చిన్నారుల్లో వినికిడి సమస్య ఉందా..? రూ.ఆరున్నర లక్షల విలువ చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఫ్రీ..

చిన్నారుల్లో వినికిడి సమస్య ఉందా..? రూ.ఆరున్నర లక్షల విలువ చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఫ్రీ..

పద్మారావునగర్, వెలుగు: చిన్నారుల్లో వినికిడి సమస్యను ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే తగిన ట్రీట్మెంట్ అందించవచ్చని తెలంగాణ రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. వరల్డ్ హియరింగ్ డే సందర్భంగా మీనాక్షి వెంకట్ రామన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 మంది చిన్నారులకు వినికిడి యంత్రాలను అందజేశారు. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలోని అలూమ్ని భవనం సెమినార్ ఆడిటోరియంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుట్టిన బిడ్డ శబ్దం విని దానిని గ్రహించకపోతే మాటలు కూడా రావని అందుకే శిశువుగా ఉన్నప్పుడే పిల్లలకు చికిత్స అందించాలని తల్లిదండ్రులకు సూచించారు.

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్ వెన్షన్ సెంటర్లలో ఆడియాలజిస్టులను నియమిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా మూడేండ్ల లోపు ఉన్న చిన్నారులకు దాదాపు రూ.ఆరున్నర లక్షల విలువ చేసే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఉచితంగా చేస్తున్నామని, గాంధీ ఆసుపత్రి ఈఎన్టీ హెచ్ఓడీ డా.భూపేందర్​సింగ్​ రాథోడ్​ విజ్ఞప్తి మేరకు దానిని త్వరలో ఐదేండ్ల వయసు వరకు పొడిగించనున్నామన్నారు. అలాగే కేవలం ఒకటే చెవికి మాత్రమే ఉన్న పథకాన్ని రెండు చెవులకు కూడా చికిత్స చేసేందుకు త్వరలో అనుమతి విడుదల చేస్తామని చెప్పారు.

కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్​లో ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ల కోసం పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసేందుకు  ఆదేశిస్తామన్నారు. గాంధీ దవాఖానలోనూ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీకి అవసరమైన మెడికల్​ఎక్విప్ మెంట్ ను  అందిస్తామన్నారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ రాజకుమారి, ఎం.వి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ జివి. సేతురామన్, డోనర్​ ఆదినారాయణ పాల్గొన్నారు. మరోవైపు జూబ్లీహిల్స్​లోని మా ఈఎన్టీ ఆస్పత్రిలో  సోమవారం జరిగిన వినికిడి దినోత్సవంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. వినికిడి సమస్యపై అవగాహనం అవసరమన్నారు.

ప్రతి వెయ్యి మందిలో నలుగురికి వినికిడి సమస్య
బషీర్​బాగ్: వినికిడి సమస్య ఉన్న చిన్నారులకు కాక్లియర్ ఇంప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శస్త్ర చికిత్సలు చేయించాలని తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా సూచించారు. ఆశ్రయ్ ఆకృతి ఆధ్వర్యంలో రెడ్ హిల్స్లోని ఫ్యాప్సి  భవన్లో సోమవారం నిర్వహించిన ప్రపంచ వినికిడి దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జన్మించే ప్రతి వెయ్యి మందిలో నలుగురికి వినికిడి సమస్య ఏర్పడుతుందని.. ఈ సమస్య 90 శాతం కంటే ఎక్కువగా ఉంటే కాక్లియర్ ఇంప్లాంట్ చికిత్సే ఉత్తమమని పలువురు నిపుణులు తెలిపారు.