పార్కింగ్‌‌‌‌‌‌‌‌ జాగా ఉంటేనే కారు... కొత్త రూల్ తెచ్చేందుకు రవాణా శాఖ ప్లాన్..

  • కొత్త నిబంధనను అమలు చేసేందుకు రాష్ట్ర రవాణా శాఖ కసరత్తు
  • గ్రేటర్ పరిధిలో చాలా చోట్ల రోడ్లపైనే కార్ల పార్కింగ్ 
  • నిత్యం ట్రాఫిక్ సమస్యలు.. పార్కింగ్‌‌‌‌‌‌‌‌పై రోజూ ఏదో ఒక చోట గొడవలు 
  • ఈ అంశంపై స్టడీ చేసేందుకు ముంబైకి వెళ్లనున్న స్టేట్‌‌‌‌‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టు టీం

హైదరాబాద్, వెలుగు: ఇంటి వద్ద పార్కింగ్‌‌‌‌‌‌‌‌ స్థలం ఉంటేనే కారు కొనేందుకు అనుమతిచ్చే అంశంపై రాష్ట్ర రవాణా శాఖ దృష్టి పెట్టింది. ప్రస్తుతం మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం ఈ విధానాన్ని త్వరలో అమలు చేయనున్నందున.. దీనిపై స్టడీ చేసేందుకు మన రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టు అధికారుల బృందాన్ని అక్కడికి పంపించి అధ్యయనం చేయడంపై కసరత్తు చేస్తున్నారు.

ఈ విధానం వల్ల అక్రమ పార్కింగ్‌‌‌‌‌‌‌‌కు చెక్ పెట్టేందుకు వీలు కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే, గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వంటి సిటీలో రోడ్లకు ఇరువైపుల కార్లను నిలుపుతున్న వారిపైనా కొరడా ఝుళిపించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతున్నది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌తో పాటు పలు జిల్లా కేంద్రాల్లో కార్లను ఇండ్లల్లో పార్కింగ్ చేసేందుకు జాగా లేకపోవడంతో రోడ్లపైనే నిలుపుతున్నారు.

దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతున్నది. పలు చోట్ల అక్రమ పార్కింగ్‌‌‌‌‌‌‌‌పై గొడవలు జరగడం, ఆ గొడవలు పెద్దవై పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్ వరకు వెళ్తున్నాయి. కారు పార్కింగ్‌‌‌‌‌‌‌‌కు స్థలం లేకపోయినా.. వాటిని కొనడం, రోడ్లపై పార్కింగ్ చేస్తుండటంతో గ్రేటర్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతోంది. 

పార్కింగ్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంట్లు ఉండాల్సిందే..

కారు కొనుగోలు చేసే వారు పార్కింగ్ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను చూపిస్తేనే కారు కొనుగోలుకు అనుమతి ఇచ్చే విషయంపై రవాణా శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఈ విషయంలో కార్ల షో రూమ్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులకు కూడా అవగాహన కల్పించే అంశంపై చర్చిస్తున్నారు. అదే సమయంలో పార్కింగ్ స్థలం ఉన్నట్టు సరైన ధ్రువీకరణ పత్రం ఉంటేనే కారు రిజిస్ట్రేషన్ చేయడంపైనా ఆలోచన చేస్తున్నారు. ఇది అమలైతే గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అక్రమ పార్కింగ్ బాధ తప్పినట్లేనని సిటీ జనం అంటున్నారు.

ఇప్పటికే ఎలక్ట్రానిక్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌కు లైఫ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీల మినహాయింపులు, 15 ఏండ్లు దాటిన వెహికల్స్‌‌‌‌‌‌‌‌కు సరికొత్త స్క్రాప్ పాలసీని తీసుకువచ్చి పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చాలని రాష్ట్ర రవాణా శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పార్కింగ్‌‌‌‌‌‌‌‌కు జాగా ఉంటేనే కారు కొనేందుకు అనుమతి అనే పాలసీని తీసుకొస్తే పార్కింగ్‌‌‌‌‌‌‌‌ సమస్య కూడా తీరుతుందని జనం అంటున్నారు.