వెనుక బడిపోతున్న సదువు

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2021-–22  పర్​ఫర్మాన్స్​ గ్రేడింగ్​ ఇండెక్స్​2.0 ప్రకారం తెలంగాణ రాష్ట్రం1000 స్కోరుకు గాను 479.9 పాయంట్లతో 31వ స్థానంలో నిలిచింది. మన తర్వాత బీహార్, నాలుగు ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. విద్యలో రాష్ట్రం పరిస్థితి ఇది. కేంద్ర విద్యా శాఖ రూపొందించిన ఆరు ప్రామాణికాల్లో అతి  ముఖ్య మైన ప్రామాణికం అభ్యసన ఫలితాల్లోన్నైతే.. 240 పాయింట్ల కు కేవలం 36.6 పాయింట్లతో తెలంగాణ 35వ స్థానంలో నిలిచింది. మన రాష్ట్రం కంటే మేఘాలయ మాత్రమే వెనుక ఉన్నది. ఇది తెలంగాణ సమాజానికి తలవంపు. ఏటా ఇంచుమించు ఇదే పరిస్థితి. గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రభుత్వం విద్య పట్ల నిర్లక్ష్యం వహించడమే ఈ దుస్థితికి కారణం. తెలంగాణలో విద్యా వ్యవస్థ పెద్ద సంక్షోభంలో ఉన్నది.

ఖాళీలు నింపక.. నిధులు లేక..

రాష్ట్రంలో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బడులను పర్యవేక్షించే మండల, జిల్లా విద్యా అధికారుల పోస్టులు, టీచర్ ట్రైనింగ్ సంస్థలలో ఉపాధ్యాయులను తయారు చేసే డైట్, బీఈడీ కాలేజీల్లో, విద్యా విధానాలు రూపకల్పన చేసే ఎస్​సీఈఆర్టీలో ప్రొఫెసర్ల పోస్టులు కూడా ఖాళీగానే ఉంటే.. విద్యా ప్రమాణాలు ఎలా పెరుగుతాయి? గత రెండేండ్లుగా బడులను శుభ్రం చేసే కార్మికులు లేరు. విద్యా శాఖ లెక్కల ప్రకారం 17,873 టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 607 ఎంఈవోలకు ఉన్నది17 మంది, 33 మంది డీఈవోలకు ఉన్నది 7 మంది, 66 డిప్యూటీ డీఈవోలకు ఉన్నది 6 మంది. ఒకే అధికారి రెండు మూడు జిల్లాల బాధ్యతలు చూస్తున్నారు. ఎంఈవోలు రెండు మూడు మండలాల బాధ్యతలు చూడటం వల్ల ఏ మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు. కరోనా తర్వాత సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు బాగా పెరిగినా..

సార్లు లేక, విద్యా ప్రమాణాలు సరిగా లేక క్రమంగా స్టూడెంట్లు ప్రైవేటు బాట పడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 55% మంది విద్యార్థులు ప్రైవేటు బడుల్లో చదువుతున్నారు. అక్కడా నాణ్యమైన విద్య అందుతుందన్న గ్యారంటీ లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ విద్యాహక్కుచట్టం అమలుకు పది ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల చేసిన దేశవ్యాప్త సర్వేలో తెలంగాణలో గల 40,597 బడులకు కేవలం 6 శాతం బడులు మాత్రమే విద్యాహక్కు చట్టం 2009లో నిర్దేశించిన ప్రమాణాలను కలిగి ఉన్నాయని పేర్కొంది. మొత్తం బడ్జెట్ లో విద్యారంగానికి ఏటా కేటాయింపులు తగ్గుతూనే ఉన్నాయి. తెలంగాణ మొదటి బడ్జెట్ లో విద్యకు 10.89 శాతం నిధులు కేటాయించగా అది ఇప్పుడు 6.57 శాతానికి పడిపోయింది. విద్య కోసం రాష్ట్రాల బడ్జెట్ లో 20 శాతం నిధులు కేటాయించాలని  జాతీయ స్థాయి కమిషన్లు సూచిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏటా నిధులు తగ్గిస్తూ.. సర్కారు బడుల మూతకు కృషి చేస్తున్నది. 

