![93 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ : మంత్రి శ్రీధర్ బాబు](https://static.v6velugu.com/uploads/2025/02/telangana-state-to-provide-internet-connectivity-to-93-lakh-homes-says-minister-sridhar-babu_K97Lyi2elv.jpg)
- 93 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్..మూడేండ్లలో అన్ని గ్రామాలకూ విస్తరిస్తం : మంత్రి శ్రీధర్ బాబు
- ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 93 లక్షల ఇండ్లకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. టీ ఫైబర్ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. బుధవారం సెక్రటేరియెట్లో శ్రీధర్ బాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆ బృందానికి డిజిటలైజేషన్ గురించి మంత్రి వివరించారు. దాంతో పాటు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రారంభించిన నాలుగు గ్రామాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇటీవల సందర్శించారు. దాని గురించి మంత్రికి వారు వివరించారు.
రంగారెడ్డి జిల్లా హాజిపల్లి, నారాయణపేట జిల్లా మద్దూరు, సంగారెడ్డి జిల్లా సంగుపేట, పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్ గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యంతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వైజయంతీ దేశాయ్, కింబర్లీ జాన్స్ వెల్లడించారు. మూడేండ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటికే 32 వేల కిలోమీటర్ల పొడవున ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వేశామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇషిరా మెహతా, అరుణ్ శర్మ, స్యూ సంజ్ ఎంగ్ పాల్గొన్నారు.