రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చలికాలంలో కూడా పగటిపూట ఎండలు మండుతున్నాయి. సాధారణంగా ఈ సమయానికి నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశించడంతో సహజంగానే వాతావరణం చల్లబడుతుంది. కానీ చలికాలంలో క్రమంగా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు ఎండాకాలం మాదిరిగా తయారవుతున్నాయి.
రోజురోజుకు పగటి ఉష్టోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. చలికాలంలో సగటున 3 నుంచి 5 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వాతావరణం వేసవి సీజన్‌ను తలపిస్తోంది.
కానీ ప్రస్తుతం రాష్ట్రంలో దానికి భిన్నంగా వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలను మించిపోతున్నాయి. వాతావరణంలో తేమ తగ్గడంతో ఉక్కపోత పెరుగుతుందని.. ఆకాశంలో మేఘాలు ఏర్పడకుండా నిర్మలంగా ఉంటుండటంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో వారం రోజుల పాటు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో శుక్రవారం (అక్టోబర్ 13) న పలు చోట్ల భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గరిష్ఠంగా ఖమ్మంలో 36.2, భద్రాచలంలో 36, ఆదిలాబాద్ 35.8, నల్లగొండ 35.5, నిజామాబాద్ 35.3, రామగుండం 35, మెదక్ 34.6, హనుమకొండ 34.5, హైదరాబాద్ 33.2, మహబూబ్‌నగర్ 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న రాష్ట్రంలో మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.