- తల నుంచి దూసుకెళ్లిన మూడు బుల్లెట్లు
- మిస్ ఫైరా?.. ఆత్మహత్యనా?.. విచారిస్తున్న పోలీసులు
- పాతబస్తీలోని కబూతర్ఖాన్పోలీస్ ఔట్ పోస్ట్‌లో ఘటన
హైదరాబాద్, వెలుగు: సర్వీస్ రివాల్వర్ పేలి ఓ రిజర్వ్ ఎస్‌ఐ చనిపోయాడు. అతడి తల నుంచి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయి. దీంతో తల ఛిద్రమైంది. రివాల్వర్ మిస్ ఫైర్ అయ్యిందా.. లేక కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన పాతబస్తీలోని కబూతర్‌ఖాన్ పోలీస్ ఔట్ పోస్ట్‌లో జరిగింది. టీఎస్‌ఎస్‌పీ మహబూబ్‌నగర్ పదో బెటాలియన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ బాలేశ్వర్(48) కబూతర్‌ఖాన్ పోలీస్ ఔట్‌పోస్ట్‌లో ఇన్చార్జ్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట్ మండలం లక్ష్మీపూర్. ఔట్‌పోస్ట్‌లో ఓ అధికారికి రిలీవర్‌గా మూడురోజుల కిందనే బాలేశ్వర్ బాధ్యతలు చేపట్టాడు. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో బాలేశ్వర్ చేతిలోని తుపాకీ పేలింది. బుల్లెట్లు గదవ కింది నుంచి తలపై భాగంలోకి దూసుకెళ్లాయి.
దీంతో బాలేశ్వర్ తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. సిబ్బంది ఇచ్చిన సమాచారంతో సౌత్‌జోన్ డీసీసీ సాయిచైతన్యతో పాటు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు రౌండ్లు ఫైర్ అయినట్లు గుర్తించారు. గన్‌కు ఆటోమెటిక్ లోడింగ్ సిస్టమ్ ఉండడంతో మూడు బుల్లెట్లు ఫైర్ అయినట్లు అనుమానిస్తున్నారు. మిస్‌ఫైర్ వల్ల బాలేశ్వర్ మృతి చెందాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం బాలేశ్వర్ మృత దేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
గతేడాది కూడా ఇక్కడే మిస్‌ఫైర్
గత ఏడాది ఆగస్టు 23న కూడా కబూతర్‌ఖాన్ ఔట్‌పోస్ట్‌లోనే ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. గన్ మిస్ ఫైర్ కావడంతో సూర్యాపేట జిల్లాకు చెందిన భూపతి శ్రీకాంత్ అనే హెడ్‌కానిస్టేబుల్ చనిపోయాడు. ఇదే ఔట్‌పోస్ట్‌లో మరోసారి గన్‌ఫైర్ కావడం కలకలం రేపుతున్నది.