- కేంద్ర కేబినెట్ నిర్ణయం,దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో
- 28 కొత్త నవోదయల ఏర్పాటు,85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకూ ఆమోదం
న్యూఢిల్లీ, వెలుగు:రాష్ట్రానికి ఏడు నవోదయ స్కూళ్లను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఇందులో ఏడు రాష్ట్రాల్లో 28 కొత్త నవోదయ స్కూళ్లతో పాటు 19 రాష్ట్రాల్లో 85 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తెలంగాణకు కేటాయించిన 7 నవోదయ స్కూళ్లను జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్నారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎనిమిది, అస్సాంలో ఆరు, మణిపూర్‌లో మూడు, పశ్చిమ బెంగాల్ లో రెండు, కర్నాటక, మహారాష్ట్రలో ఒక్కోటి చొప్పున నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కూళ్ల ఏర్పాటుకు 2024 నుంచి 2029 మధ్య రూ.2,359.82 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు 2025-–26 నుంచి ఎనిమిదేండ్లలో రూ. 5,872.08 కోట్లు ఖర్చు చేస్తారు. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఢిల్లీ మెట్రో నాలుగో విడత ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రిథాలా నుంచి కుండ్లీ వరకు 26 కిలో మీటర్ల మేర ఈ మెట్రో ప్రాజెక్టును విస్తరిస్తారు. దేశ రాజధాని, పొరుగన ఉన్న హర్యానా మధ్య కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.