ఏసు కృపతోనే కరోనా తగ్గింది : డీహెచ్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌ రావు

భద్రాద్రి కొత్తగూడెం/హైదరాబాద్‌‌‌‌, వెలుగు : ఏసుక్రీస్తు కృప వల్లే కరోనా తగ్గిపోయిందని స్టేట్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌రావు అన్నారు. రెండున్నరేండ్లుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా నుంచి మనం పూర్తిగా విముక్తి పొందామంటే కారణం మనం చేసిన సేవలు కాదని, ఏసుక్రీస్తు ప్రభావం వల్లేనని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీనగర్ కాలనీలో డాక్టర్ జీఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మినీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. అన్ని మతాలు చెబుతున్నట్లు మంచిని ముందుకు తీసుకుపోవడం వల్ల మానవ జాతిని కాపాడుకున్నామన్నారు. ప్రపంచంలో మనదేశం మనుగడకు, అభివృద్ధికి క్రైస్తవమే కారణమన్నారు. క్రైస్తవం ఆనాడు ఆధునిక వైద్యం, విద్య, సంస్కృతిని తీసుకురావడం వల్లే మన దేశం ప్రపంచ దేశాల్లో ముందున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు, మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. 

నా మాటలను వక్రీకరించారు..

మినీ క్రిస్మస్‌‌‌‌ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయని శ్రీనివాస్‌‌‌‌రావు అన్నారు. పూర్తి ప్రసంగానికి బదులు, కొంత భాగాన్ని ప్లే చేసి, తన వ్యాఖ్యలకు తప్పుడు అర్థం వచ్చేలా చేశారని, దీన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కేసీఆర్ చొరవ, ప్రభుత్వం, ఆరోగ్య శాఖ సిబ్బంది కృషి, ప్రజల ప్రార్థనలు, దేవుళ్ల ఆశీర్వాదం వల్లే కరోనా ముప్పు నుంచి బయటపడ్డాం అని తన ప్రసంగంలో చెప్పానన్నారు.