
తెలంగాణ వీరప్పన్ పై ‘వెలుగు’లో వచ్చిన వరుస కథనాలు ప్రభుత్వ యంత్రాంగాన్నికదిలించాయి. కలప స్మగ్లింగ్‌లో ఆరితేరిన..తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ గా మారిన తెలంగాణ వీరప్పన్‌ను మూడు నెలలు మాటు వేసి మన రాష్ట్రపోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇక అడవిలో గొడ్డలి శబ్దం తగ్గిపోనుంది.. ఇష్టా రీతిగా అడవుల నరికివేత ఆగిపోనుంది .. కిరాయి డబ్బులకు చెట్లుకొట్టే కూలీలు ఇక అడవుల్లో కనిపించరు. నరికేవారు లేకపోవడంతో టేకు చెట్లు ఊపిరి పోసుకోనున్నాయి .
మంథని నియో జకవర్గం లోని పోతారం గ్రామానికి చెందిన ఎడ్ల శ్రీను 1999లో మొదట ఎరువులవ్యాపారం చేయగా అందులో నష్టాలు వచ్చాయి .పెద్దగా చదువుకోకపోవడంతో మంథని అడవులనులక్ష్యంగా చేసుకుని తనకు ఉన్న పరిచయాలతో అటవీప్రాంతాల నుంచి సైకిల్ ద్వారా కలపను అక్రమరవాణా చేసే పని మొదలు పెట్టాడు. ఇతరులు తెచ్చినకలప దుంగలను కొనుగోలు చేసి కొంత కమీషన్ పైవిక్రయించే వాడు. అలా అక్రమ వ్యాపారంలో తక్కువకాలంలో ఎక్కువ డబ్బులు రావడంతో అంతంతగానడుస్తున్న ఎరువుల వ్యాపారాన్ని పూర్తిగా వదిలేశాడు. 2009లో పూర్తి స్థాయి లో తనకు నమ్మకస్తులైనకొంతమంది వ్యక్తులతో కలిసి కలప అక్రమ వ్యాపారంమొదలు పెట్టి మాఫియా సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. మారుమూల అటవీ ప్రాంత ప్రజల అవసరాలకు డబ్బు ఆశ చూపించి ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడిఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలు, మహారాష్ట్ర,చత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాల్లో చెట్లను నరికి తెలంగాణవీరప్పన్ గా పిలిచేలా చేసుకున్నాడు.
‘వెలుగు’లో వరుస కథనాలు
కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీను ఆగడాలను వివరిస్తూ‘తెలంగాణ వీరప్పన్ ’ శీర్షికతో జనవరి 30న‘వెలుగు’ మెయిన్ పేజీలో కథనం వచ్చింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో టేకు కలప స్మగ్లింగ్ చేస్తూ ఎలాకోట్లకు పడగలెత్తాడు, మహారాష్ట్రలోనూ అతడిఅక్రమ కార్యకలాపాలు ఎలా విస్తరించాడు, అతడివల్ల అడవులు ఎలా నేలమట్టం అవుతున్నాయనే వివరాలు అందరినీ నివ్వెరపరిచాయి. అనంతరం‘అడవిలో అంతా మామూలే.. ’, ‘భూపాలపల్లి జిల్లా లో పోస్టంటే భలే గిరాకీ’ శీర్షికన వచ్చిన వరుస కథనాలు అధికారులను కదిలించాయి. అదే సమయంలో భావితరాలకు జీవనాధారాలైన అడవులను సంరక్షించాలని, కలప స్మగ్లింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో అటవీ, పోలీస్ శాఖ స్మగ్లర్ల జాబితాను సిద్ధం చేసింది. ఆ జాబితాలో మోస్ట్ వాంటెడ్ కలప స్మగ్లర్ గా ఎడ్ల శ్రీను నిలిచాడు.
స్మగ్లింగ్ లో మూడు టీంలు
శ్రీను ఎక్కువగా మంథని రిజర్వ్ డ్ ఫారెస్ట్ లోని మహదేవపూర్, దామె రకుంట, ఆరెంద, గూడూర్,అడవి ముత్తారం, ఖానాపూర్, రాపల్లి కోట, వీరాపూర్,అంబటి పల్లి, బొమ్మాపూర్, సర్వాయి పేట, మహారాష్ట్రలోని నడికూడ, అసరేల్లి, చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని తాళ్లగూడ ప్రాంతాల్లో చెట్లను నరికాడు. కలప స్మగ్లింగ్ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేసుకొని ఈటీంలకు ముందుగానే పెట్టుబడి కోసం డబ్బులిచ్చే వాడు. మొదటి టీం అడవికి వెళ్లి చెట్లను నరికితే, రెండో టీం నరికిన చెట్లను మైదాన ప్రాంతానికి తరలించే వారు. ఇక మూడో టీంవారు మైదాన ప్రాంతంనుంచి పట్టణాలకు వాహనాల ద్వారా నెంబర్ ప్లేట్లు మార్చుతూ తీసుకెళ్లి సామిల్ లకు అప్పగిస్తారు. అలాగే మహారాష్ట్ర బల్లార్ష కు చెందిన టేకు కలప రవాణా పర్మిట్ సంపాదించి దాని ద్వారా కలపను విక్రయించే వారు. ఆయా టీంలలోని సభ్యులకు వారి పనితనాన్ని బట్టి డబ్బులు ముట్టజెప్పే వాడు. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో చెట్లను నరికించి ఆ కలపను గోదావరి దాటించే పనులను స్థానికులకే అప్పగించే వాడు. వారు కలప దుంగలను గోదావరి నదిలో పడేస్తేవాటిని మరికొందరు తాళ్లతో కట్టి ఆ ఒడ్డు నుంచి ఈఒడ్డుకు తీసుకొచ్చే వారు. ఇక్కడికి రాగానే కలపదుంగలను చిన్నచిన్న ముక్కలుగా కోసి అనుకున్నప్రాంతానికి చేరవేసేవారు.
