తెలంగాణ ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ గుండెపోటుతో మృతి

తెలంగాణ ప్రముఖ గాయకుడు సాయిచంద్‌ గుండెపోటుతో మృతి

హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వీ. సాయిచంద్‌ హఠాన్మరణం చెందారు. 39 ఏండ్ల సాయిచంద్‌..బుధవారం (జూన్ 28న)  సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

1984 సెప్టెంబర్‌ 20న వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్‌ జన్మించారు. పీజీ వరకు చదువుకున్న ఆయన.. విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆట పాటలతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిచిలించారు. 2021, డిసెంబర్‌లో సాయిచంద్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. అదే నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించారు.