తాజ్మహల్ నిర్మాణంలో తెలంగాణలోని దేవరకొండ, మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో లభ్యమయ్యే పలుగు రాళ్లను వినియోగించినట్టు కాలిఫోర్నియాలోని జెమాలాజికల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్ సంస్థ డైరెక్టర్ వెల్డన్లు తాజ్ మహల్ నిర్మాణంపై ఐదేండ్లపాటు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. తాజ్మహల్ ప్రతి నిర్మాణంలోనూ కొత్తదనాన్ని తీసుకొచ్చేందుకు మొఘల్ వంశీయులు తెలంగాణ రాళ్లతోపాటు వివిధ దేశాల్లోని వజ్రాలు, వైడుర్యాలు, రత్నాలు, ముత్యాలను వినియోగించినట్టు వీరి అధ్యయనంలో తేలింది.
తెలంగాణ రాళ్ల ప్రత్యేకత
తెలంగాణలోని దేవరకొండ, మహబూబ్నగర్ పరిసర ప్రాంతాల్లో కనిపించే పలుగు రాళ్లు కొన్ని క్రిస్టల్(ఓ రకమైన స్పటికం) లక్షణాలు కలిగి ఉంటాయి. వాటిని క్రిస్టల్ క్వార్జ్గా పేర్కొంటారు. విలువైన స్ఫటికంగా పరిగణించే వీటిని నగల నగిషీల్లో వినియోగిస్తారు. వీటినే తాజ్మహల్ నిర్మాణానికి వినియోగించారు.