సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకోవడం ప్రజాస్వామిక నియమాలకే విరుద్ధం. చట్టాలు, రాజ్యాంగం, ప్రజాస్వామిక విలువలను కేసీఆర్ బేఖాతరు చేస్తున్నారు. దీని ఫలితంగా సమిష్టి ప్రయోజనాలు అటకెక్కాయి. స్వార్థ ప్రయోజనాలే రాజ్యమేలుతున్నాయి. ఉద్యమ ఆకాంక్షలు పక్కన బెట్టి ఒక కుటుంబం తన ఆస్తుల పెంపుకోసం అధికారాన్ని ఉపయోగించుకోవడం మొదలు పెట్టింది. ప్రజల త్యాగాలు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం ప్రగతి భవన్ లో బందీ అయింది. ఇలాంటి పాలనే ఇవాళ రాష్ట్రాభివృద్ధికి ఆటంకంగా మారింది.
ప్రజల సమస్యలను సకాలంలో, సమర్థవంతంగా పరిష్కరించి వారికి మెరుగైన జీవితాన్ని అందించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యింది. యాసంగి ధాన్యం కొనుగోలుకు కావలసిన కనీస ఏర్పాట్లు కూడా ఈ సర్కార్ చేయలేకపోయింది. వర్షం వస్తే వడ్లు తడవకుండా కాపాడటానికి అవసరమైన టార్పాలిన్లు కొనుగోలు కేంద్రాల్లో లేవు. తూకం వేసిన సంచులను లారీల్లో నింపడానికి హమాలీలు లేరు. వడ్ల సంచులను మిల్లులకు తీసుకు వెళ్లడానికి సరిపోను లారీలు లేవు. అన్నిటికన్నా మించి వడ్లు బాగానే ఉన్నాయని అధికారులు నిర్థారించినా మిల్లర్లు తరుగు తీస్తున్నారు. ఇవేమీ పట్టని అధికారులు రైతులను మిల్లర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నారు.
కార్పొరేట్ దోపిడీ నుంచి ప్రజలకు రక్షణ లేదు
కరోనా విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం అంతే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నది. టెస్టులు ఎక్కడ చేస్తరో తెలియదు. అడ్రస్ తెలుసుకొని టెస్టింగ్ సెంటర్‌కు వెళ్లినా అందరికీ టెస్టులు చేయడం లేదు. చివరికి టెస్టు చేసేసరికి రోగం ముదిరిపోయి ప్రాణాంతకంగా మారుతున్నది. ప్రభుత్వ నియంత్రణలో కరోనా ట్రీట్మెంట్ లేదు. 70 శాతం బెడ్లు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉన్నాయి. ఆ కార్పొరేట్ దవాఖానాలు అడ్డగోలుగా దోచుకుంటున్నా.. ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. అడిగినా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవడం చూస్తుంటే కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ నుంచి ప్రజలను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదనే విషయం స్పష్టమవుతున్నది.
ప్రజాస్వామిక విలువలు పాటిస్తలేరు
పైన పేర్కొన్న సమస్యలను వ్యక్తిగతంగా ఎవరికి వారు పరిష్కరించుకోలేరు. అవి సామాజిక సమస్యలే. ప్రభుత్వం పూనుకుంటే తప్ప అవి పరిష్కారం కావు. మన రాష్ట్రమే కాదు చాలా రాష్ట్రాలు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ ఇబ్బందులను అధిగమించడానికి చాలా రాష్ట్రాలు మన ప్రభుత్వం కన్నా మెరుగైన పాలనాదక్షతను ప్రదర్శించాయి. పాలనలోని వ్యత్యాసాలను నాయకుల వ్యక్తిగత స్వభావానికి ఆపాదించలేం. ప్రభుత్వ పాలనా స్వభావం అధికార పార్టీల రాజకీయ దృక్పథంపైనా, వారు ఎంచుకునే ప్రాధాన్యతలను బట్టి నిర్ణయమవుతుంది. మన రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలను, రాజ్యాంగ సూత్రాలను వీసమెత్తు కూడా పాటించడం లేదు. రాష్ట్రంలో నెలకొన్న పాలనా పరిస్థితులకు కింది లక్షణాలే కారణాలుగా కనిపిస్తున్నాయి.
