- లిస్ట్‌లో మూసీ పునరుజ్జీవం, రోడ్లు, ట్రిపుల్ ఆర్, మెట్రో, ఫోర్త్ సిటీ, స్మార్ట్ సిటీలు
- పీపీపీ అయితేనే పనులు వేగవంతం అవుతాయని ప్రభుత్వం యోచన
- గత ప్రభుత్వం చేసిన అప్పుల ఫలితం.. ఆచితూచి ఖర్చు చేస్తున్న సర్కారు
- స్కీమ్స్ అమలు, క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ విషయంలో జాగ్రత్తలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అభివృద్ధి పనులను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) మోడల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా కుదుట పడలేదు. ఫలితంగా ఎన్నికల హామీలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో అభివృద్ధి పనులు వేగంగా చేసేందుకు పీపీపీ పద్ధతిలో ముందుకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది.
శాఖలవారీగా ఎక్కడెక్కడ క్యాపిటల్ఎక్స్పెండిచర్ అవసరం పడుతుంది? అనే వివరాలు తెప్పించుకుంటున్నది. అవసరాలకు తగ్గట్టుగా పీపీపీ మోడల్లో ఒప్పందాలు కుదుర్చుకొని, పనులు మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇలా చేయడంతో నిర్వహణ విషయంలోనూ ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నది. ఇప్పటికే రోడ్ల నిర్మాణాలు, స్మార్ట్ సిటీలు, ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణ, ఫోర్త్ సిటీ , మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు వంటివన్నీ పీపీపీ మోడల్లోనే చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది.
అభివృద్ధి పనులు వేగంగా సాగాలంటే పీపీపీ మోడల్‌తోనే సాధ్యమని అనుకుంటున్నది. అయితేఈ పద్ధతిలో చేపట్టే పనులతో భవిష్యత్తులో ప్రభుత్వంపైనా, ప్రజలపైనా పెద్దగా భారంగా పడకుండా ఉండేలా ఒప్పందాలు ఉండాలని సర్కారు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి పనులకు పీపీపీ మోడల్‌ను తీసుకుంటున్నారు ? ఏ రకమైన ఎంవోయూలు చేసుకుంటున్నారు? అనే అంశాలపైనా స్టడీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి పద్ధతుల్లో పనులు చేసేప్పుడు.. ప్రభుత్వం రుణాలు తీసుకునేందుకు ఉన్న అవకాశాలు కూడా చూస్తున్నది.
మూసీ పునరుజ్జీవం నుంచి రోడ్ల దాకా..
రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రాలకు అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న రోడ్లపైనా మళ్లీ రోడ్లు వేయాల్సి ఉన్నది. రాబోయే 4 ఏండ్లలో 16 వేల కిలో మీటర్ల నుంచి 17 వేల కిలో మీటర్లు కొత్త రోడ్లు వేయాలని చూస్తున్నది. ఇందుకోసం రూ.28 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగా లేకపోవడంతో రోడ్లను కూడా పీపీపీ పద్ధతిలోనే వేయాలని సర్కారు నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో ఎలా చేస్తున్నారనే దానిపై స్టడీ చేస్తున్నది. దానికి తగ్గట్టుగా రోడ్లు వేయనున్నారు.
పీపీపీ పద్ధతిలో చేస్తే ఈ రోడ్లను వినియోగించుకునే వాహనదారుల నుంచి పన్నులు ఎలా వసూలు చేయాలనే దానిపైనా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఎవరిపైనా భారం పడకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చూస్తున్నది. మూసీ పునరుజ్జీవం విషయంలోనూ ప్రభుత్వం పీపీపీ ఆలోచనతో ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వరల్డ్ టాప్ 5 కంపెనీలతో మూసీ పునరుజ్జీవానికి ప్లాన్ చేసింది. దీనికోసం తీసుకునే రుణాలు, తిరిగి చెల్లించే విధానం, ప్రైవేట్ భాగస్వామ్యం అన్నింటిని ఎంవోయూలో పేర్కొంటారు. అయితే, పూర్తిగా ప్రైవేట్ పెత్తనం ఉండకుండా పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ వాటా 55 నుంచి 60 శాతం, ప్రైవేట్ 40 శాతం వరకు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం కూడా పీపీపీ పద్ధతిలోనే నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దక్షిణ భాగం 185–191 కిలో మీటర్ల మధ్యలో వస్తున్నది. ఉత్తర భాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నది. దక్షిణ భాగం మాత్రం త్వరగా పూర్తిచేసేందుకు రాష్ట్ర సర్కారు టేకప్ చేస్తున్నది. మెట్రో రెండో దశ కూడా ప్రభుత్వం పీపీపీలోనే చేయాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో జాయింట్ వెంచర్ అయినప్పటికీ.. నిధుల కొరతతో ప్రైవేట్ భాగస్వామ్యం వైపు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది.
మెట్రో రైలుకు 76.4 కిలో మీటర్లకు రూ.24,269 కోట్లు అవసరమని అంచనా. ఫోర్త్ సిటీ నిర్మాణం విషయంలోనూ ప్రభుత్వం పీపీపీకే మొగ్గు చూపుతున్నది. ఫోర్త్ సిటీతో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి సిటీలను కూడా స్మార్ట్ సిటీలు మార్చే ఆలోచన చేస్తున్నది. వీటన్నింటిలోనూ ప్రైవేట్ భాగస్వామ్యం పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
నిధుల కొరతతోనే..
ప్రభుత్వం సొంతంగా చేయాల్సిన క్యాపిటల్ డెవలప్మెంట్ పనులను పీపీపీ పద్ధతిలో చేయడం వెనుక నిధుల కొరత ఉన్నట్టు తెలుస్తున్నది. గత ప్రభుత్వం ఇష్టారీతిన చేసిన అప్పులతో ఆర్థిక నిర్వహణ ఇబ్బందిగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కావొస్తున్నా ఇంకా కుదటపడడం లేదు. గత అప్పులకు ప్రతినెలాకిస్తీలు, వడ్డీల రూపంలో ఏకంగా రూ.6 వేల కోట్ల వరకు చెల్లిస్తున్నది. అంతకుముందు ప్రభుత్వంలో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బిల్లులు ప్రతినెలా కొంత మొత్తం చొప్పున చెల్లిస్తూ క్లియర్ చేస్తున్నది. అదే సమయంలో ఆరు గ్యారంటీలు, ఇతర పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకుంటున్న డెవలప్మెంట్ పనులను పీపీపీలో చేస్తే నిధుల ఇబ్బంది ఉండదని భావిస్తున్నది. అదే సమయంలో పనులు కూడా తొందరగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుందని సెక్రటేరియెట్‌లో ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు చెప్పారు. కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఏయే డెవలప్మెంట్ పనులకు పీపీపీ పద్ధతులను అనుసరిస్తున్నారనే దానిపై అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే నివేదికను సీఎంకు అందజేసి, అన్నింటిపైనా ఒక నిర్ణయానికి వస్తామని వివరించారు.