![గ్రూప్-2, 3 నోటిఫికేషన్లు నెలాఖరులో?](https://static.v6velugu.com/uploads/2022/09/Telangana-State-Public-Service-Commission-has-started-the-exercise-for-filling-Group-2-and-Group-3-posts_4giueO05am.jpg)
ఏర్పాట్లు చేస్తున్న టీఎస్పీఎస్సీ
హైదరాబాద్, వెలుగు : గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్నది. ఇందుకోసం డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలతో సమావేశాలు నిర్వహిస్తున్నది. మూడురోజుల కింద గ్రూప్2, గ్రూప్ 3 పోస్టులతో పాటు మరో 9 డిపార్ట్మెంట్లకు చెందిన 2,910 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంట్లో గ్రూప్2 పోస్టులు గతంలో సర్కారు ప్రకటించిన సంఖ్యతో పోలిస్తే పెరిగాయి. గతంలో 582 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా 663 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది. మరోపక్క గ్రూప్ 3 పోస్టులు 1,373 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది. జనవరిలో రాతపరీక్షలు నిర్వహించే అవకాశముంది. గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్ బి. జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో అగ్రికల్చర్, హౌసింగ్, సీడ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్, ఫిషరీస్, టెక్నికల్ అండ్ కాలేజేట్ ఎడ్యుకేషన్, వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ తదితర డిపార్ట్మెంట్ల ప్రతినిధులతో కమిషన్ అధికారులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సర్వీస్ రూల్స్, అమైన్మెంట్స్, క్యారీ ఫార్వర్డ్ వెకెన్సీలు, క్వాలిఫికేషన్లు, రోస్టర్ తదితర అంశాలపై చర్చించారు. శుక్ర, శనివారాలు కూడా గ్రూప్ 2, 3 పోస్టుల్లోని వివిధ డిపార్ట్ మెంట్ల అధికారులతో చర్చించనున్నారు. వారంలోపు వారి నుంచి మరోసారి వివరాలను సేకరించనున్నారు. దాంట్లోనూ ఏమైనా తప్పులుంటే, సరిచేసేందుకు అవకాశమిస్తారు. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఫైనల్ ఇండెంట్ వచ్చిన వారంలోపే నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఈ లెక్కన ఈనెలాఖరులోపు గ్రూప్ 2 నోటిఫికేషన్, దాని తర్వాత వారం, పదిరోజుల్లోపే గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు పేర్కొంటున్నారు.