ప్రగతిభవన్ ఒక గడీ.. కేసీఆర్ ఒక దొర
అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం ప్రాపకం ఉన్నంత వరకే తమ స్థానంలో ఉంటారు. అందరి ఫోన్లు నిరంతరం టాప్ అవుతుంటాయి. కాబట్టి కలలో కుడా సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడటానికి కాదు కదా.. కనీసం ఆలోచించడానికి కూడా సాహసించరు. ఈటల బర్తరఫ్ కూడా ఈ నేపథ్యంలో జరిగిందే. సీఎం దృష్టిలో సొంత అస్థిత్వం ఉండటం పెద్ద నేరం. ఆ కారణంతోనే ఈటలను బర్తరఫ్ చేశారు. సీఎం నివాసం ప్రగతి భవన్ ప్రభుత్వ కార్యకలాపాలకు కేంద్రమైనా అక్కడ ఎవ్వరికీ ప్రవేశం లేదు. సీఎం పిలుపు అందితే తప్ప మంత్రులు కుడా లోపలికి వెళ్లలేరు. సూటిగా చెప్పాలంటే ప్రగతిభవన్ ఒక గడీ. కేసీఆర్ దొర అక్కడ కూర్చొని రాచరిక పాలన నడిపిస్తున్నారు. ఈ గడీలోనికి సులువుగా ప్రవేశించగలిగేది ఆంధ్రా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులే. ఇవాళ తెలంగాణలో కాంట్రాక్టులు వారివే, కాలేజీలు వారివే. సీఎం వ్యక్తిగత ప్రాధాన్యతలను బట్టి ప్రతిసారి ఏదో ఒక విషయం మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది. మిగతా అన్ని రంగాల్లో పాలన నిలిచిపోతుంది. దీంతో సమస్యల పరిష్కారం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి ప్రజలు విసిగిపోతున్నారు.
ప్రజలు గొంతు వినిపించే అవకాశం లేదు
నిరసనకు వేదికైన ధర్నాచౌక్‌ను మూసివేసారు. అఖిలపక్ష ఆందోళనల తర్వాత కూడా ప్రభుత్వ వైఖరి మారలేదు. కోర్టు జోక్యంతోనే చివరకు ధర్నాచౌక్ ప్రజలపరమైంది. అయినా తరచు పోలీసులు ధర్నాలకు అనుమతులు నిరాకరిస్తున్నారు. ఈ పరిణామాలతో రాజకీయ ప్రక్రియ గాడి తప్పింది. పబ్లిక్ సమస్యల మీద బహిరంగంగా చర్చ జరిపి పరిష్కారాలను వెతికే ప్రయత్నమే రాజకీయం. ఈ మొత్తం కార్యకలాపాల్లో ఎన్నికలు ఒక భాగమే కాని సర్వస్వం కాదు. విధాన తయారీలో, పాలనా వ్యవహారాలపై ప్రజల గొంతు వినిపించడానికి అవకాశాలు ఎంత ఎక్కువగా ఉంటే ప్రజాస్వామ్యం అంత ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. మారిన పరిస్థితిలో అటువంటి చర్చకు వేదికలూ లేవు, అనువైన వాతావరణం కనిపించడం లేదు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాను ప్రకటనల ఎర చూపి నియంత్రిస్తుండటంతో ప్రజాస్వామిక చర్చకు అవి వేదికలుగా నిలబడలేకపోతున్నాయి. ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ అనుసరిస్తున్న మార్గం ఏమిటంటే ఎలక్షన్ మేనేజ్‌మెంట్, మీడియా మేనేజ్‌మెంట్, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల మేనేజ్‌మెంట్. అందుకోసం సమిష్టి వనరులను కొల్లగొట్టడం, వచ్చిన సొమ్ముతోనే అన్ని వివరించిన వ్యవహారాలను నడపడం చేస్తున్నారు.