విద్యా ప్రమాణాల లోపం

ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యలో వివిధ తరగతుల్లో చదువుతున్న అధిక శాతం విద్యార్థులకు తరగతి వారి విద్యా సామర్థ్యాల విషయం పక్కకు పెడితే, కనీస విద్యా సామర్థ్యాలు అయిన రాయడం, చదవడం, కూడికలు, తీసివేతలు చేయడం రావడం లేదనేది పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నివేదికల సారాంశం. నాణ్యమైన విద్య మీద, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యా సామర్థ్యాలు అందించకుండా పాఠశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులు విద్యకు దూరం కావడమే కాకుండా బడికెళ్లిన నిరక్షరాస్యులుగా మారుతారని జాతీయ విద్యావిధానంలో స్పష్టంగా ఉంది. ఆ పరిస్థితి రాకముందే సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది.  మౌలిక వసతుల కల్పనలోనూ రాష్ట్ర సర్కారు వెనుకబడి ఉన్నది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రసంగంలో దాదాపు 3,497 కోట్ల రూపాయలతో 9,123 పాఠశాలలలో పన్నెండు రకాల మౌలిక వసతులను కల్పిస్తామని సర్కారు చెప్పింది. అట్టహాసంగా మొదలు పెట్టిన “మన ఊరు మన బడి మన బస్తి” కార్యక్రమం నత్తనడకన సాగుతున్నది. నిధులు సమయానికి కేటాయించక పోవడంతో ఈ ఫిబ్రవరి నాటికి  కేవలం1240 పాఠశాలలను మాత్రమే పూర్తి చేయగలిగింది. 

ప్రైవేటు విద్యా వ్యాపారం

ఒకవైపు ప్రభుత్వ బడుల్లో చదువులు సంతృప్తికరంగా లేక పోవడంతో అనివార్య పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా వీధికొకటి చొప్పున ప్రజల ముందుకు వస్తున్నాయి. పిండికొద్ది రొట్టె అన్న సామెతగా సమాజంలో ఉన్న విభిన్న వర్గాలకు అనుగుణంగా వారి స్తోమతకు తగ్గట్లుగా విచ్చలవిడిగా విద్యావ్యాపారం మొదలైంది. వీటికి తోడు కార్పొరేట్​సంస్థలు సిండికేట్లుగా ఏర్పడి పెద్ద పెద్ద విద్యా వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకుంటున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాల కుటుంబాలు ఈ ప్రైవేటు ఫీజుల బారిన పడి అప్పులు చేసి తమ పిల్లల చదువుల కోసం త్యాగాలు చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలపై నియంత్రణ లేని కారణంగా అతి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడక తప్పడం లేదు. ఇన్ని ఇబ్బందులు పడ్డా కూడా అక్కడ నాణ్యమైన విద్య అందడం లేదని నివేదికల ద్వారా తెలుస్తున్నది.

అద్దె భవనాల్లో గురుకులాలు

తెలంగాణలో గురుకులాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ) ప్రారంభించినంత ఉత్సాహం, ప్రచారం చేస్తున్నంత ఆర్భాటం వాటి నిర్వహణ పట్ల గానీ, నాణ్యమైన ఆహారం అందించే విషయంలో గానీ ప్రభుత్వానికి లేదు. ఇందుకు గత సంవత్సరం వెలుగు చూసిన ఘటనలే ఉదాహరణ. గురుకులాల్లో కనీస వసతులు కల్పించపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యధిక శాతం గురుకులాలు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్నాయి.

 ఆర్. వెంకట రెడ్డి,జాతీయ కన్వీనర్, ఎంవీ ఫౌండేషన్