అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి..

అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్.. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి..

వాషింగ్టన్: అమెరికాలో తెలంగాణ యువతి మిస్సింగ్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లిన యువతి అదృశ్యమైంది. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కనగల్ మండలం శబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కోయ శ్రీజ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. మసాచుసెట్స్ బోస్టన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదువుతోంది. ఇతర తెలుగు విద్యార్థులతో కలిసి బోస్టన్‎లోని డోర్చెస్టర్‌ ఎడిసన్ గ్రీన్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. 

ఈ క్రమంలోనే నవంబర్ 2వ తేదీ రాత్రి ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లిన శ్రీజ అదృశ్యమైంది. పార్టీకి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. శ్రీజ మిస్సింగ్‎పై ఆమె స్నేహితులు బోస్టన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బోస్టన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ మిస్సింగ్ అలర్ట్ జారీ చేసి శ్రీజ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. శ్రీజ మొబైల్ చివరి లొకేషన్ ఆధారంగా కార్సన్ బీచ్, హార్బర్ పాయింట్, క్యాజిల్ ఐలాండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు వెతుకుతున్నారు.

మరోవైపు.. ఫ్రెండ్స్ ద్వారా శ్రీజ మిస్సింగ్ వార్త తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యాదగిరిరెడ్డి, రూప దంపతులకు శ్రీజ ఏకైక కుమార్తె. తమ బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చాలని ప్రభుత్వం, తెలుగు సంఘాలను వారు వేడుకుంటున్నారు. శ్రీజ అదృశ్యం కావడంతో ఆమె తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.