రాజకీయాలు-ఆర్థిక రంగం అక్రమ బంధం
కేసీఆర్ పాలనలో రాజకీయాలు, ఆర్థిక రంగం పెనవేసుకొనిపోయాయి. ప్రజలు ఓట్ల ద్వారా ఇచ్చిన అధికారాన్ని సమిష్టి వనరులను కొల్లగొట్టడానికి వాడుకోవడం ఇప్పుడు విచ్చలవిడిగా సాగుతున్నది. ఈ దోపిడీపై ఏ అదుపూ లేదు. అధికార యంత్రాంగంపై చట్టబద్ధమైన నియంత్రణ ఏదీ పని చేయడం లేదు. నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు ఒక్కటై వ్యాపారాలు దక్కించుకుంటున్నారు. ఔట్ సోర్సింగ్ లేబర్ కాంట్రాక్టులు చేజిక్కించుకోవడానికి, భూముల సెటిల్మెంట్లకు, ఇసుక పర్మిట్ల సాధనకు, సివిల్ కాంట్రాక్టులు పొందడానికి, కంపెనీలకు స్థలం మంజూరు కోసం వ్యాపార దక్షత కన్నా అధికారంలో ఉన్న నాయకులతో పరిచయమే కీలకంగా మారింది. నాలుగేండ్ల కిందటి నేరెళ్ల ఘటన ఆర్థిక, రాజకీయ రంగాలు ఎంతగా పెనవేసుకునిపోయాయో తెలియజేసింది. ఇసుక లారీలు ఓవర్ లోడుతో మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామస్తులు నిరసన తెలిపినందుకు వారిని కొట్టి చిత్రహింసలు పెట్టారు. అధికారాన్ని నిస్సిగ్గుగా ఆర్థిక ప్రయోజనాల రక్షణకు వాడుకుంటున్నారు. అధికారానికి, వ్యాపార కార్యకలాపాలకు మధ్య సంబంధం కారణంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న తపన బలంగా ఉంటోంది. గతంలో ఒక సిద్ధాంతం ఆచరణ కోసమో, ఒక విధానం అమలు కోసమో అధికారాన్ని కోరుకునేవారు.
అధికారం ఒక ఆస్తిగా మారింది
యువత బలిదానాల పునాదిపై తెలంగాణ ఏర్పడింది కనుక ఉద్యమ ఆకాంక్షల సాధన ప్రభుత్వానికి ఒక లక్ష్యంగా ఉండాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని మరిచిపోయింది. డబ్బు సంపాదనకు అధికారం కీలక సాధనంగా మారిన తరుణంలో అధికారం పోవడమంటే ఆస్తి పోయినట్టే. సంపాదించడానికి చేసిన తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడానికి అధికారాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టే ప్రజాస్వామ్యాన్ని ఓట్ల కొనుగోలు కార్యక్రమంగా మార్చక తప్పని పరిస్థితి వచ్చింది. అధికారాన్ని పాలకులు సొంత ప్రయోజనాల కొరకు ఉపయోగించినప్పుడు, అధికారాన్ని ఆస్తులను పోగేసుకోవడానికి వాడినప్పుడు సమాజ ప్రయోజనాలు మరుగున పడిపోతాయి. ఇవాళ తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వమే ఆటంకం. ఈ పాలన మారకుండా, రాజ్యాంగ బద్దమైన పాలన రాకుండా తెలంగాణ పురోభివృద్ధి సాధ్యం కాదు. ప్రజాస్వామిక పాలన మాత్రమే మనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వగలదు. ఈ దిశగా తెలంగాణ సమాజం ఆలోచించాలి. బతుకులు మార్చుకోవాలి.
