ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జూన్ లోపు స్మార్ట్ సిటీ పనులు పూర్తి
మేయర్​ యాదగిరి సునీల్​రావు 

కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: కరీంనగర్ సిటీని సుందరంగా మార్చుకుందామని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. శనివారం స్థానిక 2వ డివిజన్ లో రూ.14లక్షలు,4వ డివిజన్ లో రూ.32లక్షల వ్యయంతో  నిర్మించనున్న మంచినీటి పైప్ లైన్, సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్​మాట్లాడుతూ.. నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనులన్నింటినీ వచ్చే జూన్ లోపు పూర్తి చేస్తామన్నారు. క్రమంగా నగరంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామన్నారు. నగరప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు బల్దియా కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు, డీఈ మసూద్ అలి, కార్పొరేటర్లు లావణ్య, నుజహత్ ఫర్హీన్, డీఈ మసూద్ అలి తదితరులు పాల్గొన్నారు.

మహిళ  మర్డర్ కేసులో మలుపు 
కన్న కూతురు, అల్లుడి పాత్ర ఉన్నట్లు పోలీసుల అనుమానం 

కరీంనగర్/ తిమ్మాపూర్, వెలుగు:  రామకృష్ణకాలనీలో రెండు రోజుల కిందట మహిళ హత్యా ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. కన్న కూతురు, అల్లుడే ప్రాణాలు తీసేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే.. ఎవరికీ అనుమానం రాకుండా మర్డర్ కు ప్లాన్ చేసినట్లు  పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో నివాసం ఉండే సులోచన భర్త కొన్నేండ్ల కింద చనిపోయాడు. అప్పటి నుంచి కూతురు తేజశ్రీని ఎంతో గారాబంగా పెంచుకుంది. అయితే ఆమె గ్రామంలోని ఓ యువకుడిని ప్రేమించి పెండ్లి చేసుకోవడంతో తల్లీకూతుళ్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ మనవడికి(కూతురి కొడుకు) ఆస్తిలో సగభాగం ఇస్తానని సులోచన చెప్పింది.  మొత్తం ఆస్తి తమకే దక్కాలని భావించి కూతురు, అల్లుడు సులోచన హత్యకు ప్లాన్​చేశారు. ఈక్రమంలో ఆమెకు దగ్గరవుతున్నట్లు నటించి కత్తులతో పొడిచి చంపించినట్లు తెలుస్తోంది. 

  • పోలీసుల అదుపులో నిందితులు ...? 

హత్య కేసులో ప్రధాన సూత్రదారిగా అనుమానం వ్యక్తం చేస్తున్న సులోచన కూతూరు తేజశ్రీ, మామ కుమ్మెర కృష్ణరెడ్డి దంపతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. అనుమానం కలిగిన మరికొందరిని నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు.  తేజశ్రీతో పాటు ఆమె భర్త అరునేందర్​రెడ్డిని కూడా విచారిస్తున్నారు. ఈ హత్యకు గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తి సుపారీ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిగా భావిస్తున్న కరీంనగర్ ఆదర్శనగర్ కు చెందిన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం వీరి అరెస్ట్​ను చూపే అవకాశాలున్నాయి. 

ఫ్లైయాష్​బ్రిక్స్ ఇండస్ట్రీని ఆదుకోవాలి

జ్యోతినగర్,వెలుగు: రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉచితంగా బూడిద సరఫరా చేసి ఫ్లైయాష్​బ్రిక్స్​ఇండస్ట్రీని ఆదుకోవాలని ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ ఫ్లైయాష్ బ్రిక్స్ యజమానుల సంఘం అధ్యక్షుడు బెంద్రం రాజీ రెడ్డి డిమాండ్​చేశారు. శనివారం బ్రిక్స్ ఇండస్ట్రీ యజమానులు ఎన్టీపీసీ ప్రాజెక్ట్ లెబర్ గేట్ ముందు నిరసన తెలిపి, రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రాజీరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు అధిక ధరలతో బూడిద టెండర్ దక్కించుకోవడం వల్ల తాము నష్టపోతున్నామని ఆ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం స్పందించి బ్రిక్ ఇండస్ట్రీని ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో బ్రిక్స్​తయారీదారులు హరీశ్, వీరస్వామి, శ్రీకాంత్, రాజన్న, రాంరెడ్డి, శంకర్, ఓదెలు, నర్సయ్య పాల్గొన్నారు.

తెలంగాణలోనే రైతుబంధు, బీమా 

జగిత్యాల, వెలుగు: రైతు బంధు, రైతు బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం కోలవాయిలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 2777 మంది రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎలాంటి పైరవీ లేకుండా రైతు బీమా అందిందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్​లో భాగంగా దేశంలోని 750 జిల్లాల్లో జగిత్యాలకు రెండో స్థానం రావడం సీఎం పాలనాదక్షతకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ రాంచందర్ రావు, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు రమణ, పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్, సర్పంచ్ లు యేసుదాసు పాల్గొన్నారు. 

