విద్య, వైద్యం, రవాణా రంగాల్లోముందడుగు

విద్య, వైద్యం, రవాణా రంగాల్లోముందడుగు

 ఏ సమాజ సమగ్ర పురోగమనానికైనా విద్య, వైద్యం, రవాణా ఈ మూడే ప్రామాణికాలు. నాగరికత వెల్లివిరిసేందుకు సోపానాలు. సమానత్వానికి చిహ్నాలు. బీదలు, నిరుపేదలు, మధ్య, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు పెను భారాలైన ఆ మూడింటిని ఎంత మెరుగ్గా అందుబాటులోకి తెస్తే అంతలా సమసమాజ స్థాపన కనుచూపు మేరలోకి వస్తుంది. తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. 

 తొలిసారి కాంగ్రెస్ సర్కారు వస్తూ వస్తూనే మహిళలకు ఉచిత రవాణా సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. తద్వారా రవాణాపరంగా తెలంగాణలో  సరికొత్త అధ్యాయానికి గర్వకారణమైంది. వైద్యం మీద నజర్ పెడుతోంది. తాజాగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియను అనుభవంలోకి తెచ్చింది.ఈ విధంగా విద్యా రంగం పరిపుష్టానికి మనసు నిలిపింది. 

ఎపుడో ఉమ్మడి ఏలుబడి జమానాలో 2012 డీఎస్సీ తర్వాత  ఇన్నాళ్లకు భారీ ఎత్తున టీచర్ రిక్రూట్మెంటుకు పూనుకొన్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. 2012 తదుపరి 12 ఏండ్లకు అంటే పుష్కర కాలానికి డీఎస్సీ భాగ్యం హస్తం చలవతో ఒనగూరింది.  రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లోగడ వెలువడింది.

 ఆ మేరకు రాష్ట్రంలోని 56 సెంటర్లలో జులై 18న మొదలైన డీఎస్సీ-2024 పరీక్షలు ఆగస్టు 5 దాకా జరుగుతాయి. ఈ ఉద్యోగాల కోసం 2.79 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో చాలామటుకు ఎగ్జామ్స్ కు హాజరు అవుతున్నారు. ఉపాధ్యాయుల నియామకాల్లో  తక్కిన ప్రక్రియ పూర్తయితే.. ఈ విద్యా సంవత్సరం నుంచే సర్కారీ బడుల బలోపేతానికి గట్టి పునాది పడుతుంది. బాల బాలికలకు చదువులు సజావుగా దరి చేరుతాయి.  ఉద్యోగార్థులలో పదకొండు వేల మందికి టీచర్లుగా ఉజ్వల భవిత శాశ్వతం అవుతుంది. 

- ఇల్లెందుల దుర్గాప్రసాద్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్