ఈటల విషయంలో అధికారగణం బిజీబిజీ
రాష్ట్రంలో సాఫీగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం సర్కారు విధానాలతో అతలాకుతలమైంది. అటు విద్యను, ఇటు ఉపాధిని కల్పించే ప్రైవేట్ విద్యా సంస్థలు కరోనా తాకిడికి కూలిపోతున్నా వాటిని బతికించడానికి ఏమీ చేయలేదు. ఉద్యోగాలు, ఉపాధి దొరక్క నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా నిలువరించడానికి ప్రభుత్వం వైపు నుంచి సరైన కార్యాచరణ లేదు. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్న కరోనా మహమ్మారి ముంచుకొస్తుంటే ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ను సరైన కారణాలు లేకున్నా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి అనవసరమైన రాజకీయ సంక్షోభాన్ని సృష్టించారు. ప్రజల సమస్యలు గాలికి ఒదిలేసిన ముఖ్యమంత్రి సహా అధికారగణం ఈటల విషయంలో బిజీ అయిపోయారు.
ఏక వ్యక్తి పాలన
ఇవాళ తెలంగాణలో ఒక వ్యక్తి తన కుటుంబం సహాయంతో పాలన నడుపుతున్నారు. ఇందులో ఏ వ్యవస్థకూ పాత్ర లేదు. సెక్రటేరియట్ అనే వ్యవస్థ కుప్పకూలిపోయింది. సీఎం సెక్రటేరియట్‌కు వెళ్లకుండా తన ఇంటి నుంచే పాలన చేస్తుంటే ఇక సెక్రటేరియట్‌కు ప్రాధాన్యత ఎట్ల వస్తుంది? సంబంధిత మంత్రి లేకుండానే వివిధ శాఖల సమీక్షలను సీఎం నిర్వహిస్తున్నారంటే మంత్రుల స్థానం ఏమిటో తెలుస్తూనే ఉన్నది. వారికి కనీస సమాచారం కూడా ఉండదు. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార కేంద్రీకరణ ఎక్కువైంది. మొదటి దఫాలో మంత్రులు, సెక్రెటరీలకు అప్పుడో ఇప్పుడో సీఎంతో మాట్లాడే అవకాశం దొరికేది. ఇప్పుడు అదీ లేదు. సీఎం ఇచ్చే ఫర్మానాల ప్రకారం ప్రభుత్వ కార్యకలాపాలు సాగుతుంటాయి.
నిరంకుశ పాలన
మనం ఇది వరకు చూడని పాలనా సంస్కృతి తెలంగాణలో నడుస్తున్నది. అధికార యంత్రాంగాన్ని పాలకుల ఇష్టానుసారం, వారి ప్రయోజనాల కోసం ఉపయోగించే పద్ధతి బలపడిపోయింది. ఎన్నికల్లో తప్ప మరే ఇతర సందర్భాల్లోనూ పాలనలో ప్రజలకు భాగస్వామ్యం లేదు. ఎక్కడైనా కొంచెం చైతన్యం కనబరిస్తే ప్రజల భాగస్వామ్యాన్ని నిలువరించడానికి చేయని ప్రయత్నం ఉండటం లేదు. ఏ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా అనుమతులు ఇవ్వడం లేదు. కార్యకర్తలను సెక్షన్ 151 ఉపయోగించి రాత్రుళ్లు ఇంటి వద్దనే అరెస్టు చేస్తున్నారు. సెక్షన్ 30, సెక్షన్ 144 నిబంధనలను విరివిగా ప్రయోగిస్తున్నారు. పార్టీలకే కాదు సాధారణ ప్రజలకు కూడా న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధనకు అనుమతులు నిరాకరిస్తున్నారు.
- ప్రొఫెసర్ కోదండరాం,
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు