
హైదరాబాద్: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య తెలంగాణలో టెట్ నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఏప్రిల్ 15న పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలిపారు.
ఇంటర్ తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసినవారు టెట్ పేపర్-–1 పాసవ్వాలి. డిగ్రీ తర్వాత బీఈడీ చేసినవారు టెట్ పేపర్–-2లో ఉత్తీర్ణత సాధించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం సెక్షన్ 23(1) నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో అర్హత పొందడం తప్పనిసరి.
ఇప్పటి వరకు డీఈడీ, బీఈడీ తదితర కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు. కానీ, ఎన్సీటీఈ తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం టీచర్ల ప్రమోషన్లకూ టెట్ క్వాలిఫై తప్పనిసరి చేసింది. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) ను ఇక నుంచి ఏటా రెండు సార్లు నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ప్రతి ఏటా జూన్, డిసెంబర్/జనవరిలో నిర్వహించేలా ప్రభుత్వం స్పెషల్ షెడ్యూల్కూడా ఖరారు చేసింది. గతంలోనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది.