
ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ విద్యార్ధి ప్రమాద వశాత్తు మరణించాడు. రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా అశోక్ నగర్ బస్తీకి చెందిన 27 ఏళ్ల శ్రావణ్ కుమార్ అమెరికాలోని బోస్టన్ లో చదువుకుంటున్నాడు. ఆదివారం ఈస్టర్ పర్వదినం సందర్భంగా స్నేహితులతో కలిసి దగ్గరలోని బీచ్‌కు వెళ్లిన శ్రావణ్.. ఈతకొడుతూ ప్రమాదవశాత్తూ నీటమునిగిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలల ఉధృతికి సముద్రంలో గల్లంతయిన అతని కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి 2 గంటల(భారత్ కాలమానం ప్రకారం) ప్రాంతంలో అతని మృతదేహాన్ని బయటకు తీశారు .
శ్రావణ్ మృతి చెందిన విషయాన్ని అతని స్నేహితులు.. బెల్లంపల్లి పట్టణంలో ఉంటున్న శ్రావణ్ సోదరుడికి తెలిపారు. ప్రస్తుతం శ్రావణ్ తల్లిదండ్రులు వరంగల్‌లో మరో కొడుకు వద్ద నివాసముంటున్నారు. అమెరికాలో ఐటి పూర్తి చేసి, ప్రస్తుతం ఎంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తున్న శ్రావణ్, అక్కడే స్వయంగా ఓ హోటల్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలా ఎన్నో ఆశలతో భవిష్యత్తు ను బంగారుబాటగా తీర్చిదిద్దుకుంటున్న శ్రావణ్ ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.