకం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌కు అడ్డంగా ఉన్న ముళ్ల కంచెలను బద్దలు కొట్టించారు. ఏనాడూ ప్రజల కోసం తెరుచుకోని ప్రగతిభవన్‌‌‌‌‌‌‌‌ తలుపులను సామాన్యుల కోసం ఖుల్లా అయినాయి.  ప్రగతిభవన్‌‌‌‌‌‌‌‌ పేరును జ్యోతిరావు పూలే  ప్రజా భవన్‌‌‌‌‌‌‌‌గా మార్చారు. అక్కడ ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజల సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు తీసుకోవడంతో వేలమంది ప్రజలు ఈ కార్యక్రమానికి పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రభుత్వ సహాయం కోసం ఈ కార్యక్రమానికి తరలివచ్చి తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. సంవత్సరాల తరబడి సమస్యలతో సతమతమవుతూ తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు మేమున్నాం అంటూ ప్రభుత్వం వారికి భరోసా ఇచ్చింది. పదేండ్ల తర్వాత తమ బాధలు వినే నాథుడు దొరికాడంటూ ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ ప్రజా దర్బార్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి  స్వయంగా  హాజరై  ప్రజలకు నేనున్నానంటూ వారికి తగిన న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. గత పదేండ్ల పాలనలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి ప్రజలను కలవలేదు. సామాన్య ప్రజల కోసం ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌ గేట్లు ఏనాడూ తెరుచుకోలేదు. అదేమంటే.. ముఖ్యమంత్రి ప్రజలను కలవాల్సిన అవసరం లేదని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు అహంకార పూరితంగా మాట్లాడారు. 

తెలంగాణ అస్తిత్వ పునరుద్ధరణ జరిగింది

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రాకతో సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌ తలుపులు సామాన్యుల కోసం తెరుచుకున్నాయి. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన అందెశ్రీ రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించటాన్ని ఉద్యమకారులు, ప్రజలు హర్షిస్తున్నారు. టీఎస్‌‌‌‌‌‌‌‌ను  టీజీగా  రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారిక చిహ్నాలలో రాచరికపు పోకడలు లేకుండా మార్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపేవిగా  ప్రజలు అభివర్ణిస్తున్నారు. అదేవిధంగా 100 రోజుల్లో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల ఆశలను ఈ ప్రభుత్వం నిలబెట్టింది. అదే గత ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయక అనేకమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తమ కుటుంబంలోని వారికి  పదవులు ఇచ్చుకున్నారు తప్ప నిరుద్యోగుల గోడు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ప్రభుత్వానికి పట్టలేదు. 

ఉద్యమకారుల ఆత్మగౌరవం నిలబడ్డది

తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసినవారిని, ఉద్యమకారులను అధికారం వచ్చిన తరువాత బీఆర్‌‌‌‌‌‌‌‌యస్‌‌‌‌‌‌‌‌ నాయకత్వం వారిని కరివేపాకులుగా తీసిపారేసింది. అదే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కోదండరాంను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి ఉద్యమకారులను గౌరవించింది. అయినా ఈ నిర్ణయాన్ని గౌరవించకుండా దీనిపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు కోర్టుకెక్కి కోదండరామ్‌‌‌‌‌‌‌‌ను కౌన్సిల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లకుండా అడ్డుపడటానికి ప్రయత్నించి తమ నీచబుద్ధిని ప్రదర్శించారు. అదేవిధంగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం బీసీ కులగణనకు గ్రీన్‌‌‌‌‌‌‌‌సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ  చేస్తామని ప్రకటించింది. ధర్నాచౌక్‌‌‌‌‌‌‌‌ను పునరుద్ధరించింది. 

ధరణి ప్రక్షాళన మొదలైంది

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌తో లక్షలాది మంది రైతులు భూములు రిజిస్ట్రేషన్లు కాక కొనుగోళ్లు, అమ్మకాలు జరగక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌ సమస్యలను పరిష్కరించటం కోసం భూ పరిపాలన కమిషనర్‌‌‌‌‌‌‌‌తోపాటు నలుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. క్షేత్ర స్థాయిలో పర్యటించి భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. ధరణిలో  పెండింగ్‌‌‌‌‌‌‌‌ దరఖాస్తుల పరిష్కారానికి  ప్రభుత్వం 9రోజుల పాటు స్పెషల్‌‌‌‌‌‌‌‌డ్రైవ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించింది. 9 రోజుల్లో 45శాతం దరఖాస్తులను పరిష్కరించింది. 

ప్రజాస్వామ్యయుతంగా నడిచిన అసెంబ్లీ

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షానికి తమ గళం వినిపించే అవకాశం గత పదేండ్లలో లభించలేదు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపితే ప్రతిపక్షం మొత్తాన్ని అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. గొంతెత్తి మాట్లాడాలంటే ప్రతిపక్షం భయపడే పరిస్థితిని కల్పించారు. అసెంబ్లీని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ భవన్‌‌‌‌‌‌‌‌గా మార్చి నడిపించారు. కానీ, గత ప్రభుత్వానికి భిన్నంగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అసెంబ్లీని నడిపించింది. ఈ వంద రోజుల్లో  రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినా ఒక్క సభ్యుడిని కూడా అసెంబ్లీ నుంచి సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేయలేదు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులకు మాట్లాడటానికి కావాల్సినంత సమయం ఇచ్చారు. పైగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని పదే పదే ముఖ్యమంత్రి, మంత్రులు కోరారంటే అసెంబ్లీ సమావేశాలను ఎంత ప్రజాస్వామ్యయుతంగా నడిపారో ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి. 

ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారం పటాపంచలు

గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  రాష్ట్రంలో మత కలహాలు జరుగుతాయని, ఢిల్లీ నుంచి పాలన సాగుతుందని,  రైతుబంధు రాదని, పింఛన్లు అందవని, రాష్ట్రానికి పెట్టుబడులు రావని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు దుష్ప్రచారం సాగించారు. ప్రజలలో భయోత్పాతం సృష్టించటానికి ప్రయత్నించారు. కానీ, ఈ దుష్ప్రచారాలను అబద్ధం చేస్తూ తనదైన శైలిలో అద్భుత పాలనను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అందిస్తున్నది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌  నాయకుల ప్రచారాలు అబద్ధాలని నిరూపించింది. తమ కుటుంబం సుఖంగా ఉంటే చాలు ప్రజలు సుఖంగా ఉన్నట్లుగా కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పాలన సాగించారు. కానీ,  ప్రజలు సుఖంగా ఉంటేనే తాము సుఖంగా ఉన్నట్లు రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి పాలన సాగిస్తున్నారు. ప్రజలు తనపై  నమ్మకం ఉంచి అప్పగించిన అధికారాన్ని  ప్రజాసేవకు వినియోగించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారు. తమ అంచనాలకు తగినట్లుగా పాలనను సాగిస్తున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  కాంగ్రెస్​ ప్రభుత్వ పనితీరుకు 100 రోజుల్లో 100 మార్కులు వేస్తున్నారు. గర్వం, అహంకారం  దరి చేరకుండా ప్రజలు తనకు అప్పగించింది అతి పెద్ద బాధ్యతగా భావించి, ఇంటి పెద్దకొడుకు మాదిరిగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ పాలన సాగిస్తున్నారు.

ప్రజాపాలనకు శ్రీకారం

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన రెండవ రోజు నుంచే హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించి మహిళల కళ్లల్లో ఆనందాన్ని నింపారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య చికిత్సల పరిమితిని రూ.10లక్షలకు పెంచే హామీని రెండవ రోజే ప్రభుత్వం అమలు చేసింది.  మిగిలిన గ్యారంటీల అమలుకు ప్రజల నుంచి గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్‌‌‌‌‌‌‌‌ వార్డులలో కలిపి 16,395 ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహించింది. రూ.500లకే సిలిండర్‌‌‌‌‌‌‌‌ గ్యాస్‌‌‌‌‌‌‌‌ ఇచ్చే కార్యక్రమానికి, 200 యూనిట్లలోపు విద్యుత్‌‌‌‌‌‌‌‌ వినియోగిస్తున్న లబ్ధిదారులకు  ఉచిత విద్యుత్‌‌‌‌‌‌‌‌ అందజేసే కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించింది. అదేవిధంగా నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలకు నాలుగున్నర లక్షల ఇళ్లను కేటాయించింది. ఈ కార్యక్రమం కింద సొంత ఇంటి స్థలం కలిగిన పేదలకు ఇంటికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఇల్లు కట్టుకోవటానికి సహాయం చేస్తుంది. గత ప్రభుత్వం 2018 ఎన్నికల సమయంలో ఇళ్లు కట్టుకోవటానికి రూ.5లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి ఒక్కరికి కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసింది. మహాలక్ష్మి స్వశక్తి కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించటంతో 6 గ్యారంటీల అమలును 100 రోజుల్లో అమలు చేసి చూపించటంతో ప్రతిపక్షాలకు జీర్ణం అయితలేదు.

అవినీతిపై దర్యాప్తులు 

ఇన్నాళ్లు అభివృద్ధి మాటున బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు విచ్చలవిడిగా సాగించిన అవినీతి  కొత్త ప్రభుత్వం రాకతో బట్టబయలవుతున్నది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు సాగించిన పాపాల పుట్టలు పగులుతున్నాయి. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అవినీతిపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనితో ఇన్నాళ్లూ అడ్డూ, అదుపు లేకుండా అవినీతికి పాల్పడిన బీఆర్‌‌‌‌‌‌‌‌యస్‌‌‌‌‌‌‌‌ నాయకుల వెన్నులో వణుకు మొదలైంది. మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథ, కాళేశ్వరం, ధరణి, గొర్రెల పంపిణీ, విద్యుత్‌‌‌‌‌‌‌‌ కొనుగోళ్లు, భూకబ్జాలు, ఔటర్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు, టానిక్‌‌‌‌‌‌‌‌ గ్రూపు లిక్కర్‌‌‌‌‌‌‌‌, ఫోన్‌‌‌‌‌‌‌‌ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ వంటివి బయటపడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం సాగించిన అవినీతిపై ఆరోపణలు చేయటమే కాదు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అవినీతిపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కుంగుబాటుపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకిని చంద్రఘోష్‌‌‌‌‌‌‌‌ను, యాదాద్రి, భద్రాద్రి పవర్‌‌‌‌‌‌‌‌ప్లాంట్లలో అవినీతి, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ నుంచి విద్యుత్‌‌‌‌‌‌‌‌ కొనుగోలుపై జరిగిన అవినీతిపై దర్యాప్తునకు జస్టిస్‌‌‌‌‌‌‌‌ నర్సింహారెడ్డిని ప్రభుత్వం నియమించింది. 

- బోరెడ్డిఅయోధ్య రెడ్డి,సీపీఆర్‌‌‌‌‌‌‌‌ఓ (తెలంగాణ ముఖ్యమంత్రి)