
- మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్
- మందమర్రిలో రాష్ట్రస్థాయి యోగా పోటీలు
కోల్ బెల్ట్, వెలుగు: యోగా అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని, ఏకాగ్రతతో పాటు వ్యక్తిగత అభివృద్ధి సమాజానికి మేలు చేస్తుందని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం జి. దేవేందర్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో డ్రీమ్ యోగ అండ్ ఫిట్‌నెస్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ లెవల్ యోగా టోర్నమెంటు- 2025ను నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్‌గెస్ట్‌గా హాజరైన సింగరేణి జీఎం ఆల్ ఇండియా యోగా ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిడ్జ్ భూషణ్ పురోహిత్ తో కలిసి టార్చ్వెలిగించి పోటీలను ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రపంచానికి మంచి జరిగేలా చేయడంలో యోగా శక్తివంతమైన సాధనమన్నారు. మందమర్రిలో మొదటిసారిగా తెలంగాణ స్థాయి యోగా పోటీలను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. యోగా శిక్షణకు సింగరేణి యాజమాన్యం సహకరిస్తుందని జీఎం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన యోగా సాధకులు పోటీల్లో వేసిన ఆసనాలు అబ్బురపరిచాయి. డ్రీమ్ యోగా అండ్ ఫిట్‌నెస్ సొసైటీ ఫౌండర్ అండ్ టోర్నమెంటు నిర్వాహకులు ముల్కల్ల శంకర్, సాయి, తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. రవికుమార్, యోగా థెరపిస్టు సత్య రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి కనపర్తి రమేశ్, ఏఐటీయూసీ కార్యదర్శి సత్యనారాయణ, యోగా మాస్టర్లు కొంపెల్లి రమేశ్, మద్ది శంకర్, బర్ల సదానందం, బడికల సంపత్, లయోలా కుమార్, ఎగ్గెటి రాజేశ్వర్, డీఎస్‌రావు పాల్గొన్నారు.