జన్నారం, వెలుగు: బదిలీ జరిగి రిలీవ్ కాని టీచర్లను వెంటనే రిలీవ్ చేయాలని ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ జాడి రాజన్న డిమాండ్ చేశారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించి పదోన్నతులకు ఆవకాశం కల్పించడమే కాకుండా జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేసి సొంత జిల్లాలకు పంపించాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేండ్లలో విద్యారంగం పూర్తిగా నిర్లక్షానికి గురైందన్నారు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగం పటిష్టతపై దృష్టి పెట్టాలని కోరారు. కేజీ నుంచి పదో తరగతి వరకు అన్ని వసతులు కల్పించి మండలానికొక ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బదావత్ ప్రకాశ్ నాయక్, జిల్లా బాధ్యులు వినోద్ పాల్గొన్నారు.