ఎడ్ల బండ్లే కీలకం
అటవీ ప్రాంతం నుంచి కలపను మైదాన ప్రాంతానికి తరలించడంలో ఎడ్ల బండ్లే కీలకంగా ఉండేవి. ఇందుకోసం శ్రీను స్మగ్లింగ్ లో భాగస్వామ్యులయ్యేవారికి ఎడ్లను కొనిచ్చేవాడు. ఇలా మహాదేవపూర్ ప్రాంతంలోని సర్వాయి పేట్ నుంచి దామె రకుంట, అరెంద, ఖానాపూర్, విలోచవరం, ఖాన్సాయి పేట, గూడూరు, ఎంకపల్లి, రాపల్లి కోట, వీరాపురం, గంగారం, సూరారం, అంబట్ పల్లి, కొత్తపల్లి గ్రామాల్లో కలప అక్రమ రవాణాకు ఎడ్లబండ్ల ద్వారా సహకరించిన 50 మందిని పోలీసులు గుర్తించారు.
కేసు నమోదైతే అదృశ్యం
గచిడిన 20 ఏళ్లుగా కలప స్మగ్లింగ్ చేస్తున్న శ్రీనుపోలీసు, అటవీ శాఖవారు అతనిపై ఏదైనా కేసునమోదు చేస్తే మాత్రం అదృశ్యమవుతాడు. కోర్టు బెయిల్ లేదా రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని కేవలం అతని అనుచరులు, స్పాట్ లో దొరికినవారిపై కేసులు పెట్టేలాగా చేసి తర్వాత ప్రజల్లోకి వచ్చే వాడు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వం అటవీ సంరక్షణపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం, ‘వెలుగు’లో వరస కథనాలు రావడం, ఇతనిపేరు పోలీస్ జాబితాలో అగ్రభాగంలో ఉండడంతో అజ్ఞాతంలోకి వెళ్లా డు. ఇలా అజ్ఞాతంలోకి వెళ్లడానికి పలువురు న్యాయవాదులు, రాజకీయ నాయకులుపూర్తి స్థాయిలో సహకరించారని పోలీసులు గుర్తించారు. ఎడ్ల శ్రీనును పట్టుకోవడానికి పోలీస్ వేట మొదలైనప్పటి నుంచి అతను హైదరాబాద్, విజయవాడ, తూర్పు గోదావరి, అన్నవరం, విశాఖపట్నం, అరకు,గుంటూరు, చిలకలూరిపేట, భద్రాచలం, వరంగల్లో తలదాచుకున్నాడు.
మూడు నెలలు ముప్పుతిప్పలు
అటు ప్రభుత్వం.. ఇటు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తుండటంతో ఎడ్ల శ్రీనును పట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయారు. అతన్ని పట్టుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగారు. ఇతర రాష్ట్రాలకూ వెళ్లారు. చివరికి అతని సెల్ ఫోన్ తో పాటు సహచరుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులపై నిఘా ఉంచారు. అయినా ఆచూకీ తెలుసుకోలేక పోయారు.శ్రీను నుంచి గతంలో మామూళ్లు తీసుకున్న అధికారులే అతనికి అన్ని విషయాలు చేరవేసేవారని, అందుకే అతని ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు చాలా కష్టమైందని సమాచారం. గోదావరిఖని సమీపంలోని గోదావరి నది తీరంలో పాతిపెట్టిన రూ.లక్షలు విలువ చేసే టేకు కలప దుంగలను పోలీసులు డ్రోన్ సహాయంతో పట్టుకున్నారు . కొందరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. మూడు రాష్ట్రాలకు వాంటెడ్ క్రిమినల్ గా ఉండడంతో శ్రీను ఆట కట్టించేందుకు రామగుండం పోలీసులతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ పోలీసులు, రాష్ట్ర స్థాయి ఏజెన్సీలు వలపన్నాయి. ఎట్టకేలకు మంథని ప్రాంతంలో పట్టుకున్నారు.