మహిళా సంఘాలకు మరో బాధ్యత..స్కూళ్లు, గురుకులాల్లో వంటలు

మహిళా సంఘాలకు మరో బాధ్యత..స్కూళ్లు, గురుకులాల్లో వంటలు
  • స్కూళ్లు, గురుకులాల్లో ఫుడ్ బాధ్యత..మహిళా సంఘాలకు
  • సూత్రప్రాయంగా నిర్ణయించిన సర్కారు 
  • సరుకుల రవాణా కూడా వారికే అప్పగింత 
  • ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, రైస్ మిల్లులు కేటాయించేందుకు నిర్ణయం 
  • తాజాగా సీఎం ఆదేశాలతో సెర్ప్ కార్యాచరణ షురూ 
  • త్వరలో సీఎస్ అధ్యక్షతన గురుకులాలు, విద్యాశాఖ అధికారులు, సెర్ప్ సీఈవో భేటీ 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లు, గురుకులాల్లో తరుచూ జరుగుతున్న ఫుడ్​పాయిజనింగ్​ఘటనలకు అడ్డుకట్ట వేయడంపై సర్కారు చర్యలు చేపట్టింది. ఇకపై స్కూళ్లు, హాస్టళ్లలో ఫుడ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. సరుకుల సరఫరాతోపాటు వంటచేసే బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి చూపడంతో పాటు ఫుడ్​క్వాలిటీ సైతం మెరుగుపడ్తుందనే అంచనాకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను అప్పగిస్తోంది. 

కొన్ని సంఘాలకు ఆర్టీసీ బస్సుల నిర్వహణనూ కట్టబెట్టింది. మహిళా సంఘాలు వీటన్నింటినీ విజయవంతంగా నిర్వహిస్తుండడంతో విద్యాసంస్థల్లో వంట బాధ్యతలను కూడా వారికే అప్పగించాలని సీఎం ఆదేశించగా.. ఆ మేరకు సెర్ప్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. దీనిని దశలవారీగా అమలు చేయాలా? లేదంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకేసారి అమలు చేయాలా? అనేదానిపై ఆఫీసర్లు తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే గురుకులాలు, విద్యాశాఖ అధికారులు, సెర్ప్ సీఈవో తో సీఎస్ అధ్యక్షతన త్వరలో భేటీకి నిర్ణయించారు. ఈ సమాశంలో చర్చించిన తర్వాత ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.  

స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా.. 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి మహిళా సంఘాల ద్వారా సరకుల పంపిణీ ప్రారంభించాలని సర్కార్ కసరత్తు చేస్తున్నది. దీనిపై విధివిధానాలు రూపొందించాలని ఇప్పటికే సీఎస్ శాంతికుమారి, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ ను   సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో సరకుల పంపిణీ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించే దిశగా ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం 4 లక్షల 40 వేల సంఘాలు ఉండగా, వాటిలో 46.80 లక్షలకుపైగా సభ్యులు ఉన్నారు. 32 జిల్లా సమాఖ్యలు, 552 మండల సమాఖ్యలు, 12 వేలకుపైగా గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో 1.48 లక్షల సంఘాల్లో17.50 లక్షలపైగా సభ్యులు ఉన్నారు. సెర్ప్, మెప్మా పరిధిలోని సంఘాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో సైతం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గురుకులాలు, హాస్టల్స్, స్కూళ్లు, వాటిలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మహిళా సంఘాలను ఎంపిక చేసి సరకుల సరఫరా బాధ్యతలను అప్పగించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. 

సరఫరాపై ప్రత్యేక శిక్షణ.. 

హాస్టళ్లకు సరకుల సరఫరా బాధ్యతలను అప్పగించే ముందు మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వాలని సెర్ప్ భావిస్తోంది. ఎలాంటి సరకులు తీసుకోవాలి? నాణ్యత, నాసిరకం వస్తువులపై అవగాహన కల్పించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, మార్కెట్ లో కాకుండా నేరుగా రైతులు పండించిన కూరగాయలు, పప్పు దినుసులు కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తోంది. దీనిద్వారా నాణ్యమైన సరకులు లభించడంతోపాటు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. ఇటు రైతులకు కూడా మేలు జరుగుతుంది. ఈ విధానంలో మోసం కూడా జరగదని అధికారులు భావిస్తున్నారు.

వచ్చే విద్యాసంవత్సరం నుంచే..?  

రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, హాస్టళ్లు, పాఠశాలల్లో సరకుల సరఫరా బాధ్యతలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే మహిళా సంఘాలకు అప్పగించాలని సర్కారు యోచిస్తోంది. అయితే, ఈ విధానం దశలవారీగా అమల్లోకి తేవాలా? తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఒక జిల్లాలో అమలు చేసి విజయవంతమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలా? అనేదానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు.

 ఈ స్కీమ్ రూపకల్పన, విధివిధానాలు, సాధ్యాసాధ్యాలపై త్వరలోనే సీఎస్ అధ్యక్షతన జరిగే భేటీ అనంతరం పూర్తస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. అయితే, సరకుల సరఫరా బాధ్యతల నుంచి కాంట్రాక్టర్లను తప్పించి మహిళా సంఘాలకు ఇవ్వడం సాధ్యమయ్యే పనేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

కాంట్రాక్టర్లు ప్రతినెలా ఎవరి వాటా, వారికి పంపిస్తుంటారని, అందుకే వారు  నాసిరకం సరకులు తెచ్చినా.. ఎవరూ పట్టించుకోరని, ఫుడ్ ఫాయిజన్ ఘటనలు జరిగినా నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే కాంట్రాక్టర్లను కాదని మహిళా సంఘాలకు బాధ్యతలు ఇస్తే ముందు ప్రజా ప్రతినిధులే అంగీకరిస్తారా? అనే వాదనలు వినిపిస్తున్నాయి.