రూ.25వేలతో ఊరంతా నాన్​వెజ్​ పెట్టాలట!

  •     చెరువుల పండుగకు సర్కార్​ అరకొర నిధులు 
  •    చిన్నా పెద్దా అన్ని గ్రామాలకు ఇదే అమౌంట్ ఇచ్చిన సర్కార్​
  •    అన్ని ఖర్చులకు ఈ డబ్బు ఎలా సరిపోతదంటున్న సర్పంచులు
  •    అభివృద్ధి పనులకే నిధులు రాక అప్పులపాలయ్యామంటూ లబోదిబో

కరీంనగర్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల్లో భాగంగా 8న నిర్వహించనున్న చెరువుల పండుగకు ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ జనాభాతో సంబంధం లేకుండా అన్ని ఊర్లకు రూ.25 వేలే రిలీజ్ చేయడం, పైగా గ్రామస్తులందరికీ నాన్ వెజ్ తో భోజనాలు పెట్టాలని ఆదేశించడంతో సర్పంచులకు పండుగ ఖర్చుకు భయపడుతున్నారు. ఈ పైసలతోనే బోనాలు, బతుకమ్మలు, డప్పు చప్పుళ్లు, లైటింగ్‌‌, మైకులు, టెంట్లు ఏర్పాటు చేయాలనడంపై మేజర్ జీపీలు సర్పంచులు, సెక్రటరీలు మండిపడుతున్నారు.  ఇప్పటికే పంచాయతీల్లో అభివృద్ధి పనులకు  అప్పులు చేశామని, సంబురాల కోసం ఎక్కడ తెచ్చి ఖర్చుచేయాలని ప్రశ్నిస్తున్నారు. 

చేయాల్సిన ఏర్పాట్లు ఇవే.. 

చెరువు పండుగలో భాగంగా గ్రామస్తులందరికీ నాన్‌‌వెజ్‌‌తో భోజనం పెట్టాలని అధికారులు ఆదేశించారు. మెనూలో వైట్ రైస్, చికెన్ కర్రీ, పాపడ్, చట్నీ, బీరకాయ, ఆల్చింతకాయ కర్రీ  లేదా ఏదైనా వెజిటబుల్ కర్రీ, సాంబార్, పెరుగు ఉండాలి. ఇవి వండేందుకు సామగ్రి, వంట మనుషులను మాట్లాడుకోవాలి. అలాగే పండుగ నిర్వహించే చెరువు వద్ద వేదికతోపాటు భోజనం చేసే స్థలాన్ని చదును చేసి, టెంట్లు, కుర్చీలు, మైక్ ఏర్పాటు చేయాలి. వేదికకు వెళ్లే దారిలో లైటింగ్ ఏర్పాటు చేయాలి. కట్టపై ముగ్గులు వేసి మామిడి తోరణాలతో అలంకరించాలి. గజ ఈతగాళ్లను, వాలంటీర్లను చెరువు దగ్గర ఉంచాలి. 5 జతల డప్పులు ఉండేలా చూడాలి. కట్ట మైసమ్మ పూజారి, పూజాసామగ్రిని సిద్ధం చేయాలి. గ్రామ ప్రగతి నివేదికపై కరపత్రాలు, ఫ్లెక్సీలు ప్రింట్ చేయించాలి. ఇవన్నీ పంచాయతీ సర్పంచ్, సెక్రటరీలు సమకూర్చాలి. వీవోఏలు, ఐకేపీ సీసీలు మహిళలతో మాట్లాడి కనీసం 10 మంది చొప్పున బోనాలు, 
బతుకమ్మలు తీసుకురావాలి. 

చిన్నాపెద్దా తేడాల్లేవ్.. 

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని అతి చిన్న గ్రామమైన కోనేరుపల్లిలో 436 మంది జనాభా ఉంది. ఈ గ్రామంలో చెరువు పండుగ నిర్వహణకు ప్రభుత్వం రూ.25 వేలు మంజూరు చేసింది. గ్రామంలో సగం మంది వచ్చినా భోజనాలు, టెంట్, కుర్చీలు, డప్పులు, లైటింగ్ కు కిరాయిలు సరిపోయేలా లేవు. చికెన్ కిలో సుమారుగా రూ.250 ఉంది. ఇంత రేటుతో నాన్ వెజ్ భోజనం ఎలా పెట్టాలని  సర్పంచులు, సెక్రటరీలు తలలుపట్టుకుంటున్నారు.  చిన్నగ్రామాల సర్పంచులే డబ్బులు సరిపోవని భయపడుతుంటే  నాలుగైదు వేల జనాభా ఉన్న మేజర్ జీపీల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నాన్ వెజ్ తో భోజనాలంటే తక్కువలో తక్కువ వెయ్యి మంది అయినా వచ్చినా.. భోజనాలకు రూ.లక్ష అయినా సరిపోవని, రూ.25 వేలు ఎలా సరిపోతాయని సర్పంచులు, సెక్రటరీలు ప్రశ్నిస్తున్నారు.  భోజనం తక్కువ పడితే తమపై విమర్శలు వస్తాయని వారు వాపోతున్నారు. ఇప్పటికే బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే ఇంకా సంబురాల కోసం ఎక్కడి నుంచి అప్పులు తెచ్చి పెట్టాలని ప్రశ్నిస్తున్నారు.