దండిగా ధాన్యం నిల్వ .. జిల్లాలో 8 నెలలు సన్నబియ్యం పంపిణీకి నో టెన్షన్​

దండిగా ధాన్యం నిల్వ ..  జిల్లాలో 8 నెలలు సన్నబియ్యం పంపిణీకి నో టెన్షన్​
  • వానకాలం సీజన్​లోనే 70 వేల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు స్టాక్​  
  • యాసంగి సన్నవడ్ల టార్గెట్ 6.80 లక్షల మెట్రిక్​ టన్నులు కాగా,​
  • ఐదు పొరుగు జిల్లాలకు సరఫరా చేయాలని నిర్ణయం

నిజామాబాద్, వెలుగు: రేషన్​ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీని ఈ నెల నుంచి రాష్ట్ర సర్కార్​ ప్రారంభించింది. బియ్యం పంపిణీలో కొరత రావద్దన్న సర్కార్ ఆదేశానుసారం నిజామాబాద్ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకున్నది. 8 నెలలకు సరిపడేలా గత వానకాలం సీజన్​లోనే 70 వేల మెట్రిక్ టన్నుల సన్న వడ్లను గోదాముల్లో నిల్వ చేసింది.  ప్రస్తుత యాసంగి సీజన్​లో 6.80 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు, 2.20 లక్షల టన్నుల దొడ్డు రకం వడ్లు కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో 664 కొనుగోలు కేంద్రాలను జిల్లా యంత్రాంగం ప్రారంభించింది. యాసంగి వడ్లను మే నెలలో పొరుగు జిల్లాలు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, అదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు పంపించేలా సివిల్ సప్లయ్ శాఖలో స్టేజ్ 1 కాంట్రాక్టర్లకు బాధ్యత అప్పగించింది.

జిల్లాలో 4.02 లక్షల రేషన్ కార్డులు..

జిల్లాలో మొత్తం 4,02,154 రేషన్​కార్డులు ఉన్నాయి. 13.10 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి సభ్యుడికి నెలకు ఆరు కిలోల బియ్యం ప్రభుత్వం అందిస్తుంది. ప్రతినెలా 8,248 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుంది.  

 సన్నాల పంపిణీ అప్పుడే పూర్తి..

జిల్లాలో 759 రేషన్ దుకాణాలు ఉన్నాయి. దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ప్రతినెలా మొదటివారం  కేవలం 22 శాతమే పంపిణీ జరిగేది. ఈ నెల నుంచి సన్న బియ్యం ఇస్తుండడంతో లబ్ధిదారులు రేషన్​ షాపుల వద్ద క్యూ కట్టారు.  వారం రోజుల్లోనే 72 శాతం కార్డుదారులు సన్న బియ్యం తీసుకెళ్లడం విశేషం.  గతంలో దొడ్డు బియ్యం  కిలోకు రూ.35 ఖర్చుకాగా, సన్న బియ్యం కిలోకు రూ.42 లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. దీంతో జిల్లాకు సంబంధించి  రాష్ట్ర ప్రభుత్వంపై రూ.6 కోట్లు అదనపు భారం పడుతుంది. 

బఫర్​ పెట్టినం..

జిల్లాలో  ఎనిమిది నెలలు సన్న బియ్యం పంపిణీకి సరిపోయే వడ్లు నిల్వ ఉన్నాయి. యాసంగి సన్న వడ్లు పక్క జిల్లాలకు వెళ్లనున్నాయి. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రానివ్వం. 

 శ్రీకాంత్​రెడ్డి, డీఎం, సివిల్​ సప్లయ్​