ఆడబిడ్డలకు భరోసా కల్యాణలక్ష్మి
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 

బోయినిపల్లి, వెలుగు: కల్యాణలక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. శనివారం బోయినిపల్లి మండలంలోని పలుగ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి  పెద్దపీట వేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కత్తెరపాక ఉమ, సర్పంచ్​లు, ఎంపీటీసీలు, లీడర్లు పాల్గొన్నారు. అనంతరం గంగాధర మోడల్ స్కూల్​లో ఇంటర్ ఫస్టియర్​లో టాపర్​గా నిలిచిన అక్షరతో కలిసి ఆమె తల్లిదండ్రులు నడిపిస్తున్న టిఫిన్​సెంటర్​లో ఎమ్మెల్యే బ్రేక్​ఫాస్ట్​చేశారు. సర్పంచ్​ లావణ్య-, పీఏసీఎస్​ వైస్​ చైర్మన్​ భాస్కర్​, ఏఎంసీ వైస్​ చైర్మన్​ శ్రీనివాస్​, పాల్గొన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి 

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, జర్నలిస్టుల సంక్షేమానికి కృషిచేయాలని అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు కట్కూరి మల్లేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరేల్లి మల్లేశ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ను​ కోరారు. బూరుగుపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఉదయ్ కుమార్,  రామ్మూర్తి  పాల్గొన్నారు.

మూడేండ్లుగా పూర్తికాని లైబ్రరీ బిల్డింగ్ 
నిధులు లేక  ఆగిన నిర్మాణ పనులు

మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి డివిజన్ కేంద్రంలో రీడర్స్ కు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న  లైబ్రరీ కొత్త బిల్డింగ్​ పనులు నిధుల్లేక మధ్యలోనే ఆగిపోయాయి. పట్టణంలో ఉన్న ఏకైక లైబ్రరీ శిథిలావస్థకు చేరడంతో ఐదేండ్ల కింద పాత బిల్డింగ్ ను కూల్చేశారు. కొత్త బిల్డింగ్ నిర్మాణానికి 2019 లో  టీయూఎఫ్‌ఐడీసీ నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పనులను ప్రారంభించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి స్లాబ్​వేసి వదిలేశారు. నిధులు లేకపోవడంతో ఏడాదిగా పనులు నిలిచిపోయాయి. దీంతో కాంపిటేటివ్​ఎగ్జామ్స్​కు ప్రిపేర్​అవుతున్న ఉద్యోగార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలికంగా పాత మండల పరిషత్ ఆఫీస్ లో ఇరుకైన గదిలో లైబ్రరీ నడిపిస్తున్నారు. ఆ బిల్డింగ్​కూడా శిథిలావస్థకు చేరడం, ఇరుగ్గా ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ విషయమై బల్దియా ఏఈ అరుణ్ కుమార్ ను వివరణ కోరగా బిల్డింగ్ నిర్మాణానికి మంజూరైన నిధుల మేరకు పనులు పూర్తయ్యాయన్నారు. కొన్ని రోజుల క్రితం రూ. 60 లక్షలు మంజూరు  అయ్యాయని తొందరలోనే టెండర్లు నిర్వహించి బిల్డింగ్ పనులు ప్రారంభిస్తామన్నారు.

మోడీ పాలనలో దేశ ఖ్యాతి పెరిగింది
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కళ్యాణ్ చంద్ర  

కరీంనగర్ సిటీ, వెలుగు: మోడీ పాలనలో ప్రపంచవ్యాప్తంగా దేశ ఖ్యాతి పెరుగుతోందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొంతల  కళ్యాణ్ చంద్ర అన్నారు.  శనివారం కరీంనగర్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ  మోడీ పాలనపై మంత్రి కేటీఆర్ చులకన భావంతో వ్యాఖ్యలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు.  దేశాన్ని విశ్వగురుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ ఎనిమిదేళ్లుగా నిర్విరామంగా అహర్నిశలు  కృషి చేస్తున్నారన్నారు. పార్టీ పేరు మార్చగానే జాతీయ నాయకులు కాలేరని, నోరు ఉంది కదా అని అడ్డూఅదుపు లేకుండా సరికాదన్నారు. 

బీజేపీకి బీఆర్ఎస్​ పోటీ కానేకాదు

జగిత్యాల, వెలుగు:  రంగు మార్చినంతా మాత్రాన ఊసరవెల్లి మారదని, బీఆర్ఎస్ ఎప్పటికీ బీజేపీకి పోటీ కాదని బీజేపీ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ అన్నారు. శనివారం ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ, తెరాసను బీఆర్ఎస్ గా మార్చి బీజేపీకి దేశంలో పోటీగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఠాకూర్ పవన్ సింగ్, గోలి మల్లారెడ్డి, దివాకర్, రమణ, జున్ను రాజేందర్ పాల్గొన్నారు. 


ఎంపీపీపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్యలకు డిమాండ్​ 

మెట్ పల్లి, వెలుగు : దళిత మహిళా ఎంపీపీపై భౌతికంగా దాడి చేసిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్  డిమాండ్ చేశారు. శనివారం మెట్ పల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దళిత వర్గాలను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.  యాచారం గ్రామంలో విజయదశమి ఉత్సవాలకు హాజరైన ఎంపీపీ సుకన్య నాయకత్వాన్ని జీర్ణించుకోని ఎమ్మెల్యే ఆమెపై  భౌతిక దాడులు చేసి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బొల్లె నరేందర్,  అశోక్, రణధీర్ పాల్గొన్నారు.గొల్లపల్లి, వెలుగు: దళిత బిడ్డ, ఎంపీపీ  కొప్పు సుకన్యపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే  మంచిరెడ్డి  కిషన్​రెడ్డి పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి బరిగేలా భూమయ్య డిమాండ్ చేశారు. శనివారం గొల్లపల్లిలో మీడియాతో మాట్లాడారు.