
- వరంగల్, -ఖమ్మం-, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించడానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తామని వరంగల్,-ఖమ్మం-, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీకి ఎన్నికైన శ్రీపాల్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని గురువారం శ్రీపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం దృష్టికి శ్రీపాల్ రెడ్డి కొన్ని సమస్యలను తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు.
2003 డీఎస్సీ టీచర్ల పాత పెన్షన్ కు సీఎం అంగీకరించారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి.. స్టూడెంట్స్ నష్టపోకుండా విద్యా శాఖలో ప్రమోషన్లు ఇవ్వాలని శ్రీపాల్ రెడ్డి కోరారు. ఇందుకు జీవో 67ను పునరుద్ధరించాలన్నారు. 12 ఏండ్లు పూర్తి చేసిన స్కూల్ అసిస్టెంట్స్, 24 ఏండ్లు పూర్తయిన ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరగా.. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రతినెలా పెండింగ్ బిల్లుల క్లియర్కు రూ.800 కోట్లు చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు శ్రీపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పెండింగ్ బకాయిలు ఆలస్యం అవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, గుండు లక్ష్మణ్ పాల్గొన్నారు.